దసరా పాయె.. దీపావళి వచ్చె.. అన్నా.. సీట్లేమాయె!

Congress And TDP Not Declared Seats - Sakshi

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా కోసం ఆశావహులకు తప్పని నిరీక్షణ

అనేక వాయిదాల తర్వాత ఈ నెల 9న ఇస్తామని ప్రకటన

మళ్లీ 9 తర్వాత ఎప్పుడైనా రావొచ్చంటున్న ముఖ్య నేతలు

కూటమి పార్టీల్లోనూ సీట్లు, స్థానాల కోసం ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌: దసరా పోయింది.. దీపావళి వచ్చింది.. కానీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల టెన్షన్‌ మాత్రం పోలేదు. అదిగో.. ఇదిగో.. అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల జాబితా కోసం నిరీక్షణ తప్ప డం లేదు. దీపావళి తారాజువ్వల్లా టీఆర్‌ఎస్‌ అభ్య ర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే తాము మాత్రం టికెట్‌ ఎవరికి వస్తుందో అర్థం కాక తలపట్టుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన అధిష్టానం పెద్దలు ఇంతవరకు టికెట్ల ఖరారు కసరత్తు ముగించలేదని, ఎన్నికలకు కనీసం నెల రోజులు కూడా లేదని, ఇంకెప్పుడు ప్రచారంలోకి వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

9 తర్వాత ఎప్పుడైనా..
105 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించి 2 నెలలు దాటిపోయింది. ఈ రెండు నెలల్లో ప్రచారం పేరుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా గ్రామాల్లోకి వెళ్లి అన్నీ ‘సెటిల్‌’చేసుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్, కూటమి వ్యవహారం ఇంకా తేలకపోవడం, కనీసం అభ్యర్థుల జాబితా కూడా విడుదల కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఢిల్లీ, హైదరాబాద్‌ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే, దసరాకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తారని ఆశించినా, అదుగో.. ఇదిగో.. అంటూ వాయిదాలు పడుతూ వస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ చర్చలు, కోర్‌ కమిటీ భేటీలు, అధిష్టానం పిలుపులు, కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల పేరుతో జాప్యం చేసుకుంటూ వస్తున్నారు. తొలుత ఈ నెల 1నే జాబితా ఇస్తామని చెప్పి, అమావాస్య పేరుతో 2వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజున ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి సాయంత్రానికి ఈనెల 8న లేదా 9న జాబితా ఇస్తామని టీపీసీసీ పెద్దలు చెప్పారు. కనీసం 9వ తేదీనాడైనా వస్తుందని అనుకుంటే మళ్లీ కుంతియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ 9వ తేదీ తర్వాత అభ్యర్థుల జాబితా ఉంటుందని ప్రకటించడం గమనార్హం. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో ఇప్పటివరకు అభ్యర్థుల జాబితా ఖరారు కాకపోవడం అటు ఆశావహులను, ఇటు పార్టీ శ్రేణులను నైరాశ్యంలో పడేశాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

కూటమిలోనూ కుతకుత..
కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అలా ఉంటే... కూటమి పక్షాల్లోనే ఇతర పార్టీలకూ ఎదురుచూపులు తప్పడం లేదు. కూటమి భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ కొంత ప్రశాంతంగానే కనిపిస్తున్నా, సీపీఐ, టీజేఎస్‌ మాత్రం కుతకుతలాడిపోతున్నాయి. కాంగ్రెస్‌ చేస్తున్న జాప్యం కారణంగా తాము ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదని, ఎన్నికలకు కనీసం నెల రోజులు కూడా లేని పరిస్థితుల్లో ఇంకెన్నాళ్లు ఈ స్పష్టత కోసం ఎదురుచూడాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆయా పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top