ట్విటర్‌లో ట్రోల్‌.. ఖాతాను డిలీట్‌ చేసిన రమ్య

Congress Social Media Head Divya Spandana Deleted Her Twitter - Sakshi

సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, ఆ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ నాయకురాలు రమ్య (దివ్యా స్పందన) తన ట్విటర్‌ ఖాతా తొలగించారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే రమ్య ఆశ్చర్యకరంగా ట్విటర్‌ నుంచి వైదొలిగారు. కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌కు ఆమెకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లచే తీవ్ర విమర్శల పాలైన విషయం విధితమే. ఆ కామెంట్లకు తట్టుకోలేకనే ఆమె ట్విటర్‌ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఆమెను ట్విటర్‌లో 8లక్షలకు పైగా ఫోలోవర్స్‌ ఉన్నారు.

కేబినెట్‌లో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్‌.. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిర్మలకు ప్రశంసలు అందుతున్నాయి. రమ్య కూడా నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు.. ‘1970లో ఇందిరా గాంధీజీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహిళలను గర్వపడేలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆ శాఖను చేపట్టినందుకు అభినందనలు. కానీ జీడీపీ అంత గొప్పగా ఏమీ లేదు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా తప్పక కృషి​ చేస్తారని తెలుసు. మీకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది. శుభాకాంక్షలు’ అని రమ్య ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో రమ్య ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. దేశ తొలి ఆర్థిక మంత్రి అని నిర్మలా సీతారామన్‌ను పిలవడం కాంగ్రెస్‌ వాళ్లకు ఇష్టం ఉండదేమో అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మేడమ్‌.. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉండి, ఆర్థిక శాఖను తన వద్ద పెట్టుకున్నారు. కానీ నిర్మలాజీపై నమ్మకంతో ప్రధాని ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబట్టి తొలి ఆర్థిక మహిళా మంత్రిగా ఆమెను పరిగణించాలి. ఇక జీడీపీ అంటారా. మీ దృష్టిలో జీడీపీ అంటే గాంధీ డైనస్టీ పాలిటిక్స్‌ అనుకుంటా. ఎందుకంటే మీకు ఆ పదానికి వివరణ, అర్థం తెలియదు కదా. అభినందించే క్రమంలో ఇలా రాజకీయాలు చేయడం, ప్రజలను పక్కదారి పట్టించడం సరైంది కాదు’ అంటూ విపరితంగా ట్రోల్‌ చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top