అనైతికం.. అప్రజాస్వామికం

Congress dharna at gunpark - Sakshi

కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ: టీ కాంగ్రెస్‌

సేవ్‌ డెమోక్రసీ పేరిట గన్‌పార్క్‌ వద్ద ధర్నా

ఆపై గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకున్నా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇందుకు గవర్నర్‌ అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమని నినదించింది. కేంద్రం గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని మండిపడింది. బీజేపీ తీరుకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు సేవ్‌ డెమోక్రసీ పేరిట ధర్నా చేపట్టారు.

మోదీని గద్దెదించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియాతోపాటు ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

జానారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ రాని బీజేపీకి అధికారం ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. కర్ణాటక గవర్నర్‌ వజూభాయ్‌ వాలా వ్యవహారంపై తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తమ వాదననే కోర్టు సమర్ధించిందన్నారు. జేడీఎస్‌తో కలసి తాము అధికారం చేపట్టడమే ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించారు. పొన్నాల, మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు.

కేసీఆర్‌–బీజేపీ మధ్య అవగాహన: భట్టి
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో విధంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

కర్ణాటక ఎన్నికలకు ముందు జేడీఎస్‌కు ఓటెయ్యా లని కర్ణాటక వెళ్లి ప్రజలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... తాజా పరిణామాలపై ఎం దుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ మద్దతు ప్రకటించిన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా, ఆయన చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్నా స్పందించకపోవడం చూస్తుం టే కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య అంతర్గత అవగాహన ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.

గవర్నర్‌ను కలసి ఫిర్యాదు...
కర్ణాటకలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని టీపీసీసీ నేతలు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను   శుక్రవారం రాజ్‌భవన్‌లో కలసి  విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో 117 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమిని కాకుండా 104 మంది సభ్యులున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ వజూ భాయ్‌ వాలా ఆహ్వానించడం అప్రజాస్వామికమని కుంతియా ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో భేటీలో జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మల్లు భట్టివిక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, పొంగులేటి, టీపీసీసీ నేత వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top