ఎవరికీ వారే.. అసమ్మతి తీరే

Disagreements in All Political Parties - Sakshi

ఇంటిపోరు.. బీజేపీ తీరు

ఈసారి ఎన్నికల్లో బీజేపీకి విపక్షాల పోటీతో పాటు ఇంటి పోరు కూడా తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన 71 మందిలో దాదాపు  పాతిక మందికి ఈసారి టికెట్లు రావని, వారిలో కొందరు తిరుగుబాటు జెండా ఎగరవేస్తారని విశ్వసనీయ వర్గాల కథనం. ఒకవైపు ఎస్పీ కూటమి, మరోవైపు కాంగ్రెస్‌ గట్టిపోటీ ఇస్తున్న నేపథ్యంలో ఇంటిపోరు కమలనాథులను కలవరపరిచే అంశం కానుంది.

కాంగ్రెస్‌: ప్రియాంకపైనే భారం
ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం కాంగ్రెస్‌కు నైతిక బలాన్నిస్తే ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే సుడిగాలి పర్యటనకు ఆమె ఏర్పాట్లు చేసుకున్నారు. యూపీ ఎన్నికల బాధ్యతలు చేపట్టిన ప్రియాంకపై పార్టీ శ్రేణులు పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. ఇందిరాగాంధీ తరహాలో ప్రియాంక పార్టీని బలోపేతం చేస్తారని  వారంటున్నారు. అయితే, ప్రియాంక వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియాంక తన అన్న రాహుల్‌ బాటలోనే నడుస్తోందని, తనకంటూ సొంత శైలిని ప్రదర్శించడం లేదని వారి భావన. కాంగ్రెస్‌ పార్టీకి 2014 ఎన్నికల్లో 7.53 శాతం ఓట్లు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 5.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రియాంక ఏ మాత్రం ఓట్ల శాతం పెంచగలుగుతారనేది ప్రశ్నార్థకం.

‘అఖిలేశ్‌’కు చిన్నాన్న ఎసరు!
సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి కూడా అనుకున్నంత గొప్పగా లేదు. అఖిలేశ్‌ యాదవ్‌ తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ ఇప్పటికే తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. శివపాల్‌ యాదవ్‌ ‘ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ’ ఈ ఎన్నికల్లో ఎస్పీని ఇబ్బందులు పెట్టేందుకు ఎత్తులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ టికెట్‌ లభించని వారికి తన వైపు తిప్పుకుని టికెట్‌ ఇవ్వాలని శివపాల్‌  ఆలోచిస్తున్నారు. అలాగే, బీఎస్పీకి వెళ్లిన సీట్లలో శివపాల్‌ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

‘ఏనుగు’ బలమెంతో?!
బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ– ఏనుగు గుర్తు) అధినేత మాయావతి పరపతి ఈ ఎన్నికల్లో ఏ మేరకు పనికొస్తుందన్నది అనుమానమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 80 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. 2017 అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా 19 సీట్లే దక్కించుకోగలిగింది. ఈసారి కాంగ్రెస్‌ ను కాదని సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలిపి బరిలోకి దిగుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top