3వేల కోట్లు దాటిన డిజిటల్‌ లావాదేవీలు

Digital payment transactions crossed Rs.3134 Crores - Sakshi

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు  ఐటీ శాఖ మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3134 కోట్ల రూపాయలకు చేరినట్లు ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 220 కోట్ల రూపాయల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరగ్గా ప్రభుత్వం చేపట్టిన స్థిరంగా చేపడుతున్న పలు చర్యల కారణంగా ఆ లావాదేవీల విలువ గణనీయంగా పెరుగుతూ 3 వేల కోట్లు దాటినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి తెలిపారు. అలాగే ఇంటర్నెట్‌ సదుపాయం లేని మొబైల్‌ ఫోన్ల ద్వారా యూఎస్‌ఎస్‌డీ సాయంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 15 వేల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్లు ఆయన చెప్పారు.

ట్రాయ్‌ సేకరించిన డేటా ప్రకారం దేశంలో ఇంటర్నెట్‌ చందాదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 206 సెప్టెంబర్‌ నాటికి దేశంలో 36 కోట్ల 74 లక్షలుగా  ఉన్న ఇంటర్నెట్‌ చందాదారుల సంఖ్య 2018 సెప్టెంబర్‌ నాటికి 56 కోట్లకు చేరిందని మంత్రి వివరించారు. సౌకర్యం, పారదర్శకత అనే రెండు అంశాల కారణంగా డిజిటల్ చెల్లింపు లావాదేవీలు క్రమంగా అనేక రెట్లు పెరుగుతూ డిజిటల్ ఆర్థికరంగం బలోపేతానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. డిజిటల్ చెల్లింపులపై ప్రజలలో విశ్వాసం, స్థైర్యం కలిగించి ఆ దిశగా వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల లావాదేవీల వ్యవస్థను అధునాతన సెక్యూరిటీ వ్యవస్థతో మరింత పటిష్టపరచే చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి చెప్పారు.

కాలానుగుణంగా శరవేగమైన మార్పులు చోటుచేసుకుంటున్నసమాచార సాంకేతిక రంగంలో కొత్తగా ఆవిర్భవించే సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి తద్వారా వినియోగదారులు, నెట్‌వర్క్‌లు, డేటా పరిరక్షణ కోసం తగినటువంటి సెక్యూరిటీ కంట్రోల్స్‌ను వినియోగించడం జరుగుతోంది. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌) జిడిటల్‌ టెక్నాలజీపై గురిపెట్టే సైబర్‌ దాడులపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వాటిని తిప్పికొట్టడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తూ ఉంటుందని మంత్రి చెప్పారు. అలాగే క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా జరిపే చెల్లింపు లావాదేవీల పరిరక్షణ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ పలు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top