కాంగ్రెస్‌ ‘తీన్‌’మార్‌

Congress will form the government in three states  - Sakshi

మూడు రాష్ట్రాల్లోనూ విజయమే 

  సీఎం ఎంపికే కష్టంగా మారిన వైనం 

  సీఎంగా ఎవరు కావాలో చెప్పాలంటూ శ్రేణులకు రాహుల్‌ సందేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ తీన్‌మార్‌ మోగించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అదీ ఇన్నాళ్లూ బీజేపీ పట్టున్న రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ముందు ఈ విజయాలు లభించడం కాంగ్రెస్‌కు గొప్ప బలాన్నిస్తోంది. అయితే, ఈ మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీ అధిష్టానానికి కఠిన సవాలుగా మారింది.  
ఛత్తీస్‌గఢ్‌లో సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌.. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లోనూ మిత్రుల మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. బుధవారం ఉదయం వరకు కొనసాగిన కౌంటింగ్‌లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 104, బీఎస్పీకి 2, ఎస్పీకి 1, ఇతరులకు 4 సీట్లు వచ్చాయి.

ఎస్పీ, బీఎస్పీ మద్దతిచ్చేందుకు ముందుకు రావడంతో 230 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్‌ 116 స్థానాల మేజిక్‌ ఫిగర్‌ను చేరడం కష్టమేం కాలేదు. కానీ, కీలక నేతలు, పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాల్లో ఎవరిని సీఎం చేయాలనేది పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి తలనొప్పిగా మారింది. అలాగే, 199 స్థానాల రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ 99 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి ఒకే స్థానం అవసరమైన నేపథ్యంలో 6 సీట్లు గెలుచుకున్న బీఎస్పీ, ఇతర పార్టీ లు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇక్కడ కూడా కీలక నేతలు సచిన్‌ పైలట్, అశోక్‌ గహ్లోత్‌ల మధ్య సీఎం పీఠంపై పీఠముడి ఏర్పడింది.

ఛత్తీస్‌గఢ్‌లోనూ తమరధ్వజ్, భూపేశ్‌ బఘేల్, టీఎస్‌ సింగ్‌ దేవ్‌ల మధ్య సీఎం కుర్చీపై పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. సీఎం ఎవరో నిర్ణయించాలంటూ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకే బాధ్యత అప్పగించారు. దాంతో రేసులో ఉన్న నేతలను రాహుల్‌ హుటాహుటిన ఢిల్లీ పిలిపించారు. దాంతోపాటు, పార్టీ అంతర్గత సందేశ వేదిక ‘శక్తియాప్‌’ను ఉపయోగించుకుని పార్టీ శ్రేణులకు రాహుల్‌ ఒక ఆడియో సందేశాన్ని ఇచ్చారు. మూడు రాష్ట్రాల సీఎంలుగా ఎవరిని ఎన్నుకుంటారో చెప్పాలని వారిని కోరారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top