కొండపి టీడీపీలో రచ్చ రచ్చ

Conflicts Between Kondapi TDP Leaders Prakasam - Sakshi

ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా టీడీపీ నేతల సమావేశం

స్వామిని వ్యతిరేకిస్తున్న సీఎం సామాజిక వర్గం

ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌

అదే దారిలో జూపూడి ప్రభాకర్‌రావు

స్వామికి మద్దతుగా దామచర్ల పూర్ణచంద్రరావు, సత్య

అభ్యర్థి మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్‌

ముదిరిన వర్గ పోరు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కొండపి టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఇవ్వకూడదంటూ నియోజవర్గానికి చెందిన సీఎం సామాజికవర్గం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆదివారం కొండపిలో ఏకంగా బలప్రదర్శనకు దిగారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని కూడగట్టి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన గ్రానైట్‌ వ్యాపారి చింతల వెంకటేశ్వర్లు, పాలకేంద్ర మాజీ డైరెక్టర్‌ ప్రసాద్, రాఘవ, పోతు శ్రీనివాసరావు, చుక్కా రవికుమార్‌ తదితర ముఖ్య నేతలు ఎమ్మెల్యే స్వామిని తప్పించాలని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్‌ ఇవ్వకూడదంటూ సమావేశంలో డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ఉద్దేశాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్‌తో పాటు సీఎం చంద్రబాబుకు చేరవేసినట్లు సమాచారం. చాలా కాలంగా కొండపి టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నా ఇటీవల అవి తారా స్థాయికి చేరాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్‌ కుటుంబంలోని మనస్పర్థలు కొండపి టీడీపీలో చిచ్చు రేపాయి.

దామచర్ల జనార్థన్‌ ఎమ్మెల్యే స్వామికి వ్యతిరేకంగా ఉండగా, ఆయన చిన్నాన్న దామచర్ల పూర్ణ చంద్రరావు, ఆయన తనయుడు దామచర్ల సత్యలు ఎమ్మెల్యే స్వామికి మద్దతుగా నిలిచారు. దీంతో కొండపి టీడీపీలో రచ్చ మొదలైంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు టీడీపీలో చేరడంతో వర్గ విభేదాలు మరింతగా పెరిగాయి. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల విషయంలోనూ వర్గ విభేదాల ప్రభావం కనపడింది. దామచర్ల జనార్థన్‌ రాబోయే ఎన్నికల్లో జూపూడి ప్రభాకర్‌రావును కొండపి నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలపనున్నట్లు ప్రచారం సాగుతోంది. జిల్లా టీడీపీలోనూ ఈ ప్రచారం ఉంది. ఇందులో భాగంగా  కొండపిలో జరిగే కార్యక్రమాల్లో జూపూడి ప్రభాకర్‌రావు తరుచూ పాల్గొంటుండడం తెలిసిందే. మరోవైపు జూపూడి అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి రాబోయే ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసేందుకు అన్ని ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇదే సమయంలో దామచర్ల పూర్ణచంద్రరావు, సత్యలు దీనికి అడ్డుకట్ట వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.  రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్వామికి టికెట్‌ ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచారు.  ఈ మేరకు ఇప్పటికే మంత్రిలోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబులను సైతం కలిసి స్వామికి టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో స్వామికే టికెట్‌ ఇస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు దామచర్ల సత్య వర్గం ప్రచారం చేస్తోంది.

ఇదిలా ఉండగా నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తూ ఆదివారం కొండపిలో మరో మారు సమావేశం నిర్వహించడం జిల్లా టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. స్వామి అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, జూపూడి ప్రభాకర్‌ కాకుంటే కొత్త అభ్యర్థిని ఎంపిక చేసినా తమకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తేల్చి చెబుతోంది. ఆదివారం జరిగిన సమావేశం వెనుక జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్‌తో పాటు జూపూడి ప్రభాకర్‌ ప్రమేయం ఉన్నట్లు ఎమ్మెల్యే వర్గం భావిస్తోంది. మరోవైపు జిల్లా అధ్యక్షుడు జనార్థన్‌కు వ్యతిరేకంగా ఉన్న జిల్లా టీడీపీ నేతలు స్వామి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గం దామచర్ల సత్యతో పాటు ఎమ్మెల్యే స్వామికి మద్దతు పలుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీ జిల్లా నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒక్కోవర్గం ఒక్కొక్కరికి మద్దతు పలుకుతుండడంతో కొండపి టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల్లో చివరికి ఏ వర్గం విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top