నాలుగున్నర లక్షల మందితో కాంగ్రెస్‌ సైన్యం

Congress cadre must adapt to technology: Uttam - Sakshi

ప్రతి పోలింగ్‌ బూత్‌కు 14 మందితో కమిటీ

సాంకేతిక ప్రభావాన్ని అంచనా వేసి ఎన్నికలకు సిద్ధం కావాలి

కాంగ్రెస్‌ ఎల్‌డీఎంఆర్‌సీ సమావేశంలో నిర్ణయం

ప్రతి ఓటరుతో నాయకత్వం అనుసంధానం కావాలి: ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతో కాంగ్రెస్‌ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వ్‌డ్‌ కాన్‌స్టిట్యుయన్సీస్‌ (ఎల్‌డీఎంఆర్‌సీ) స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌లకు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 31 రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం అమలు చేస్తున్న ఎల్‌డీఎంఆర్‌సీపై మంగళవారం గోల్కొండ హోటల్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ సహాయకుడు దీపక్‌ ఆమెన్, టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. సమీక్షలలో భాగంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ఎల్‌డీఎంఆర్‌సీ పనితీరు బాగుందని, దీని స్ఫూర్తితో రాష్ట్రమంతటా దీన్ని అమలు చేయాలని సూచించారు.

ప్రతి ఓటరుతో నాయకత్వం అనుసంధానమయ్యేలా చూడాలని, ఓటరును నేరుగా కలసి సమస్యల్లో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో సాంకేతిక వనరుల ప్రభావం చాలా ఉంటుందని, ఈ విషయంలో మరింత లోతుగా సమాచార సేకరణ చేయాలని సూచించారు. పార్టీ సాంకేతిక విభాగం రూపొందించిన సమాచార పత్రాల ద్వారా బూత్‌ స్థాయి నాయకులు ప్రజల వద్దకు వెళ్లి, సమాచారం సేకరించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీని చేరువ చేయాలని కోరారు.  
జనరల్‌ నియోజకవర్గాల్లోనూ..
ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని జనరల్‌ నియోజకవర్గాల్లో కూడా ఎల్‌డీఎంఆర్‌సీ తరహాలో సమాచార సేకరణ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 30,600 పోలింగ్‌ బూత్‌లకు గాను బూత్‌కు 14 మందితో కమిటీలు వేయాలని, సుశిక్షితులైన నాలుగున్నర లక్షల మందితో కాంగ్రెస్‌ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి బూత్‌కు సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ను నియమించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న వర్గాలకు చేరువ కావాలని సూచించారు.

31 నియోజకవర్గాల్లో బూత్‌ కమిటీలు పూర్తి  
ఏఐసీసీ ఎస్సీసెల్‌ కన్వీనర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఎల్‌డీఎంఆర్‌సీ కింద 31 నియోజకవర్గాల్లో 75,655 మందితో బూత్‌ కమిటీలు, 18,901 మందితో మండల స్థాయి కమిటీలు, 603 మందితో బ్లాక్‌ స్థాయి కమిటీలు 22,299 మందితో గ్రామ కమిటీలు నియమించామని, 752 మంది ఏబీసీలను నియమించామని, 1,18,210 మంది డాటా సేకరించి 93 వేల మందిని మొబైల్‌ నంబర్లతో, 27వేల మందిని ఓటర్‌ కార్డులతో అనుసంధానం చేశామని చెప్పారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ సహాయకుడు దీపక్‌ ఆమెన్‌ మాట్లాడుతూ బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న సమాచార వ్యవస్థను, సాంకేతికంగా అనుసంధానం చేసే విధానాన్ని వివరించారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎంఆర్‌సీ కోఆర్డినేటర్‌ హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌ రెడ్డి, సంపత్‌ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కె.ఎల్‌.ఆర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్, సాంకేతిక నిపుణుడు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top