బలవంతపు భూసేకరణ తగదు: కోదండరాం

Compulsory land acquisition is inadequate - Sakshi

తొగుట (దుబ్బాక): రైతుల ఆత్మగౌరవానికి భూమి ప్రతీక అని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. వేములఘాట్‌ గ్రామస్తులు చేపట్టిన దీక్షలు 500 రోజులకు చేరిన సందర్భంగా మంగళవారం వారికి సంఘీభావం ప్రకటించారు. కోదండరాం మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో బలవంతపు భూసేకరణ తగదన్నారు.

దొడ్డిదారిన కేసీఆర్‌ సర్కార్‌ తీసుకొచ్చిన 123 జీఓ రద్దు కోసం వేములఘాట్‌ రైతుల పోరాటం మొదలైందని గుర్తుచేశారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అన్ని హక్కులు లభించాయని.. అలాంటిది నీళ్లు ఇస్తామంటే తాము అడ్డుకుంటున్నామని మాపై బురద చల్లడం అధికార పార్టీ నాయకులకు తగదన్నారు.

మైదాన ప్రదేశంలో 50 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మించడం ఎంత వరకు అవసరమో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. మిడ్‌ మానేరు నుంచి శ్రీరాంసాగర్‌కు నీళ్లు తీసుకుపోతే.. ఇక మల్లన్న సాగర్‌ ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రజాభిప్రాయం సేకరించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top