‘టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే’

Dr K Laxman challenges MIM to contest in all 119 seats - Sakshi

కుటుంబ పార్టీకి వణుకు పుట్టించిన శంఖారావ సభ

ఎంఐఎంకు దమ్ముంటే 100 సీట్లలో పోటీ చేయాలి: లక్ష్మణ్‌  

సాక్షి, హైదరాబాద్‌: అమిత్‌ షా సభ విజయవంతం కావడంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్‌ షా సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారని, కుటుంబ పార్టీలకు వణుకు పుట్టించేలా సభ జరిగిందన్నారు. అధికార పార్టీ డబ్బులు పంచినా వారి సభలకు జనాలు స్పందించలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని, బీజేపీకి అధికారం ఇవ్వాలన్న భావన ప్రజల్లో వ్యక్తం అవుతోందన్నారు. అమిత్‌ షా మీటింగ్‌తో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.

రానున్న ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి జరిగే ఎన్నికలా? ప్రజల మేలుకోసం జరిగే ఎన్నికలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ ఇంట్లో కూర్చొని అర్థంలేని ట్వీట్‌ చేశారన్నారు. ఎంఐఎం టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకొని కొన్ని స్థానాలు గెలవడం కాదు, దమ్ముంటే 100 సీట్లకు పోటీ చేయాలని, అప్పుడే ఎవరి బలం ఏంటో తెలుస్తుందన్నారు. అక్టోబర్‌లోగా 50 బహిరంగ సభలు నిర్వహిస్తామని, వాటికి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామన్నారు.

రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని ప్రభుత్వాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ నెల 17న హుజూర్‌నగర్‌లో తెలంగాణ విమోచన సభను నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్ర పథకాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఒవైసీపై పోటీకి అమిత్‌ షా అవసరం లేదని, బీజేపీ సామాన్య కార్యకర్త కూడా ఒవైసీని ఓడిస్తారని ఎద్దేవాచేశారు.

బీజేపీలో పలువురి చేరిక
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పలువురు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోరుట్లకు చెందిన మాజీ జర్నలిస్ట్‌ షికారి రామకృష్ణ కూడా బీజేపీలో చేరారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలాల్లోని గ్రామాలకు చెందిన అనేక మంది పార్టీలో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top