అభ్యర్థి మారాడు!

Congress Party Changed MLC Candidate in Rangareddy - Sakshi

చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్‌

ఉదయ్‌ మోహన్‌రెడ్డికి బదులు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేరు ప్రకటన

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌ పార్టీ తన మార్క్‌ రాజకీయాన్ని మరోసారి చూపించింది. నామినేషన్ల తుది అంకం ముందు హైడ్రామాను ఆవిష్కరించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమ్మరెడ్డి ఉదయ్‌ మోహన్‌రెడ్డికి ఏఐసీసీ ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే.. ఆయనను అనూహ్యంగా మార్చింది. ఈ స్థానంలో పూర్వ వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి టికెట్‌ ఖరారు చేసింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కాగా.. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. పరిశీలన పేర్ల జాబితా లేని ఉదయ్‌ మోహన్‌రెడ్డి పేరును అనూహ్యంగా ఖరారు చేసిన అధిష్టానం.. నామినేషన్ల చివరి రోజు ఆయన్ను పక్కన బెట్టింది. ఆఖరి నిమిషంలో స్థానికేతరుడైన చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేరును ప్రకటించింది. 

బలమైన కారణాలే..
ఉదయ్‌ను మార్చడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డికి ఉదయ్‌ శిష్యుడు. గతంలో మహేందర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఉదయ్‌ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా ఇద్దరి మధ్య ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు పలువురు కాంగ్రెస్‌ నేతలు టీపీసీసీ వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.  అలాగే ఉదయ్‌ ఆర్థికంగా బలంగా లేరని, దీంతో జిల్లాలో పటిష్టంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టలేరన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్త పరిచినట్లు సమాచారం. బలమైన నేతను రంగంలోకి దించాలని ఆలోచించినట్లు తెలిసింది. మరోపక్క ఉదయ్‌ కూడా పోటీకి వెనకడుగు వేసినట్లు కొందరు నేతలు పేర్కొంటున్నారు. మహేందర్‌రెడ్డిపై ఆయన పోటీకి సుముఖంగా లేరన్నది వారి మాటల సారాంశం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. చివరకు వరంగల్‌ జిల్లాకు చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top