‘పాలమూరును దగా చేసిండ్రు’

Congress Leader Bhatti Vikramarka Fires On TRS In Palamuru - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్పుకొచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులు నాలుగేళ్లుగా దగాకు గురిచేశారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ముంబై, దుబాయి, బొగ్గుబావులంటూ పాలమూరు వాసులకు అడుగడుగునా అన్యాయం చేశారని పేర్కొన్నారు. పాలమూరు కార్మికుల సంక్షేమంపైపదేపదే మాట్లాడే కేసీఆర్‌.. ఉపాధి కూలీల నిధులను పక్కదారి పట్టించి వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం భాగంగా రెండో రోజైన గురువారం మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాలలో సాగింది.

ఇక షెడ్యూల్‌ ప్రకారం నాగర్‌కర్నూల్‌లో కూడా జరగాల్సి ఉండగా.. పార్టీ సీనియర్‌ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి కుమారుడికి అస్వస్థత కారణంగా రద్దు చేశారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్, జడ్చర్లలోని నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోష్‌ షోల్లో ప్రచార కమిటీ స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతి, కో–చైర్‌పర్సన్‌ డీకే అరుణ, టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సీ.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ పాల్గొన్నారు.  

4వేల మంది చనిపోయారు : విజయశాంతి 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయశాంతి తెలిపారు.ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించడం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగాయన్నారు. తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రైతుబంధు, రైతుబీమా పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్‌కు లేదని ఆరోపించారు. బతుకమ్మ పండుగకు చెత్త చీరలు ఇచ్చి తెలంగాణ ఆడపడుచులను ఘోరంగా అవమానించారన్నారు. ఇంటిని  శుభ్రం చేసుకోవడానికి కూడా పనికిరాని చీరలను అందజేశారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మేల్కొని కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ.2 నుంచి 3వేలు పంచుతారని, వాటిని తీసుకొని కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ప్రజలు మోసం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు.  

పాలమూరును అభివృద్ధి చేసింది మేమే : డీకే అరుణ 
కరువు, వలసలతో సతమతమయ్యే పాలమూరును కాంగ్రెస్‌ పార్టీనే అక్కున చేర్చుకొని అభివృద్ధి దిశలో నడిపించిందని మాజీ మంత్రి డీకే.అరుణ తెలిపారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో రాజీవ్‌బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి, 2012 నాటికి దాదాపు పూర్తి చేసి నీరు అందించామన్నారు. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు పైపై మెరుగులు దిద్ది ఫొటోలకు ఫోజులిచ్చారే తప్ప, మిగిలిపోయిన పనులు చేయట్టలేదన్నారు. ఆర్డీఎస్‌ కింద 87వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి నాలుగేళ్లు ఉత్తి మాయమాటలతో కాలం వెళ్లదీశారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గట్టు ఎత్తిపోతల పథకం గుర్తొచ్చి ఆగమేఘాల మీద శంకుస్థాపనలు చేశారని ఎద్దేవా చేశారు. అంతేకాదు మిగతా అభివృద్ధి విషయంలో కూడా కాంగ్రెస్‌ హయాంలో జరిగినవే తప్ప... నాలుగేళ్లు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

భూత్పూరు–మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిని తాను మంత్రిగా ఉన్నప్పుడే మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే... నాలుగేళ్లయినా పూర్తిచేయలేకపోయారన్నారు. మెడికల్‌ కాలేజీకి సంబంధించి కూడా కాంగ్రెస్‌ హయాంలోనే అప్పటి కలెక్టర్‌ గిరిజాశంకర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. జీఓ వెలువడాల్సిన సమయంలో తెలంగాణ ఏర్పాటు కావడం తదితర కారణాల వల్ల ఆలస్యం జరిగిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ జీఓ తీసుకురావడానికి కూడా రెండేళ్ల సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. అలాగే మహబూబ్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవనంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఆస్పత్రి లేదా ఇంజనీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని డీకే అరుణ వెల్లడించారు. ప్రస్తుత కలెక్టరేట్‌ ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉందని... అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆయన భూముల ధరలు పెంచుకోవడం కోసం కలెక్టరేట్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top