వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదు

Damage to the state with Bundh - Sakshi

బంద్‌తో రాష్ట్రానికి నష్టం

ఆర్టీసీకి రూ.12కోట్ల నష్టం వచ్చిందన్న చంద్రబాబు

అరగంట నిరసన చాలని వ్యాఖ్య

సాక్షి, అమరావతి : నిరసనల పేరుతో నిర్వహిస్తున్న బంద్‌లు రాష్ట్రానికి నష్టదాయకం కారాదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఒకరోజు బంద్‌వల్ల దుకాణాలు మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారని, ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వచ్చిందని, 65 లక్షల మంది ప్రయాణీకులు ఇబ్బందిపడ్డారని ఆయనన్నారు. మనల్ని మనం శిక్షించుకోరాదని, మనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని, అందుకే అరగంట సేపు నిరసనలో పాల్గొనాలని, అధికంగా మరో అరగంట సేపు పనిచేయాలని సీఎం కోరారు.

ఉండవల్లిలోని తన నివాసం పక్కనున్న గ్రీవెన్స్‌ హాలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని, 15–20 రోజులపాటు అన్ని గ్రామాల్లో ఈ యాత్రలు చేసి చివరిగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని చంద్రబాబు సూచించారు. ఈనెల 20న తాను విజయవాడలో నిరసన దీక్ష చేస్తున్నానని, దీనికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు జరగాలని చెప్పారు. దీక్షల నేపథ్యంలో 20న జరగాల్సిన దళిత తేజం–తెలుగుదేశం సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదు: రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ గెలవదనే ముద్రపడిందని చంద్రబాబు చెప్పారు. పదవి వినయం పెంచాలే తప్ప అహం పెంచితే పతనం తప్పదని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించారు. ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు రావల్సిన రూ.2,723.49 కోట్లను విడుదల చేయాలని కోరుతూ కేంద్ర జలవనరులు, ఆర్థిక శాఖ మంత్రులు నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీలకు లేఖలు రాయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top