తహ తహ!

Congress Party Trying to Win in Hyderabad Lok Sabha Places - Sakshi

గ్రేటర్‌లో పూర్వ వైభవం కోసం  కాంగ్రెస్‌ ప్రయత్నం  

అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం కరువు

ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తానికి గుడ్‌బై  

మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం కసరత్తు

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు ఆయా సెగ్మెంట్లలో కనీస ప్రాతినిధ్యం కానరావడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకోవడంతో పాటు గ్రేటర్‌ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత ఎన్నికల్లో నియోజకవర్గాల్లో గట్టి పట్టున్నా.. మారుతున్న రాజకీయ పరిణామాలతో క్రమంగా చేజారుతూ వచ్చింది. తాజాగా  కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మాత్రం లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి గత ఎన్నికల్లో చేజారిన  స్థానాలను తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌తో శత్రువైఖరి అవలంబిస్తున్న మజ్లిస్‌ పార్టీని సొంత గడ్డపైనే దెబ్బకొట్టి అక్కడ పాగా వేసేందుకు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన   టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నించింది. కానీ, అజారుద్దీన్‌ నిరాసక్తత వ్యక్తం చేయడంతో పాటు సికింద్రాబాద్‌ లోక్‌సభ సీటుపై ఆసక్తి కనబర్చారు. దీంతో ‘హైదరాబాద్‌’కు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఫిరోజ్‌ఖాన్‌ అభ్యర్థిత్వాన్ని ఖారారు చేసింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రెండుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అంజన్‌ కుమార్‌ యాదవ్‌కు మళ్లీ అవకాశం కల్పించింది. గత ఎన్నికలో సైతం అంజన్‌ కుమార్‌ బరిలో దిగినప్పటికీ ఓటమి చెందారు. ఇప్పుడు తిరిగి హస్తం అధిష్టానం అంజన్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది. అదేవిధంగా మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌కు ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్‌రెడ్డిని బరిలోకి దింపింది. చేవెళ్ల నుంచి ఇటీవల పార్టీలో చేరిన అక్కడి సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం అచితూచి వ్యవహరించినట్లు కనిపిస్తోంది.

గ్రేటర్‌పై ‘హస్తం’ పట్టు బిగించేనా!
అసెంబ్లీ ఎన్నికల్లో పరాభావం పాలైన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పూర్వవైభం సాధించాలని ఆచితూచి అడుగులేస్తోంది. వాస్తవంగా నగరంలో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అవిర్భావం అనంతరం పట్టు జారిపోసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన ఎన్నికైన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌కు పరాభావం తప్పలేదు. అంతకు ముందు హైదరాబాద్‌ మినహా సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కుంచుకోటైనప్పటికీ మధ్యలో రెండుసార్టు విజయం బీజేపీ చేతిలోకి వెళ్లిపోయింది. తర్వాత వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహించినా.. గత లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి విజయాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ పట్టు సడిలినప్పటికీ టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. నియోజకవర్గంలో సామాజికంగా గట్టి పట్టు, ఓటు బ్యాంక్‌ కలిసివస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. దీంతో అక్కడి నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన అంజన్‌ కుమార్‌ యాదవ్‌నే ఫైనల్‌ చేసింది. గత ఎన్నికల్లో చేజారిన మాల్కాజిగిరిని తిరిగి దక్కించుకునేందుకు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న రేవెంత్‌రెడ్డిని బరిలో దింపి విజయంపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ వైపు వెళ్లడం కొంత ప్రతికూలంగా మారింది.

అయితే, ఆ ప్రభావం పడకుండా రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌ గతంలో చేజారినా ఎన్నికైన ఎంపీ హస్తం గూటికి చేరడంతో ఆయననే తిరిగి రంగంలోకి దింపింది. ఇటీవలే ఈ లోక్‌సభ పరిధిలోని సెగ్మెంట్‌ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయిన్పప్పటికీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇదీలా ఉండగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరసగా మూడుసార్లు బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చిన ఫిరోజ్‌ ఖాన్‌ అభ్యర్థిత్వం కొంత కలిసొస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top