పట్టణవాసి తీర్పు ఇలా...!

Congress JDS Won More Seats In Karnataka Urban Municipal Elections - Sakshi

కర్ణాటక మున్సిపల్‌ ఎన్నికలు...

కర్ణాటకలో హోరాహోరీగా జరిగిన  పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కంటే జనతాదళ్‌ (ఎస్‌)–కాంగ్రెస్‌పార్టీలు ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ద్వారా తమ తొలి పరీక్షలో విజయం సాధించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చుననే సంకేతాలకు ఈ గెలుపు ఊతమిస్తోంది. ఐక్యంగా నిలబడగలిగితే బీజేపీని ఓడించడం సులభమనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని రెండుపార్టీలకు ఈ ఫలితాలు కలిగించాయి.
 
మూడు కార్పొరేషన్లు, 29 నగర మున్సిపల్‌ కౌన్సిళ్లు, 52 పట్టణ మున్సిపల్‌ కౌన్సిళ్లు, 20 పట్టణ పంచాయతీల్లోని మొత్తం 2,662 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 982 సీట్లతో మొదటిస్థానంలో నిలవగా, బీజేపీ కూడా 929 సీట్లలో గెలుపొంది మంచి ప్రదర్శనే కనబరిచింది. సీఎం కుమారస్వామి పార్టీ జేడీ(ఎస్‌) 375 సీట్లతో మూడోస్థానంలో నిలిచింది. మిగిలిన సీట్లను ఇతరపార్టీలు,  స్వతంత్రులు గెలుచుకున్నారు. అయితే కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లకు కలిపి 1,357 సీట్లు వచ్చిన నేపథ్యంలో 60 శాతానికి పైగా పట్టణ స్థానిక సంస్థల్లో బీజేపీని వెనక్కు నెట్టి కౌన్సిళ్లను చేజిక్కించుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు వేటికవే విడివిడిగా పోటీచేశాయి. తమకు స్థానికంగా ఉన్న బలాబలాలకు అనుగుణంగా కాంగ్రెస్, జెడీ(ఎస్‌) కొన్నిచోట్ల స్నేహపూర్వకపోటీలకు కూడా దిగాయి. ఇలాంటి పోటీ కూడా రెండుపార్టీలకు లాభించిందని అంచనా వేస్తున్నారు. 

పుంజుకున్న కాంగ్రెస్‌...
గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరూత్సాహకర ఫలితాలు మూటగట్టుకున్న కాంగ్రెస్, 2013లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే అంకోలా, దండెలి, కార్వార్, హంగల్, రోన్, బాదామి, హేచ్‌డీ కోటే, టి. నర్సిపుర్, భంట్వాల్‌ జిల్లాల్లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోకి చొచ్చుకు వెళ్లగలిగింది. అయితే మధ్య కర్ణాటక, కోస్తా జిల్లాల్లో మాత్రం అంతగా ప్రజల మద్దతు పొందలేకపోయింది. బెళగావి, తదితర జిల్లాల్లో పెద్దసంఖ్యలో స్వతంత్రులు గెలుపొందడంతో కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బతిన్నాయి.

ఈ ఎన్నికల్లో ముందుగానే కాంగ్రెస్‌–జేడీ(ఎస్‌) పొత్తు కుదుర్చుకుని ఉంటే బీజేపీ నామరూపాలు లేకుండా పోయేదనే అభిప్రాయాన్ని కొందరు కాంగ్రెస్‌ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దండెలి మున్సిపల్‌ కౌన్సిల్‌లోని 31 సీట్లలో 16, హలియాల్‌ కౌన్సిల్‌లోని 23 సీట్లలో 14, ఎల్లిపుర పట్టణ పంచాయతీలోని 19 సీట్లలో 12 గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని చూపిన ఉత్తర కన్నడ జిల్లాలోని 200  కౌన్సిల్‌ సీట్లలో కాంగ్రెస్‌కు 87, బీజేపీకి 85 వచ్చాయి. హైదరాబాద్‌–కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌ తన పట్టును కొనసాగించింది. మొత్తం 595 సీట్లలో కాంగ్రెస్‌కు 299, బీజేపీకి 184 వచ్చాయి.

బలం నిలుపుకున్న జేడీ (ఎస్‌)...
పాత మైసూరు ప్రాంతంలో ముఖ్యంగా హసన్, మాండ్య, తుమ్‌కూరు తదితర ప్రాంతాలపై తనకున్న గట్టి పట్టును జేడీ(ఎస్‌) మరోసారి నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో 377 సీట్లే గెలుపొందినా,  పలు స్థానికసంస్థల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కని పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి చాలా పట్టణ స్థానికసంస్థల్లో అధికారాన్ని పంచుకోనుంది. ఈ జాబితాలో  మైసూరు, తుమ్‌కూరు నగర కార్పొరేషన్లు కూడా చేరనున్నాయి. జేడీ (ఎస్‌)కు  హసన్‌లో 135 సీట్లకు గాను 91, మాండ్యాలోని 117 వార్డులకు 64, తుమ్‌కూరులోని 115 వార్డులకు 51 వచ్చాయి.
 
కోస్తాలో బీజేపీ మెరుగైన ప్రదర్శన...
కోస్తా ప్రాంతంలో తనకున్న పట్టును బీజేపీ నిలుపుకుంది. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాల్లోని మొత్తం 386 పట్టణ స్థానికసంస్థల సీట్లలో 193 కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 145 సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. జేడీ(ఎస్‌)కు 12 సీట్లు, సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌పీడీఐ)కు 11 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు 25 సీట్లు గెలుచుకున్నారు, దక్షిణ కన్నడలోని పుట్టూరు నగర మున్సిపల్‌ కౌన్సిల్‌లోని 31 సీట్లలో బీజేపీ 25 గెలుపొందింది. మైసూరు కార్పొరేషన్‌లో ఏకైక పెద్దపార్టీగా అవతరించింది. ఉడుపి మున్సిపల్‌ కౌన్సిల్‌లోని 35 సీట్లలో 31 సీట్లలో విజయం సాధించి పూర్తి ఆధిపత్యం చూపింది. సిర్సిలోని 31 సీట్లలో 17 గెలిచి ఆధిక్యాన్ని కనబరిచింది.

పట్టణ మున్సిపల్‌ కౌన్సిళ్ల విషయానికొస్తే ఉడుపి జిల్లాలోని కుండపురలో 23 సీట్లలో 14, అదే జిల్లాలోని సాలిగ్రామ పట్టణ పంచాయతీలో 16 సీట్లకు గాను 10 , ఉత్తర కర్ణాటకలోని కుమ్తలో 23సీట్లలో 16 బీజేపీ గెలిచింది. బాగల్‌కోట్‌జిల్లాలో 312 వార్డుల్లో బీజేపీ 161 గెలుచుకుంది. బెళగావిలోని 343 వార్డుల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 85, ఇండిపెండెంట్లు 144 వార్డులు గెలుచుకున్నారు. గడగ్, ముంబై–కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌కు 57 వార్డులు, బీజేపీకి 54 వచ్చాయి. చామరాజనగర్‌ నగర మున్సిపల్‌ కౌన్సిల్‌లో గతం నుంచి  కాంగ్రెస్‌ కంటే బలహీనమైన స్థితిలో ఉన్నా  బీజేపీ గెలుపొందింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top