పటేల్‌ సాహసంతోనే తెలంగాణ ఏర్పాటు: యోగి

UP CM Yogi Adityanath Slams TRS And Congress In Sanga Reddy - Sakshi

సంగారెడ్డి: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సాహసంతోనే తెలంగాణ ఏర్పడిందని ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి వచ్చిన యోగి ఆదిత్యానాథ్‌ మాట్లాడుతూ..వల్లభాయ్‌ పటేల్‌ చొరవ లేకుంటే నిజాం ఇక్కడి నుంచి పారిపోయేవాడు కాదన్నారు. కానీ కాంగ్రెస్‌ వల్లభాయ్‌ని విస్మరించిందని విమర్శించారు. మోదీ ప్రధాన మంత్రి అయ్యాక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రెండు కోట్ల మందికి ఇండ్లు కట్టించారని వెల్లడించారు. ఇప్పటికీ తెలంగాణ ఇండ్లులేవు..మరుగుదొడ్లు కట్టలేదని, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు దొందూదొందేనని అన్నారు.

కాంగ్రెసోళ్లు ప్రభుత్వం తమదే వస్తుందంటున్నారు..కానీ వాళ్లు వస్తే అంతా నష్టమేనని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా ఒరిగేదేమీ లేదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి..అలాగే తెలంగాణాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. బీజేపీ దేశ ప్రజల పార్టీ, తెలుగు గడ్డపై పుట్టిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు..సామాన్య కుటుంబంలో పుట్టిన మోదీ ప్రధాన మంత్రి అయ్యారు అంటే అది కేవలం బీజేపీ ఘనతేనని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల్లో కుటుంబ పాలనే ఉంటుందని అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. మత ప్రాతిపదకన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రజలను రక్షిస్తుంది.. అభివృద్ధి చేస్తుంది..రామ రాజ్యం తెస్తుంది..అట్టడుగు వర్గాల అభివృద్ధి బీజేపీకే సాధ్యమన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ బీజేపీకే ఓటేసి గెలిపించాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top