ఈ సర్కారు పేదల కడుపు కొడుతోందయ్యా..

Different of People says their problems to YS Jagan At Prajasankalpayatra - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన వివిధ వర్గాల ప్రజలు 

వస్తున్న పింఛన్లూ ఆపేశారని అవ్వాతాతల ఆవేదన 

ఎన్నిమార్లు దరఖాస్తు చేసినా కనికరం లేదని వితంతువుల మండిపాటు

తిత్లీ బాధితులను గాలికొదిలేసిందని రైతుల ఆగ్రహం

డిసెంబర్‌ వచ్చినా పాఠ్యపుస్తకాలు అందలేదని విద్యార్థుల ఫిర్యాదు 

అందరి సమస్యలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మీ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు అర్హులైన వారందరికీ పింఛన్లు, ఇళ్లు.. కాదనకుండా ఇచ్చారయ్యా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లు ఇవ్వడం అటుంచి, ఏదో ఒక వంకతో వస్తున్న పింఛన్లను సైతం ఆపేశారు. అన్ని అర్హతలు ఉన్న మేము పింఛన్‌ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనికరించడం లేదు. పేదల కడుపు కొడుతోంది’ అని పలువురు అవ్వాతాతలు, ఒంటరి మహిళలు ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 331వ రోజు బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం చాపర నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పట్టుపురం, జోడూరు క్రాస్, రామచంద్రపురం క్రాస్, జాడుపల్లి, పదనాపురం క్రాస్, ఎస్‌.జాడుపల్లి క్రాస్, రంగడి ఘాటి వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ జగన్‌ అడుగులో అడుగువేసి మద్దతు తెలిపారు. మరో వైపు సమస్యలూ విన్నవించుకున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దయవల్ల పింఛన్‌ వచ్చేదని, ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని నిలిపి వేశారని, తిండికి కూడా ఇబ్బంది పడుతున్నామని, తమకు నీడనిచ్చే ఇళ్లు తిత్లీ తుపానులో ధ్వంసం అయినా ప్రభుత్వం ఆదుకోలేదని పట్టుపురం గ్రామానికి చెందిన సోద సవరమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పదేళ్ల క్రితం తన భర్త మరణించగా ఇద్దరు పిల్లలతో కష్టంగా బతుకీడుస్తున్నానని, ఈ ప్రభుత్వం పెన్షన్‌ కాదు కదా ఎలాంటి సాయమూ అందించలేదని చాపర గ్రామానికి చెందిన పోకల విశాలాక్షి అనే మహిళ రోదిస్తూ చెప్పింది. తన భర్త మరణించడంతో పెన్షన్‌ కోసం దరఖాస్తు చేస్తే జన్మభూమి కమిటీ తనకు కాకుండా వేరేవారికి ఇప్పించిందని పాతమారడి కోటకు చెందిన ఎండమ్మ అనే మహిళ వాపోయింది.   
పాతపట్నం నియోజకవర్గం పట్టుపురంలో జన సందోహం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌   
 
మా భూములు లాక్కొంటున్నారయ్యా.. 
వంశధార, బాహుదా నదుల అనుసంధానం పేరిట హైలెవెల్‌ కెనాల్‌ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం మా భూముల్ని లాక్కొంటోందని పలు గ్రామాల ప్రజలు వైఎస్‌ జగన్‌కు మొర పెట్టుకున్నారు. గతంలో   ఆ‹ఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం భూములు కోల్పోవలసి వచ్చిందని చెప్పారు. ఆ రిజర్వాయర్‌ను త్వరితగతిన నిర్మించకుండా ఈ ప్రభుత్వం నత్తనడకన పనులు సాగిస్తోందన్నారు. ఫలితంగా భూములు ఇచ్చిన తమకు గానీ, ఈ రిజర్వాయర్‌పై ఆధార పడిన ఇతర రైతులకు గానీ లాభం లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు వంశధార, బాహుదా నదుల అనుసంధానం అంటూ హైలెవెల్‌ కెనాల్‌ను తెరపైకి తెచ్చి  మిగిలిన మా భూముల్ని తీసుకొంటోందని వాపోయారు. దీనివల్ల చాపర, పట్టుపురం, జోడూరు, మారుడికోట పంచాయతీలలోని రైతులు అన్యాయమై పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.   
 
ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైనా పార్ట్‌ టైమ్‌ వేతనాలే.. 
ఏపీపీఎస్సీ ద్వారా నియామకమైన 205 మందిని ఈ ప్రభుత్వం పార్ట్‌ టైం గౌరవ వేతనదారులుగా కొనసాగిస్తోందని పలువురు గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లు ప్రతిపక్ష నేతకు విన్నవించారు.  కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు తగిన అన్ని అర్హతలు ఉన్న తమను గ్రామ స్థాయిలోని రెవెన్యూ వ్యవహారాలతోపాటు, ఎమ్మార్వో కార్యాలయాల్లోని సేవలకూ వినియోగించుకుంటూ రూ.10,500 ఇస్తోందన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు మించి తాము పని చేస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదని చెప్పారు. తమను ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడం లేదని జాడుపేట గ్రామానికి చెందిన కౌలు రైతులు ప్రతిపక్షనేతకు విన్నవించారు. ‘మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పంట వేశాను. ఎకరాకు రూ.30 వేల వంతున మొత్తం రూ.90 వేల పైబడి మదుపులు పెట్టాం. వరుస తుపానులతో పంట నష్టపోయా. వరి వోవులు తడిచి మొలకలొచ్చాయి. దిగుబడి ఎకరాకు 18 బస్తాలు కూడా వచ్చేట్టు లేదు. భూ యజమానికి 22 బస్తాలు ఇవ్వాల్సి ఉంది. ఇక నాకు మిగిలేదేంటి? తుపాను నష్ట పరిహారం పైసా రాలేదు. మీరైనా కౌలు రైతులను ఆదుకోవాలన్నా’ అని మెళియాపుట్టి మండలం జాడుపేట గ్రామానికి చెందిన రైతులు కోట భీముడు, శశమ్మ వైఎస్‌ జగన్‌కు విన్నవించారు. 

వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  ​​​​​​​

పరీక్షలు దగ్గర పడుతున్నా పాఠ్య పుస్తకాల్లేవు 
‘అన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాలుగేళ్లుగా ఒక్కసారి కూడా పాఠ్య పుస్తకాలు సక్రమంగా పరఫరా చేయలేదు. దీంతో పదవ తరగతి చదువుతున్న మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికీ సాంఘిక శాస్త్రం పుస్తకం రాలేదు. కొన్ని తరగతులకు సైన్సు పుస్తకాలు రాలేదు. కోర్సును ఆపేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను అభ్యసించ లేకపోతున్నాం’ అని చాపర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిపక్ష నేతకు విన్నవించారు. అగ్రిగోల్డ్‌ సంస్థ తమను నిండా ముంచిందని, మీరే ఆదుకోవాలని బాధితులు జగన్‌ను కోరారు.  సాక్షర భారత్‌ కోఆర్డినేటర్‌గా ఉంటూ అగ్రిగోల్డ్‌ ఏజెంటుగా పని చేసిన తాను ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చిందని కురమాన లక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లను ప్రభుత్వం అన్యాయంగా తొలగించడంతో ఉపాధి కోల్పోయానని, అగ్రిగోల్డ్‌ విషయంలోనూ ప్రభుత్వం మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని వాపోయింది. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. కాగా, విశాఖపట్నం నార్త్‌కు చెందిన మునీల్‌ఖాన్, మహ్మద్‌ షబ్బీర్, భీమిలికి చెందిన ముర్తుజ, ముస్తఫాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.    

పింఛను నిలిపేశారయ్యా.. 
అయ్యా.. ఇటీవల ప్రమాదంలో కుడి చేయి విరిగిపోయింది. ఎటువంటి ఆధారం లేదు. ఆనారోగ్యంతో బాధపడుతున్నా. తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నా. అయినా నా పింఛన్‌ ఆపేశారు. అధికార పార్టీ వారు అన్యాయం చేస్తున్నారు. మీరే న్యాయం జరిగేలా చూడండి. 
– సోద సవరమ్మ, పట్టుపురం, మెళియాపుట్టి మండలం  

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి 
సార్‌.. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ పథకం కింద 1300 మందిమి ఐసీటీసీ (ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌)లలో విధులు నిర్వహిస్తున్నాం. సర్వజన ఆస్పత్రులు, జిల్లా కేంద్ర, ప్రాంతీయ, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ క్యాడర్ల కింద పని చేస్తున్నాం. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల మాçనసిక సాంత్వనే ధ్యేయంగా సామాజిక స్పృహతో 18 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మా పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, సమాన పనికి సమాన వేతనం అందజేయడం లేదు. మాకు న్యాయం జరిగేలా చూడండి. 
– జి.బాబురావు, పాతపట్నం 

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి 
అన్నా.. మేము వలస కార్మికులం. ఆరుగాలం శ్రమించి కొద్ది కొద్దిగా కూడ బెట్టుకున్న డబ్బులను అగ్రిగోల్డ్‌లో జమ చేశాం. దీంతో పాటు రూ.60 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాం. ఈ కంపెనీ మా డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్ట పోయాం. మా ఆడబిడ్డలకు  ఎలా వివాహాలు చేయాలో తెలియడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలన్నా. 
– బొల్ల పద్మ, జడుమూరు, మెళియాపుట్టి మండలం  

నా పెన్షన్‌.. మనవడి వైద్యానికే సరిపోతోంది 
జగన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే పగడాలమ్మ ఆవేదన    
శ్రీకాకుళం అర్బన్‌ : తనకు ప్రతినెలా వచ్చే పింఛన్‌ డబ్బులు రూ.30 వేలు తన మనవడి కిడ్నీ సంబంధిత వ్యాధి వైద్యం కోసమే సరిపోతోందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే చుక్కా పగడాలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో బుధవారం ఆమె తన కష్టాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో చెప్పుకుని వాపోయారు. తన మనవడు నాలుగేళ్లుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నాడన్నారు. మీరు సీఎం కాగానే ఆదుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని, మీరు సీఎం అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top