పల్లె, పట్నం కల'గెలుపు'

Congress And TRS Parties Target on Chevella Constituency - Sakshi

చేవెళ్ల ‘చాంపియన్‌షిప్‌’..

అధికార పార్టీ హవాను ‘కొండా’ తట్టుకోగలరా?

మూడో ఎన్నిక.. గెలుపుపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ధీమా

రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్లే కీలకం

సబిత పార్టీ మార్పుతో మారనున్న రాజకీయం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలగలుపు చేవెళ్ల నియోజకవర్గం. వ్యవసాయాధారిత ప్రాంతాలు ఒకవైపు, టాప్‌ ఐటీ కంపెనీలు మరోవైపు.. రైతులు, రైతు కూలీలు, ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులతో భిన్న సంస్కృతుల సమాహారంగా ఉన్న ఈ నియోజకవర్గం 2009 ఎన్నికలకు ముందు ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఫార్మాసిటీ, హార్డ్‌వేర్‌ పార్కుతోపాటు ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, విస్తరించిన నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగం చేవెళ్ల సొంతం. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన చేవెళ్ల స్థానానికి ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు 2009లో కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వగా, 2014లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ఇక మూడోసారి జరగనున్న ఈ లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్లలో ప్రజాతీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.- చింతకింది గణేశ్‌

రాజధాని నుంచి కర్ణాటక సరిహద్దు వరకు..
పక్క రాష్ట్రమైన కర్ణాటక సరిహద్దు నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని వరకు విస్తరించిన ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పార్టీల వారీగా ఉన్న సంప్రదాయ ఓట్లు ఎంత కీలకమో.. సాంకేతిక నైపుణ్యం కలిగిన ఐటీ, ఇతర ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్లూ అంతే కీలకం. ముఖ్యంగా ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు కాగా, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమాహారం. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై పార్టీల వారీ ఓట్లతోపాటు పంటలు, గిట్టుబాటు ధరలు, రైతు సంక్షేమం ఎంతగా ప్రభావం చూపుతుందో.. ఉద్యోగులు, వారి సమస్యల పరిష్కారం, నిరుద్యోగుల సమస్యలు అంతే ప్రభావాన్ని చూపనున్నాయి.

ఒకసారి కాంగ్రెస్‌.. ఇంకోసారి టీఆర్‌ఎస్‌
పదేళ్ల కిందట ఏర్పడిన చేవెళ్ల లోక్‌సభకు 2009, 2014లో ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎ.పి.జితేందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.జైపాల్‌రెడ్డి 18,532 ఓట్లతో విజయం సాధించగా, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.కార్తీక్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 73,023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డికి 4,35,077 ఓట్లు రాగా, కార్తీక్‌రెడ్డికి 3,63,053 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో టి.దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ నిలిచారు. ఆయనకు 3,53,203 ఓట్లు లభించాయి. అప్పట్లో ఈ నియోజకవర్గంలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కే మెజారిటీ లభించింది. మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీకి మెజారిటీ వచ్చినా మూడో స్థానానికే పరిమితమైంది.

ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు టీఆర్‌ఎస్‌వే!
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలు (పరిగి, వికారాబాద్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి) టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. రెండుచోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. అందులో తాండూరులో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌రెడ్డి గెలుపొందారు. మహేశ్వరంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆమె టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం కావడంతో టీఆర్‌ఎస్‌ స్థానాలు ఆరుకు చేరనున్నాయి. ఇది టీఆర్‌ఎస్‌ విజయావకాశాలను పెంచే అంశం కానుంది.

టీఆర్‌ఎస్‌ నుంచి రంజిత్‌రెడ్డి!
టీఆర్‌ఎస్‌ నుంచి పారిశ్రామికవేత్త డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. మొదట్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ వంగాల స్వామిగౌడ్‌ ఆశించినా చివరకు రంజిత్‌రెడ్డికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డి ఓడిపోవడంతో పాటు తన జిల్లాలోని మహేశ్వరంలోనూ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈ పరిస్థితుల్లో రంజిత్‌రెడ్డిని పోటీలో నిలిపి, మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతోంది.

సబిత రాకతో మరింత బలం
జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహేశ్వరం, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం కావడంతో టీఆర్‌ఎస్‌కు కొంత కలిసొచ్చినట్టే. మరోవైపు చేవెళ్ల పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తాండూరు మినహా ఆరు టీఆర్‌ఎస్‌వే కానున్నాయి. అయితే చేవెళ్ల నుంచి తన కుమారుడు కార్తీక్‌రెడ్డికి లోక్‌సభ సీటు కోరుతున్నా అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ మారిన ‘కొండా’కు పరీక్షే!
కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. పార్టీలో అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డికి లభిస్తున్న ప్రాధాన్యం కారణంగా పార్టీతో విభేదించిన ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్, సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి తన పార్లమెంటు నియోజకవర్గంలోని సమస్యల పేరుతో అటు అధికార పక్షంపై, ఇటు ప్రభుత్వంపై పోరాడుతున్నారు. తాజా రాజకీయ సమీకరణల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలిగిన నాయకునిగా విశ్వేశ్వర్‌రెడ్డిని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గతంలో లభించిన టీఆర్‌ఎస్‌ మద్దతు లేకపోవడం.. కాంగ్రెస్‌లోనూ ఒంటరిగా నెట్టుకురావాల్సి రావడం కొంత ప్రతికూలంగా మారవచ్చు. అక్కడి ఏడు అసెంబ్లీలో సెగ్మెంట్లలో ఒక్క తాండూరులో మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నారు. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలిచినా ఆమె టీఆర్‌ఎస్‌లో చేరనుండటం విశ్వేశ్వర్‌రెడ్డికి నష్టం కలిగించనుంది. అయితే స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కారుడు, ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడనే ఛరిష్మా తాజా రాజకీయాల్లో ఏ మేరకు పని చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇక బీజేపీ నుంచి బెక్కరి జనార్ధన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీలో పోటీ ఊసేలేదు.

ప్రభావితం చేసే ప్రధానాంశాలివే..
వికారాబాద్‌ జిల్లాను జోనల్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జోగులాంబ గద్వాల జోన్‌లో కలిపారు. గతంలో ఆరో జోన్‌లో భాగంగా ఉన్న తమను కొత్తగా ఏర్పడిన చార్మినార్‌ జోన్‌లో కలపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది
రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరిధిలోని ఆ ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఇది ప్రచారాస్త్రం అవుతోందే కానీ, అమలుకు నోచుకోవడం లేదు
తాండూరులో ప్రధాన పంట కంది. ఇక్కడ కంది బోర్డు ఏర్పాటు చేయాలనేది రైతుల డిమాండ్‌. ఎన్నికల సమయంలో కంది బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్ని పార్టీలు హామీనిస్తున్నాయి తప్ప నెరవేరడం లేదు
శేరిలింగంపల్లి నుంచి వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌ విస్తరణ హామీగానే ఉండిపోయింది. వికారాబాద్‌ శాటిలైట్‌ టౌన్‌షిప్‌ పనులు కొనసా..గుతున్నాయి.
చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరంలో కొంతభాగం మినహా మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానాధారం. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి çముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రాణహిత–చేవెళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించి రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతాల్లోని 2.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టింది. పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top