వైఖరి మార్చుకున్న రాహుల్‌ గాంధీ 

Congress party President Rahul Gandhi Changed His Attitude - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా శనివారం నాడు బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌ గాంధీ వైఖరిలో, మాటతీరులో ఎంతో మార్పు వచ్చింది. 13 ఏళ్ల క్రితం 'యాంగ్రీ యంగ్‌మేన్‌' గా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చాలా సౌమ్యంగా మాట్లాడారు. ప్రేమాభిమానాలు, సౌభ్రాతత్వం గురించి ఎక్కువ సేపు వివరించారు. చివరకు బీజేపీ కార్యకర్తలను తన సోదరులు, సోదరీమణులంటూ సంబోధించారు. ఎన్నికల్లో బీజేపీని కూడా ప్రేమతోనే ఓడిస్తామని చెప్పారు. పార్ట్‌ టైమ్‌ రాజకీయవాదిగా, బాధ్యతలను తప్పించుకుని తిరిగే వ్యక్తిగా ముద్రపడిన రాహుల్‌ నేడు పరిణతి చెందిన ఫుల్‌టైమ్‌ రాజకీయవాదిగా మారారు. 

'ప్రత్యర్థులు ఎంత నీచంగా మాట్లాడితే మేము అంత ఉన్నతంగా మాట్లాడుతాం' అన్న మిషెల్‌ ఒబామా వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ స్ఫూర్తిగా తీసుకున్నట్లు కనిపించారు. దేశంలో బీజేపీ విద్వేషాలను, మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని రాహుల్‌ గాంధీ ఆరోపిస్తూ 'వారు రెచ్చగొడితే మేము శాంతపరుస్తాం. వారు విడదీస్తే మేము కల్పుతాం. వారు మంటలు సృష్టిస్తే మేము ఆర్పుతాం. వారు కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తం చేద్దాం అనుకుంటున్నారు. మేము బీజేపీని కలుపుకొని సమష్టిగా జీవిద్దాం అని చెబుతున్నాం' అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు, అన్ని కుల మతాలు, చిన్నా పెద్ద, ఆడ మగ మనుషులందరిని ప్రేమాభిమానాలతో కల్పుకుపోతామని, అందుకోసం కృషి చేస్తామని, వివిధ వర్గాల మధ్య శాంతి దూత పాత్రను నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ చెప్పారు. మాట తీరును, వైఖరిని మార్చుకున్న రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించకుండా ఏమీ వదిలేయలేదు.
 
ప్రధాన మంత్రి పదవిని గౌరవిస్తామని చెప్పిన ఆయన, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలను 21వ శతాబ్దంలోకి తీసుకొస్తే నరేంద్ర మోదీ మధ్యయుగాల్లోకి తీసుకెళుతున్నారంటూ విమర్శించారు. వాస్తవానికి రాహుల్‌ గాంధీ తాను పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే తన వైఖరిని మార్చుకోలేదు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగానే మార్చుకున్నారు. ఆవేశంతోపాటు మాటల మధ్య మంచి కూర్పు ఉండేలా మాట్లాడడంలో మోదీ దిట్ట. ఆ విషయంలో ఆయనకు రాహుల్‌ గాంధీ సరితూకడు. అందుకనే ఆయన తన వైఖరిని మార్చుకున్నట్లు ఉన్నారు. 

గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి ముందు నుంచే ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ తనపై పార్టీ నేతలే వేసిన 'పప్పూ' ముద్రను తొలగించుకున్నారు. మాటి మాటికి వెళ్లే విదేశీ యాత్రలను మానుకున్నారు. ముఖ్యంగా ప్రసంగాల్లో ఉద్దేశం ఉన్నా, ఆవేశం, ఆక్రోషం లేకుండా చూసుకుంటున్నారు. 2012లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సభలో రాహుల్‌ గాంధీ తన పొడుగు చేతుల చొక్కాను భుజాలపైకి మడచి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఓ సభలో ఆయన నేరం రుజువైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తూ తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌ కాపీని కోపంగా ముక్కలు ముక్కలుగా చింపివేశారు. ఎంతటి వారయినా తాను అవినీతికి వ్యతిరేకం అని చెప్పుకోవడమే రాహుల్‌ ఉద్దేశమైనప్పటికీ ఆవేశాన్ని అలా ప్రదర్శించడం అభ్యంతకరం. అందుకేనేమో ఆయన గురించి అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ 'మొన్నటి వరకు చేతులు భుజాతపైకి మడచి ఆవేశంగా మాట్లాడారు. నిన్న కాగితాలు చింపేశారు. ఇక ఇప్పుడు ఆవేశంతో వేదికపై నుంచి దూకేస్తారేమో!' అనివ్యాఖ్యానించారు. 

తన వైఖరిని మార్చుకున్న రాహుల్‌ గాంధీ, మోదీ సర్కార్‌ను 'సూటు బూటు సర్కార్, అచ్చేదిన్‌ సర్కార్' అని సౌమ్యంగానే సంబోధిస్తూ గుజరాత్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు. పోటాపోటీగా మోదీని ఢీకొని మంచి ఫలితాలనే సాధించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల నాటికి ఆయన ఇదే వైఖరిని అవలంభించి విజయం సాధిస్తారేమో! చూడాలి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top