కాంగ్రెస్‌లో కలి‘విడి’ యాత్ర!

congress paadayatra - Sakshi

అనుమతి ఇవ్వాలని కోరిన భట్టి, కోమటిరెడ్డి, రేవంత్‌

వేర్వేరుగా చేయిద్దామా.. కలిపి నడిపిద్దామా?

టీపీసీసీ తర్జనభర్జన.. ఉమ్మడి యాత్రకే మొగ్గు!

మార్చిలో యాత్ర షురూ.. జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ సభ

సభకు రాహుల్‌ను ఆహ్వానించాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమవుతున్నారు. తాము పాదయాత్రలు చేస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని ముగ్గురు ముఖ్య నేతలు టీపీసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఈ మేరకు వేర్వేరుగా పార్టీకి తెలిపారు.

అయితే వేర్వేరుగా అనుమతించాలా లేదా  ముగ్గురు నేతలను కలిపి పాదయాత్రకు అనుమతించాలా అన్న దానిపై టీపీసీసీ తర్జనభర్జన పడుతోంది. ముగ్గురు నాయకులకు వేర్వేరుగా అనుమతిస్తే సమస్యలు తలెత్తుతాయని, ఉమ్మడిగానే పాదయాత్ర చేస్తేనే బాగుంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. వేర్వేరుగా పాదయాత్రలకు అనుమతిస్తే పార్టీలో గ్రూపులను పెంచి పోషించినట్టు అవుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

దీంతోపాటు పార్టీ శ్రేణులు, ప్రజలు, మీడియా దృష్టి కూడా పెద్దగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. అందుకే ముగ్గురిని ఒక దగ్గరకు చేర్చి, పాదయాత్రను పార్టీ భుజాలకు ఎత్తుకోవాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉమ్మడి పాదయాత్రకు వారు అంగీకరిస్తారా అనే దానిపైనా కొందరు నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

జోగుళాంబ ఆలయం నుంచి యాత్ర
మార్చి తొలివారంలో గద్వాల జిల్లా ఆలంపూర్‌లోని జోగులాంబ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే వరకు పాదయాత్ర చేసి ఆదిలాబాద్‌ జిల్లాలో ముగించాలని యోచిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సభను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఈ సభకు ఆహ్వానించనున్నారు. మార్చిలో పాద యాత్ర ఆరంభించడానికి ముందుగానే టీపీసీసీకి కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు. ఫిబ్రవరి మొదటి, రెండో వారంలో టీపీసీసీకి కార్యవర్గ జాబితాను ప్రకటించనున్నారు. డీసీసీలకు కూడా అధ్యక్షులను నియమించనున్నారు. పార్టీ సంస్థాగత ప్రక్రియను ఫిబ్రవరి రెండోవారంలోగా పూర్తి చేసి, ఆ తర్వాత పాదయాత్రకు సిద్ధం కావాలని భావిస్తున్నారు.

భారీ బహిరంగసభను ఎన్నికలకు సమరశంఖంగా భావించి, సుమారు 10 లక్షల మందితో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. పాదయాత్రకు సిద్ధంగా ఉన్న ముఖ్య నేతలందరితో సమావేశం తర్వాతే పూర్తి వివరాలు, ప్రణాళిక రూపొందించే అవకాశం ఉందని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top