పోటీకే వారు.. పార్టీకి ఏమీ కారు..

Doubts in party circles in candidates selection - Sakshi

బీజేపీలో బీ–ఫారంల బెడద

ఎన్నికల కోసమే ‘కమలాన్ని’ ఆశ్రయిస్తున్న నేతలు

ఫలితాలు రాగానే దూరం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండి, కేవలం 45 స్థానాల్లోనే పోటీ చేసిన బీజేపీ తమ అభ్యర్థుల ఎంపికలో సరిగ్గా వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి.

పార్టీ కోసం పని చేసిన వారిని కాకుండా తమకు నచ్చిన వారిని, అప్పటిప్పుడు పార్టీలో చేరిన వారిని, ఇతర కారణాలతో కొందరిని ఎంపిక చేయడంతో నష్టం వాటిల్లందన్న వాదనలు న్నాయి. ఇలా 2014 ఎన్నికల్లో పార్టీలో చేరి, టికెట్లు సంపాదించుకొని పార్టీ తరపున పోటీ చేసిన వారు పలువురు ఇప్పుడు పార్టీలో లేరు.  ఈసారి 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెబు తున్న బీజేపీ గెలుపు గుర్రాలంటూ ఇష్టమొచ్చిన వారి కి టికెట్లు ఇవ్వకుండా పార్టీ కోసమే పని చేస్తున్న వారి నే బరిలోకి దింపాలని కార్యకర్తలు కోరుతున్నారు.

అభిప్రాయ సేకరణ ఎలా ఉంటుందో?
బీజేపీ వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో అభిప్రాయ సేకరణ చేపట్టి, అభ్యర్థులను ఖరారు చేస్తామని చెబుతోంది.కొత్తగా ఏర్పడిన జిల్లాల పార్టీ అధ్యక్ష బాధ్యతలకోసం అనేకులు పోటీ పడ్డారు. అప్పుడు పార్టీ నియామవళికి విరుద్ధంగా జిల్లాల్లో ఎన్నికలు జరిపారు. ఇది గ్రూపులకు దారితీశాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికకు అభిప్రాయ సేకరణ చేపడతామని చెబుతున్నా.. ఆ గ్రూపుల కారణంగా ఎలాంటివారిని ఎంపిక చేస్తారోనని కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు ఇచ్చి పార్టీని నమ్ముకొని పని చేస్తున్న వారికి తీరని అన్యాయం చేశారన్న విమర్శలున్నాయి. బీజేపీ గత ఎన్నికల్లో టీడీపీతో కలసి 45 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసింది. అలాగే 17 పార్లమెంట్‌ స్థానాల్లో 8 స్థానాలకు పోటీ చేసింది.వాటిలో 5 అసెంబ్లీ స్థానాలను, ఒక ఎంపీ సీట్‌ను బీజేపీ గెలుచుకుంది.అప్పుడు బరిలో తలపడిన అభ్యర్థుల్లో మూడో వంతు కూడా ఇప్పుడు పార్టీలో లేరు.  

జిల్లాల్లో ఇదీ తీరు...
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ పోటీలో నిలుపగా, వారిలో ముగ్గురు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఈయన కుమారుడు శశిధర్‌ రెడ్డి ఇతర పార్టీల్లో చేరారు.
 నల్గొండ జిల్లాలో బీజేపీ 4 స్థానాల్లో పోటీ చేసింది. వారిలో ప్రస్తుత తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ భార్య లక్ష్మి గత ఎన్నికల్లో నకిరేకల్‌లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీకి దూరమయ్యారు. కె. శ్రీనివాస్‌రెడ్డి అమెరికాకు వెళ్లిపోయారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 4 స్థానాల నుంచి పోటీ చేసినవారిలో ఇద్దరు టీడీపీ నుంచి, మరో ఇద్దరు టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చినవారే. వారు ఇప్పుడు పార్టీలో లేరు.  
 ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీజేపీ ఐదు స్థానాలలో పోటీ చేసింది. వీరిలో ఇద్దరు ఇతర పార్టీల నుంచి వచ్చి ఆ తర్వాత వెళ్లిపోయారు.
 గత ఎన్నికల్లో పార్లమెంటుకుగాను 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో  మహబూబ్‌నగర్‌ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మెదక్‌ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాధ్‌ , వరంగల్‌ అభ్యర్థి రామగళ్ల పరమేశ్వర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలలో బీజేపీ తరుపున పోటీ చేసిన తూర్పు జయప్రకాష్‌రెడ్డి తర్వాత  కాంగ్రెస్‌లోకి వెళ్లారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top