ముంబై.. యుద్ధానికి సై

Congress And BJP Targets Maharashtra Lok Sabha Election - Sakshi

మారని అభ్యర్థులు..ముంబై మూడ్‌ ఎటు వైపో!

సాక్షి ముంబై: మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలలో అత్యధికంగా ఆరు లోకసభ నియోజకవర్గాలున్న ముంబై నగరంపై ప్రముఖ పార్టీలన్నీ దృష్టి పెట్టాయి.  ముంబైలో ప్రధానంగా శివసేన–బీజేపీ కూటమి, కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి మధ్య పోటీ జరగనున్నప్పటికీ ఇతర పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఎంత మేర ఓట్లు చీల్చనున్నారనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉండనున్నాయి. ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో మరాఠీతో పాటు మరాఠేతర  ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఉత్తర భారతీయులు, మైనార్టీలు, తెలుగు, తమిళ, కన్నడ, కేరళ వంటి దక్షిణాది ఓటర్ల ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి విజయం ఎవరిని వరించనుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. గతంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు పట్టున్న ఈ లోకసభ నియోజకవర్గాలలో 2014 ఎన్నికల్లో శివసేన–బీజేపీ కూటమి ఆరుకు ఆరూ కైవసం చేసుకుంది. ఈసారి కూడా శివసేన మూడు, బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఐదు స్థానాలు, ఎన్సీపీ ఒక స్థానంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

గత అయిదేళ్లలో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో తమకే మళ్లీ పట్టం కట్టనున్నారన్న విశ్వాసంతో బీజేపీ, శివసేన కూటమి ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా శివసేన–బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో ఓట్లు కూడా చీలే అవకాశాలు తప్పి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. శివసేన–బీజేపీ మధ్య నాలుగున్నరేళ్లుగా కొనసాగిన విభేదాలు పూర్తిస్థాయిలో సద్దుమణిగాయని చెబుతున్నా.. అలాంటిదేమీ కనిపించడంలేదు. ముఖ్యంగా నార్త్‌ ఈస్ట్‌ ముంబైలో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ కిరీట్‌ సోమయ్యకు టికెట్‌ ఇవ్వద్దని, ఇస్తే తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని శివసేన అంటోంది. దీంతో ఇప్పటి వరకు ఈ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ఉత్తర మధ్య ముంబై నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ పూనం మహాజన్‌.. తన ప్రచార బ్యానర్‌లో యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఫొటో తొలగించడంపై శివసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా అనేక ఉదంతాలు ఇరు పార్టీల మధ్య చోటుచేసుకుంటుండగా, శివసేన–బీజేపీ అధి నాయకత్వాలు మాత్రం తమకు అనుకూలమైన వాతావరణం ఉందన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

పాత కాపుల మధ్యే మళ్లీ పోటీ?
ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో ఒకటి మినహా మిగిలిన ఐదుచోట్లా 2014లో తలపడిన అభ్యర్థుల మధ్యే పోటీ కనిపిస్తోంది. ముంబైలోని దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర పశ్చిమ ముంబై, ఉత్తర మధ్య ముంబైలలోని కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి, శివసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను మార్చలేదు. ఉత్తర ముంబైలో మాత్రం బీజేపీ మళ్లీ సిట్టింగ్‌ ఎంపీ గోపాల్‌శెట్టిని బరిలోకి దింపినా.. కాంగ్రెస్‌ ఈసారి అభ్యర్థిని మార్చి బాలీవుడ్‌ నటీ ఊర్మిళా మాటోండ్కర్‌ను బరిలోకి దింపింది. మరోవైపు నార్త్‌ ఈస్ట్‌ ముంబై నుంచి ఎన్సీపీ మరోసారి సంజయ్‌ దినా పాటిల్‌ను బరిలోకి దింపింది. బీజేపీ ఈ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

కాంగ్రెస్, ఎన్సీపీలలో..
ముంబైలో గతంలో కాంగ్రెస్‌కు మంచి పట్టుండేది. ముఖ్యంగా 2009లో ముంబైలోని ఆరు స్థానాలలో ఐదింటిని కాంగ్రెస్, ఒక స్థానాన్ని ఎన్సీపీ కైవసం చేసుకున్నాయి. 2014 ఎన్నికల్లో మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. మొత్తం ఆరు స్థానాలు బీజేపీ కూటమి ఖాతాలోకే వెళ్లిపోయాయి. దీంతో ఈసారి మళ్లీ పట్టు సాధించాలనే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఉన్న సంజయ్‌ నిరుపమ్‌ను మార్చి మిలింద్‌ దేవ్రాను అధ్యక్షుడిని చేసింది. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు సద్దుమణిగాయని చెబుతున్నా.. ఇంకా విభేదాలున్నాయని సమాచారం. ముంబైలో ఉత్తర భారతీయులు, మైనార్టీల ఓట్లు గతంలో కాంగ్రెస్‌కు పడేవి. ఈ ఓట్ల ఆధారంతో కాంగ్రెస్‌ సునాయాసంగా విజయం సాధించవచ్చని భావించేది. కాని గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ బీజేపీ వైపు మళ్లాయని తేలింది. గుజరాతీ, మార్వాడీ, జైన్‌ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మరాఠీ ఓటర్లను కూడా బీజేపీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మిగిలేవి మైనార్టీ, దళిత ఓట్లే. ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. కాని ముంబైలో చివరి దశలో ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు పరిస్థితులు అనుకూలిస్తాయనే ఆశతో ఆ పార్టీ ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top