టీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు!

Danam Nagender quits Congress ,may join TRS - Sakshi

గ్రేటర్‌పై పట్టుకు కేసీఆర్‌ పావులు

రాజధానిలో కాంగ్రెస్‌ పార్టీని ఖాళీ చేయించడమే లక్ష్యం

కారెక్కనున్న మాజీ మంత్రులు దానం, ముకేశ్‌

అదే బాటలో ఇంకొందరు నగర కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిలోకి భారీగా చేరికలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టి ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతు న్నారు. గ్రేటర్‌ కాంగ్రెస్‌నేతలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నారు.

మాజీ మంత్రులు దానం, ఎం.ముకేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ చేరికల బాధ్యతలను మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. దానం, ముకేశ్‌లతో మంత్రి తలసాని సంప్రదింపులు జరుపుతున్నారు. దానం శుక్రవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశాక రాత్రి తలసానితో భేటీ అయ్యారు.

గ్రేటరే లక్ష్యంగా ఎత్తులు
వచ్చే ఎన్నికల నాటికి గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చడంతో పాటు కాంగ్రెస్‌కు నగరంలో పేరు ప్రతిష్టలున్న అభ్యర్థులే లేకుండా చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్‌ నైతిక స్థైర్యంపై దెబ్బ కొట్టడంతో పాటు, ఎన్నికలకు తాము సిద్ధమంటూ సవాలు విసరడం సీఎం వ్యూహంలో ప్రధానాంశమని టీఆర్‌ఎస్‌ ముఖ్యులంటున్నారు. దానం, ముకేశ్‌లను చేర్చుకోవడం అందులో భాగమేనని చెబుతున్నారు.   తెలంగాణకు ఆయువుపట్టయిన గ్రేటర్‌లోనే టీఆర్‌ఎస్‌కు తిరుగు లేకుండా చేసే ఎత్తుగడతో కేసీఆర్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

సికింద్రాబాద్‌ లోక్‌సభపై దానం గురి?
టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్దంచేసుకున్న దానం సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరుకుంటున్నట్టుగా టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ టికెట్లను తాను సూచించినవారికే ఇవ్వాలని కోరినట్టు చెబుతున్నారు. కేసీఆర్‌ కూడా అంగీకరించినట్టు తెలిసింది.

కాకపోతే సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ విషయంలో దానంకు టీఆర్‌ఎస్‌ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ఎన్నికల నాటికి పరిణామాలను అనుకూలంగా మార్చుకుంటానని, సికింద్రాబాద్‌ టికెట్‌ తనకే ఇస్తారని దానం ధీమాగా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక ముకేశ్‌కు, లేదా ఆయన కుమారుడు విక్రం గౌడ్‌కు గోషామహల్‌ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.

తలసానితో దానం భేటీ
దానం నాగేందర్‌ శుక్రవారం రాత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌కు రాజీనామా నేపథ్యం లో రాజకీయ పరిణామాలపై చర్చిం చారు. ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరడంపై చర్చ జరిగిందని చెబుతున్నారు. కేసీఆర్‌ అనుమతి అనంతరం తేదీని ప్రకటించాలని నిర్ణయించారు. భేటీ అనంతరం తనను కలిసిన విలేకరులతో తలసాని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లోకి ఎవరు చేరినా ఆహ్వానిస్తామన్నారు. దానం చేరికపై శనివారం స్పష్టత వస్తుందని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top