పది స్థానాలకు కాంగ్రెస్‌ పట్టు

Congress Demand For Ten Seats From DMK - Sakshi

ఢిల్లీలో మంతనాలు

పట్టువీడని డీఎంకే

సాక్షి, చెన్నై: తమకు కనీసం పది సీట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌ పెద్దలు డీఎంకే వద్ద పట్టుబట్టే పనిలో పడ్డారు. ఢిల్లీ వేదికగా ఆదివారం సీట్ల పందేరం మంతనాలు సాగాయి. అయితే, డీఎంకే పట్టువీడనట్టు సమాచారం. సింగిల్‌ డిజిట్‌ సీట్లే పరిమితం చేస్తూ ఖరాకండిగా తేల్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి సిద్ధమైన విషయం తెలిసిందే. సీట్ల పందేరాలు ముగింపు దశకు చేరాయి. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్లో తాము 25 స్థానాల్లో పోటీ చేయడం ఖాయం అని మిత్రుల వద్ద డీఎంకే ఇప్పటికే స్పష్టం చేసి ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. మిగిలిన పదిహేను సీట్లలో కాంగ్రెస్‌కు పుదుచ్చేరి సీటుతో పాటు ఏడు సీట్లు ఇచ్చి, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్, ఎంఏకేలకు తలా ఓ సీటు ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించినట్టు ప్రచారం.

అలాగే, కొంగునాడుకు ఓ సీటు ఇచ్చి, ఆ పార్టీ అభ్యర్థి డీఎంకే చిహ్నంపై పోటీ చేసే దిశగా కార్యాచరణలో ఉన్నారు. మరెవరైనా కలిసివచ్చిన పక్షంలో అందుకు తగ్గట్టుగా ఓ సీటును పక్కన పెట్టారు. అయితే, తమకు ఏడు సీట్లు చాలవని, మరో మూడు సీట్లు తప్పనిసరిగా కాంగ్రెస్‌ వాదనను తెరపైకి తెచ్చింది. తమ పార్టీకి చెందిన సీనియర్లు (గ్రూపు) నేతలే పది మంది ఉన్నారని, వారిని సంతృప్తి పరచాలంటే, పది సీట్లు తప్పనిసరి అన్న డిమాండ్‌ను డీఎంకే ముందు కాంగ్రెస్‌ పెద్దలు ఉంచడం గమనార్హం. ఢిల్లీ వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళి, సీనియర్‌ నేత టీఆర్‌ బాలుతో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనీయర్లు ముకుల్‌ వాస్నిక్, ఆజాద్, చిదంబరం సమాలోచన సాగించినట్టు సమాచారం.

ఇందులో తమకు పది సీట్లు ఇవ్వాల్సిందేనన్న ఒత్తిడిని డీఎంకే ముందు ఉంచినట్టు తెలుస్తున్నది. పీఎంకే కలిసి వచ్చేట్టుందన్న సమాచారాన్ని ఈసందర్భంగా డీఎంకే ముందు కాంగ్రెస్‌ పెద్దలు ఉంచినట్టు తెలిసింది. ఎవరు వచ్చినా ఒక్క సీటు మాత్రమే ఉందని, తప్పనిసరి అయితే, కాంగ్రెస్సే ఓ సీటు తగ్గించుకోవాల్సి ఉంటుందన్న మెలికను డీఎంకే వర్గాలు ఢిల్లీ పెద్దల ముందు ఉంచినట్టు చర్చ. ఎట్టి పరిస్థితుల్లో మెట్టుదిగబోమని, తాము 25 స్థానాల్లో పోటీ చేయడం ఖాయం అని డీఎంకే వర్గాలు ఖరాకండిగా తేల్చి చెప్పడంతో వ్యవహారాన్ని రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ పెద్దలు సిద్ధమైనట్టు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top