బాబు పాలనలో అంతా దగా, మోసం

Different sections of people complained to YS Jagan At Prajasankalpayatra - Sakshi

ప్రతిపక్ష నేత జగన్‌కు వివిధ వర్గాల ప్రజల ఫిర్యాదు

పనులన్నీ వాళ్ల వారికే చేస్తున్నారు.. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటూ మాకు అన్నింటా అన్యాయమే

తిత్లీ తుపాను పరిహారం పంపిణీలోనూ వివక్ష 

పరిహారం అంటూ చెల్లని చెక్కు పత్రాలు ఇచ్చారని ఆవేదన

అందరి కష్టాలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అయ్యా.. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంతా దగా.. మోసం.. అబద్ధాలు.. అవినీతే. ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదు. నిరుపేదలు, దళితులపై దౌర్జన్యాలు మరింతగా పెరిగిపోయాయి. మీరు అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి. ఆరోజు కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం’ అని రైతులు, వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 329వ రోజు ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగించారు. దారిపొడవునా ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. హారతులు పట్టారు. భారీ సంఖ్యలో జనం జగన్‌ అడుగులో అడుగు వేశారు. మరో వైపు వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ బాధిత వర్గాల ప్రజలు అనేక మంది వైఎస్‌ జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు.   

సాగునీరు లేక పంటలు పండక.. 
తామంతా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నామని, వర్షాలు పడితేనే పంటలు సాగు చేస్తున్నాము తప్ప ఇతర సమయాల్లో ఇక్కట్లు పడుతున్నామని మేఘవరం పంచాయతీ చింతామణి గ్రామస్తులు ప్రతిపక్ష నేతకు మొర పెట్టుకున్నారు. ఇక్కడి ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు 900 ఎకరాల వరకు ఉన్నాయి. ఇవన్నీ వర్షాధారమే. కొండల నుంచి వాగుల ద్వారా నీరు వస్తున్నా, ఆ నీటిని సమీపంలోని చెరువుల్లోకి మళ్లించే కాలువలు లేవు. పక్కనే వంశధార కాలువలు పారుతున్నా వీరికి ఆ నీరు అందదు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూములకు సాగు నీరందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ భూములకు సంబంధించిన పట్టాలు రైతుల వద్ద ఉన్నా అధికారులు మాత్రం వాటి రికార్డులు లేవని చెబుతున్నారు. భూధార్‌లో కూడా ఈ భూముల వివరాలు చూపించడం లేదు. అధికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై ఇలా చేస్తున్నారని, తమకు సాగు నీరందించేలా వంశధార కెనాల్‌పై లిఫ్టు ఏర్పాటు చేయించాలని రైతులు వైఎస్‌ జగన్‌ను కోరారు.  

ఈ ప్రభుత్వం మమ్మల్ని విస్మరించిందన్నా.. 
ఆర్‌ఎంపీ వైద్యులు వారి ఇక్కట్లను జగన్‌కు వివరించారు. ‘అన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ వైద్యసేవలు అందించడానికి గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పారామెడిక్స్‌ శిక్షణకు శ్రీకారం చుట్టారు. దశాబ్దాల తరబడి గ్రామాల్లో వైద్యం అందిస్తున్న మాకు ఈ శిక్షణ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నది దీని ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ కొంత మందికి తొలి బ్యాచ్‌ కింద శిక్షణ కూడా ఇచ్చారు. తర్వాత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చింటే గ్రామీణులకు ప్రాథమిక వైద్యంతో పాటు మాకు జీవనోపాధి దొరికేది. ఈ ప్రభుత్వం ఈ విషయాన్నే పట్టించుకోలేదు’ అని ఆర్‌ఎంపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్తారు రాజశేఖరరావు, జిల్లా అధ్యక్షుడు పి.భాస్కరరావు ప్రతిపక్షనేతకు వివరించారు. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం ప్రాంతంలోని ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమై మత్స్య సంపద క్షీణిస్తోందని, ఫలితంగా వాటిపై ఆధారపడ్డ తాము ఉపాధి కోల్పోతున్నామని ఆ ప్రాంతానికి చెందిన బొందు అచ్చుబాబు తదితరులు జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్థానికులైన తమకు 600 ఉద్యోగాలు ఆశ చూపి, తీరా వేరే వారిని నియమించారని పలువురు యువకులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం బందపల్లి – కొత్తూరు క్రాస్‌రోడ్డులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు తమ సమస్యలు వివరిస్తూ కలిసి నడుస్తున్న రైతులు  

పరిహారం ఇవ్వకుండా కక్ష సాధింపు 
తిత్లీ తుపాను వచ్చి రెండు నెలలు దాటుతున్నా ఇంకా అనేక గ్రామాల్లో పరిహారం అందడం లేదని పాదయాత్ర సాగిన గ్రామాల ప్రజలు ప్రతిపక్ష నేతకు విన్నవించారు. తుపానులో ఇళ్లు, మేకలు, పశువులు, పశువుల పాకలు కోల్పోయినా తమకు పరిహారం ఇవ్వలేదని, కనీసం ఇళ్లపైన వేసుకొనేందుకు రేకులు కూడా అందించలేదని టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన పోలమమ్మ, కామేశ్వరి తదితరులు వాపోయారు. తాను రెండున్నర ఎకరాల్లో వేసిన వరి పంట, అర ఎకరాలోని మామిడి తోట తుపానులో ధ్వంసమయ్యాయని బండపల్లి గ్రామానికి చెందిన జెనియాపురం అప్పన్న అనే గిరిజన రైతు వాపోయాడు. ఆయనకు రూ.12,145 పరిహారం ఇస్తున్నట్లు చంద్రబాబు ఫొటోతో కూడిన చెక్కు నమూనా పత్రాన్ని అధికారులు అందజేశారు. దాన్ని బ్యాంకు వారికి చూపిస్తే వారి నుంచి స్పందన కనిపించడం లేదని, ఇప్పటికి తిరగడానికి రూ.600 ఖర్చయిందని ఆ రైతు వాపోయాడు. తుపానులో తాము పంటలు నష్టపోగా తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానినని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు పరిహారం అందకుండా చేస్తున్నారని జగన్నాథపురానికి చెందిన మాజీ సైనికోద్యోగి సీతారాం మహాపాత్రో ఆవేదన వ్యక్తపరిచారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారన్న కారణంతో గిరిజనులను పట్టించుకోవడం లేదని, తుపానులో సర్వం కోల్పోయినా పరిహారం అందించలేదని టెక్కలి మండలం బెండకాయలపేటకు చెందిన నీలవేణి, సావిత్రి, ఆరుద్ర తదితరులు వాపోయారు. తమ గ్రామంలో 50 కుటుంబాలు పంటలు, ఇళ్లు, పశువులు, పాకలు కోల్పోయాయని, అధికారులు నివేదికలు తయారు చేసినా చివర్లో తాము వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లమంటూ పరిహారం ఇవ్వడం లేదని నర్సింగపల్లి గ్రామస్తులు పలువురు ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారు. తమ గ్రామంలో నష్టపోయిన వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ వారికి పరిహారం అందించారని నీలాపురం గ్రామానికి చెందిన సన్యాసి తదితరులు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.  

ప్రశ్నిస్తే చాలు దౌర్జన్యం..
తమ భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్నారని, ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతకు చెప్పుకొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడి అనుచరులు తమపై దాడులు చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దళిత వర్గాల నేతలు జగన్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగున్నరేళ్లుగా అవినీతి, దోపిడీ, అబద్ధాలు తప్ప ఈ ప్రభుత్వం ఒక్క మంచి పనీ చేయలేదని వాపోయారు. మున్సిపల్‌ పాఠశాలల్లోని టీచర్ల పట్ల వివక్ష చూపుతున్నారని, తాము ఇతర టీచర్లకు మాదిరిగానే డీఎస్సీలో ఎంపికైనా జీపీఎఫ్, డీడీఓ అధికారులు, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులకు ప్రమోషన్లు కల్పించడం లేదని శ్రీకాకుళానికి చెందిన ఉపాధ్యాయులు గోవింద్, భూషణ్‌రెడ్డి తదిరులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏపీఎస్‌ ఆర్టీసీ టెక్కలి డిపోకు చెందిన నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కార్మికులు వైఎస్‌ జగన్‌ను కలసి విన్నవించారు. పదోన్నతులు, కారుణ్య నియామకాలు చేపట్టేలా చూడాలని కోరారు. అగ్రిగోల్డ్‌ బాధితులు, యాదవ, విశ్వ బ్రాహ్మణ, తెలగ, వడ్డెర తదితర కుల సంఘాల నేతలు వైఎస్‌ జగన్‌ను కలసి సమస్యలు వివరించారు. అందరి ఆవేదనలను ఆలకించిన ప్రతిపక్ష నేత వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.   

వైఎస్సార్‌ నా ప్రాణం నిలిపారు  
బాబూ.. మీ నాన్న గారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నా ప్రాణం నిలిపింది. నా గుండెలో రంధ్రం పడిన కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాను. ఆపరేషన్‌ చేయించుకనే ఆర్థిక స్థోమత లేక కుమిలిపోయాను. అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మహానుభావుడు వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా విశాఖలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ ఉచితంగా జరిపించుకున్నా. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మీరు మరింత మెరుగ్గా తీర్చిదిద్దండి. 
–బెండి రాజగోపాలరావు, పార్వతమ్మ దంపతులు, సీతాపురం, టెక్కలి మండలం 

ప్రభుత్వ ఐటీఐలను నిర్వీర్యం చేస్తున్నారు    
సార్‌.. టీడీపీ ప్రభుత్వం ఐటీఐలను నిర్వీర్యం చేస్తోంది. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఐఎంసీ విధానంలో దాదాపు 850 మందిమి కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు. 6 నెలలుగా జీతాలు అందటం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐలు 73 ఉంటే వాటిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రైవేట్‌ ఐటీఐలు 450 ఉన్నాయి. వాటిని బలోపేతం చేసే క్రమంలో మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మమ్మల్ని మీరే ఆదుకోవాలి.   
– గురుబిల్లి ప్రసాదరావు, ఐటీఐ ఉద్యోగి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా. 

డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి      
సార్‌... మా ప్రాంతంలో దాదాపు 25 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. అత్యధికంగా కిడ్నీ రోగులు ఉన్నారు. టెక్కలి మినహాయిస్తే ఎక్కడా డయాలసిస్‌ కేంద్రం లేదు. టెక్కలిలో ఉన్న కేంద్రం సక్రమంగా పని చేయటం లేదు. కిడ్నీ రోగులు వైద్య సేవల కోసం శ్రీకాకుళం, పాలకొండకు వెళ్లాల్సి వస్తోంది. సంతబొమ్మాళి మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. రూ.18 కోట్లతో మత్స్యకారులకు కోల్డ్‌ సోరేజీ నిర్మాణం కోసం భావనపాడులో శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. తర్వాత పట్టించుకోలేదు. యువతకు ఉద్యోగాలు లేక వలస పోతున్నారు. మీరు అధికారంలోకి రాగానే ఈ సమస్యలు పరిష్కరించాలి. 
–దుక్కా భూషణరెడ్డి, విద్యార్థి సంఘం నేత, నర్సాపురం, సంతబొమ్మాళి మండలం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top