నమో జపమా రాగాలాపనా

Congress And BJP Targets This Lok Sabha Election - Sakshi

నరేంద్ర మోదీ వర్సెస్‌ రాహుల్‌ గాంధీ

ఈ ఎన్నికల్లో ‘కమల’ వికాసమా? ‘చేతి’వాటమా?

పోటీపడి హామీలు.. ప్రచారంలో ప్రధానాస్త్రాలు

అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేవారికి ఓటేస్తారా? అభివృద్ధి అంటే ఇదీ అని చేసి చూపించిన వారికి ఓటేస్తారా? ఇదే కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ ఓటర్లతో ఆడుతున్న మైండ్‌ గేమ్‌. అధికార పార్టీ సర్వసాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అయిదేళ్లలో ఏం చేశారన్న ప్రశ్నలుఉదయిస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి బీజేపీ ఎదురుదాడి అనే అస్త్రాన్ని బయటకు తీసింది. ఈ అయిదేళ్లలో తామెంత చేశామో, ఎందరికి అండగా ఉన్నామో గణాంకాలతో సహా వివరించి చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతోంది. బీజేపీ విస్మరించిన వర్గాలను కాంగ్రెస్‌ గట్టిగా పట్టుకొంది. బీజేపీ చేపట్టినపథకాలను కొన్నింటిని మార్చి అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పిస్తోంది. ఇలా ఈ రెండు ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలతో భారతీయ ఓటరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.మరి ఓటరు దేవుడు ఏ పార్టీని నమ్ముతాడు?ఎవరికి అండగా నిలబడతాడు?

సరికొత్త భారత్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటోన్న కొత్త కల సరికొత్త భారత్‌. 2022 నాటికి సరికొత్త భారత్‌ను ఆవిష్కరించాలని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి దేశ భద్రతను పటిష్టపరచడం, సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడమే తమ లక్ష్యాలని మోదీ చాలా రోజులుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మోదీ హైతో ముమ్‌కిన్‌ హై (మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే) అన్న నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. ఇదే బీజేపీని గెలిపిస్తుందన్న ఆశతో ఉన్నారు మోదీ.

బ్రాండ్‌ మోదీ
ఆయన పేరే ఒక మంత్రం. గత ఎన్నికల్లో యువతరం ‘నమో’ జపంతో ఊగిపోయింది. గుజరాత్‌ అభివృద్ధి నమూనాపై నమ్మకంతో చాలా మంది ప్రధాని గద్దె మోదీ ఎక్కితే దేశం దశ దిశ మారుతాయని ఆశలు పెట్టుకున్నారు. గత అయిదేళ్లలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో మోదీ ప్రతిష్ట మసకబారిందనే అందరూ భావించారు. దానిని బలపరిచేలా మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీ ఓటమి పాలవడంతో మోదీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతోందనే ప్రచారం జరిగింది. కానీ ఎప్పుడైతే పుల్వామా దాడులకు ప్రతీకారంగా కేంద్రం బాలాకోట్‌ దాడులకు పాల్పడిందో మళ్లీ ఒక్కసారిగా జనంలో మోదీ ఊపు కనిపిస్తోంది. ఇప్పుడు ఆ హవానే ఎన్నికల్లో క్యాష్‌ చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. మోదీ ఫొటోలు ఉన్న టీ కప్పులు, చీరలు, టోపీలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం, బాలీవుడ్‌ తారలతో సెల్ఫీలు, ఉరీ దాడులపై సినిమా, మోదీ బయోపిక్‌ చిత్ర నిర్మాణం వంటివన్నీ బ్రాండ్‌ మోదీ ప్రచారంలో భాగమే. ఈసారి మోదీ ఇమేజ్‌ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందన్న నమ్మకంతో బీజేపీ ఉంది. ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌ (మరోసారి మోదీ ప్రభుత్వం) నినాదాన్ని అందుకుంది. స్థానిక అభ్యర్థికి వేసే ప్రతీ ఓటూ తనకే వేసినట్టుగా భావించాలని మోదీ స్వయంగా ఎన్నికల సభల్లో చెబుతుండటం విశేషం.

సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌
‘అందరితో కలిసి అందరి అభివృద్ధి’ అనే నినాదంతో గత ఎన్నికల్లో గెలిచిన మోదీ ప్రభుత్వం ఈ అయిదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామో ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటోంది. గ్రామీణాభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్‌ సిలిండర్లు, అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ఆయుష్మాన్‌భవ, పీఎం సమ్మాన్‌ కిసాన్‌ నిధి ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం, ఇంచుమించుగా 100 శాతం విద్యుద్దీకరణ, రహదారుల నిర్మాణంతో కనెక్టివిటీ తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. నేరుగా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తే జనం సోమరులుగా మారి దేశ ప్రగతి దెబ్బ తింటుందనే వాదనను ఘాటుగానే ప్రచారం చేస్తోంది.

విపక్షాలపై ఎదురుదాడి
బీజేపీలో ఒకే ఒక్కడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల్లో ఆయనకున్న కరిష్మాయే వేరు. ఆయనకు అండదండగా అమిత్‌ షా రాజకీయ మంత్రాంగం ఉండనే ఉంది. అందుకే మోదీని ఎదుర్కోవడానికి ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ చేతులు కలిపాయి. మహాగఠ్‌బంధన్‌గా ఏర్పడ్డాయి. అదే అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు మోదీ. ఒక్కడికి భయపడి అంత మంది చేతులు కలుపుతారా? అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. యూపీలో సీట్లు తగ్గినా, మిగిలిన రాష్ట్రాల్లో గెలుచుకొని దానిని భర్తీ చేసే వ్యూహరచనని ఎప్పుడో మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను కూడా ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. కనీస ఆదాయ పథకాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆయుష్మాన్‌ భవ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని ప్రచారం చేస్తున్నారు. విపక్షాలపై దాడి కూడా బీజేపీఎన్నికల ప్రచార అంశమే.

దేశ భద్రత
బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాల్లో దేశ భద్రత అగ్రభాగంలో ఉంది. పాకిస్తాన్‌ కుయుక్తుల్ని సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా రక్షణ రంగాన్ని బలోపేతం చేసే చర్యల గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అంతరిక్ష రంగంలోనూ భారత్‌ సత్తాను చాటేలా ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ శాట్, ఎమిశాట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శత్రు దేశాల రాడార్లు, సెన్సార్లు పసిగట్టి తదనుగుణంగా దేశ భద్రతకు చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇకపై దీని గురించే విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

‘కమల’ కాంతులు ‘చేతి’లో అస్త్రాలివీ
కనీస ఆదాయ పథకం

దేశంలో 20 శాతం వరకు ఉన్న నిరుపేద కుటుంబాలకు కనీసం ఏడాదికి రూ.72 వేలు అందేలా చర్యలు చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ అ«ధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. న్యూనతమ్‌ ఆయ్‌ యోజన (ఎన్‌వైఏవై– న్యాయ్‌) అన్న పేరుతో అమలు చేసే ఈ పథకం కింద డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమవుతాయి. ఈ పథకం కింద ఇచ్చే డబ్బులు ఆ ఇంటి గృహిణి బ్యాంకు అకౌంట్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. తద్వారా మహిళా ఓటు బ్యాంకుపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. నెల తిరిగేసరికల్లా రూ.12 వేలు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని చెప్పడంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మళ్లుతారా అన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా రిజర్వేషన్‌ బిల్లుని పార్లమెంటు ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.  ఈ బిల్లు పాసైతే లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు లభిస్తాయి. యూపీఏ హయాంలో ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదాన్ని పొందింది. కానీ లోక్‌సభలో రాజకీయ పక్షాలన్నీ తెలివిగా అటకెక్కించాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ దీనిని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టబోతోంది. ప్రస్తుతం 16వ లోక్‌సభలో కేవలం 12 శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కూడా మహిళా సీఎంలనే నియమిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ పదేపదే చెబుతున్నారు.

ప్రభుత్వోద్యోగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు
మన దేశం మొత్తం ఓటర్లలో సగం మంది మహిళలే. కానీ వారి ప్రాతినిధ్యం అంతగా కనిపించడం లేదు. అందుకే మహిళా ఓటర్లకు గాలం వెయ్యడానికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలు, సీపీఎస్‌యూలలో 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెన్నై స్టెల్లా మేరీ కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించిన సందర్భంలో రాహుల్‌ హామీ ఇచ్చారు. విద్యా రంగం బడ్జెట్‌ను 6 శాతం పెంచడానికి ప్రయత్నిస్తామన్నారు.

జీఎస్టీకీ కొత్త రూపురేఖలు
2017 జూలై 1 నుంచి ఎన్డీయే సర్కార్‌ అమల్లోకి వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్‌ పార్టీ దాని వల్ల స్థూల జాతీయోత్పత్తి గత మూడేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయిందని అంటోంది. జీఎస్టీల శ్లాబుల విధానం సామాన్యులకు పెను భారమైందని ఆరోపిస్తున్న రాహుల్‌ జీఎస్టీని ‘గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌’ అంటూ హేళన చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే జీఎస్టీని సంస్కరించి దేశానికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అందరికీ ఆరోగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యాన్ని పరిరక్షించే హక్కు భారతీయులందరికీ కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌కి ఇది కౌంటర్‌లాంటిది. ఆయుష్మాన్‌ భవ పథకం కింద ప్రతీ ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీ ఇస్తారు. ఆసుపత్రులు, వైద్య నిపుణుల మద్దతు లేకుండా ఆయుష్మాన్‌ భవ పథకాన్ని మోదీ ప్రవేశపెట్టారని విమర్శించిన రాహుల్‌ దాని స్థానంలో అందరికీ ఆరోగ్యం అందేలా ఆరోగ్య రంగంలోనే మార్పులు తీసుకువస్తామని అన్నారు. ఇందుకోసం జీడీపీలో 3 శాతం అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
అరుణాచల్‌ ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ లేని వంటి సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన అంటున్నారు.  

55 ఏళ్ల కాంగ్రెస్‌ వర్సెస్‌ 55 నెలల మోదీ పాలన
‘కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశాన్ని 55 ఏళ్లు పరిపాలించింది. కానీ జనం కోసం చేసిందేమీ లేదు. అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప దేశానికి జరిగే మంచి ఇది చెప్పుకోవడానికి వారికి ఏదీ మిగల్లేద’ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపిస్తున్నారు. గత అయిదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ఏం చేసిందో పదేపదే చెబుతున్నారు. బీజేపీ క్షేత్రస్థాయిలో ఓటుబ్యాంకుని పెంచుకోవడానికి వివిధ సంక్షేమ పథకాల కింద 22 కోట్ల మందికి లబ్ధి కలిగే చర్యలు చేపట్టింది. గత అయిదేళ్లలో జన్‌ధన్‌ యోజన కింద 34.87 కోట్ల బ్యాంకు అకౌంట్లు ప్రారంభించారు. ఇక విద్యుత్‌ వెలుగులు దేశమంతటా ధగధగలాడిపోతున్నాయి. 2.54 కోట్ల గృహాలకు విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంటే 2.5 కోట్ల గృహాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. 7 కోట్ల మందికి ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ ధరలకే గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశారు. అయిదు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతన్నలకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఏడాదికి 6 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆవాస్‌ యోజన పథకం కింద 1.5 కోట్ల కొత్త గృహాలు కట్టారు. అన్నింటికి మించి ప్రజా భాగస్వామ్యం కలిగిన స్వచ్ఛభారత్‌ పథకం అత్యంత ముఖ్యమైనది. ఈ పథకానికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించడంతో వీటినే కేంద్రం విస్తృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top