కూటమికి ఓటు.. ప్రాజెక్టులకు చేటు

Congress-TDP pact big hurdle: KTR - Sakshi

కూటమికి ఓటేస్తే మన జుట్టు బాబు చేతిలో పెట్టినట్లే

ఖమ్మంలో పదికి పది మనమే గెలవాలి: కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ మాజీమంత్రి జలగం ప్రసాదరావు

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమికి ఓటేస్తే మన జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో పెట్టినట్లేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ చంద్రబాబు తెలంగాణ వనరులపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌తో కలిశారన్నారు. శనివారం ఇక్కడ కేటీఆర్‌ సమక్షంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారని, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దన్నారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాదని, ఇప్పటికే 90 శాతం పూర్తయిన కాళేశ్వరం కూడా వెనక్కి వెళ్తుందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు పొత్తు కుదుర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్‌కు చంద్రబాబు వీణను బహూకరించారని, త్వరలో ఇద్దరూ వీణ వాయించుకోవల్సిందేనని ఎద్దేవా చేశారు.  

ఆలోచించి ఓటేయాలి...
ఏపీ భవన్‌లో చంద్రబాబు గది వద్ద రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు బారులు తీరారని, సీనియర్లంతా టికెట్ల కోసం బాబు పంచన చేరడం బాధాకరమని, కాంగ్రె స్‌ ఇలాంటి స్థితికి దిగజారుతుందనుకోలేదని కేటీఆర్‌ అన్నారు. టీడీపీ– కాంగ్రెస్‌ పొత్తుపై ఇరు పార్టీల వద్ద సమాధానం లేదన్నారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆషామాషీగా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని, కూటమికి ఓటేస్తే మన మరణశాసనాన్ని మనమే రాసుకున్నట్లు అవుతుందన్నారు.

కూటమికి అధికారం ఇస్తే ఇక్కడ జీవన విధ్వం సం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తెలంగాణని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లిన సీఎం కేసీఆర్‌ను మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకువచ్చే బాధ్యత జలగం, తుమ్మల నాగేశ్వర్‌రావుపై ఉందన్నారు. జలగం ప్రసాదరావును టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్‌ ప్రత్యేకంగా ఆహ్వానించారన్నారు. అనంతరం ప్రసాదరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇతరుల పాలనలోకి వెళ్లొద్దనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

కూటమి గెలిస్తే కృష్ణా నీళ్లు మనకు రావని, సాగర్‌ గేట్లు బంద్‌ అవుతాయన్నారు. ఖమ్మం జిల్లాలో జలగం కుటుంబానికి ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉందని, తాను ప్రసాదరావు కింద పనిచేశానని తుమ్మల అన్నారు. తాము రాజకీయ ప్రత్యర్థులమైనప్పటికీ ఆ కుటుం బాన్ని ఎన్నడూ అగౌరవపర్చలేదన్నారు. ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌ ప్రతిపాదించిన ప్రాజెక్టులు పూర్తయి తే జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top