హస్తంలో నిస్తేజం!

Congress Party Falling Down In Medak? - Sakshi

సాక్షి, మెదక్‌: కాంగి‘రేసు’లో ఏం జరుగుతోంది.. మెదక్‌ లోక్‌సభ బరిలో ఉన్నట్లా.. లేనట్లా.. అభ్యర్థి ఎటుపోతుండు.. నేతలు ఏం చేస్తున్నారు.. ప్రస్తుతం మెతుకుసీమలోని ‘హస్తం’ శ్రేణుల్లో నెలకొన్న సందేహాలు ఇవి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఒకవైపు ప్రచారంలో దూసుకెళ్తుంటే కాంగ్రెస్‌లో ఎలాంటి సందడి లేకపోవడం.. మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న గాలి అనిల్‌ కుమార్‌ అంత చురుగ్గా ప్రచారంలో పాల్గొనడం లేదని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మెదక్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి ‘గాలి’ గత నెల 22న రెండు సెట్లæ నామినేషన్లు దాఖలు చేశారు. ఆ రోజు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత 25న మరో సెట్‌ నామినేషన్‌ వేశారు. అదే రోజు మాజీ ఎంపీ విజయశాంతితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అప్పటి నుంచి ‘గాలి’ ఇటు వైపు పెద్దగా కన్నెత్తి చూడలేదని కిందిస్థాయి నేతలంటున్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి.. స్టార్‌ క్యాంపెయినర్, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాకు (మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, పటాన్‌చెరు) చెందిన ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో లోక్‌సభ పరిధిలో మొదటి దఫా ప్రచారం ముగియనుంది. కాంగ్రెస్‌ మాత్రం ప్రచారంలో వెనుకబడింది. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 

శ్రేణుల్లో కలవరం
కాంగ్రెస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌.. పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ప్రచారం చేపట్టకుండా కేవలం మండల, గ్రామస్థాయి నాయకులతోనే సమావేశాలు నిర్వహిస్తుండడంపై ఆ పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మెదక్‌లో ప్రస్తుత పరిస్థితులు ఆ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా కాం గ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం ‘గులాబీ’ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా ప్రచారం చేపట్టాల్సి ఉండగా.. అందుకు భిన్నం గా వ్యవహరిస్తుండడంపై శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top