టీఆర్‌ఎస్‌ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

Congress Election Guarantees Statement in the Sonia Sabha - Sakshi

     కాంగ్రెస్‌ వ్యూహ, ప్రణాళిక కమిటీ భేటీలో నిర్ణయం 

     సోనియా సభలో ఎన్నికల హామీల ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ముందుకెళ్లాలని కాంగ్రెస్‌ వ్యూహ, ప్రణాళిక కమిటీ నిర్ణయించింది. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా వ్యూహాలు రచించాలని నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు, మిషన్‌ భగీరథలో నిధుల దుర్వినియోగం, ఇందిరమ్మ ఇళ్లలో అలసత్వం, దళితులకు భూ పంపిణీలో మోసం, ఉద్యోగ ప్రకటనల్లో జాప్యం వంటి అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. బుధవారం వ్యూహ, ప్రణాళిక కమిటీ చైర్మన్‌ వి.హనుమంతరావు అధ్యక్షతన గాంధీభవన్‌లో సమావేశం జరిగింది.

కమిటీ సభ్యులు మల్లు రవి, ఎంఏ ఖాన్, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, సీహెచ్‌ విజయరమణారావు, నగేశ్, ప్రేమ్‌లాల్‌ తదితరులు భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి, కీలక నేతల సభలు ఎక్కడ నిర్వహించాలి, మేనిఫెస్టోలో చేర్చాల్సిన హామీలు, అధికార పార్టీ విమర్శలు తిప్పికొట్టే వ్యూహాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమిటీ అభిప్రాయపడింది. ముఖ్యంగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, వంద రోజుల్లో మెగా డీఎస్సీ, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర, స్వయం సహాయక సంఘాలకు రుణాలు వంటి అంశాలను పోస్టర్లు, ఫ్లెక్సీలు, సోషల్‌ మీడియా, టీవీ ప్రకటనల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
 
ప్రతి అంశాన్ని వివరిద్దాం..: సోనియాగాంధీ హాజరయ్యే భారీ బహిరంగ సభలో ఎన్నికల హామీలు ప్రకటించడం ద్వారా ప్రజలకు మరింత నమ్మకం పెంచవచ్చని వ్యూహ, ప్రణాళిక కమిటీ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.ఉమ్మడి 10 జిల్లాల్లో ఏర్పాటు చేసే రాహుల్‌ సభల్లోనూ హామీల అంశాన్ని ప్రస్తావిస్తూనే టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు, నెరవేర్చడంలో విఫలమైన తీరుపై జిల్లాల వారీగా సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిటీ సభ్యులకు చైర్మన్‌ వీహెచ్‌ సూచించారు. దీనికి అన్ని జిల్లాల అధ్యక్షుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ఆదేశించారు.  

కేసీఆర్‌ అవినీతిని ఎండగడతాం: వీహెచ్‌ 
కమిటీ భేటీ అనంతరం వీహెచ్‌ విలేకరులతో మాట్లాడారు. మిషన్‌ భగీరథ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన అవినీతిని ఎండగడతామన్నారు. దీనిపై కమిటీ వద్ద ఇప్పటికే కొంత సమాచారం ఉందని.. మరో రెండు, మూడు సమావేశాలు జరపి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీలో సమన్వయం ముఖ్యమని కమిటీ భేటీలో అభిప్రాయాలు వచ్చాయని, దీన్ని పార్టీ పెద్దలకు వివరిస్తామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top