ఐటీ అటాక్‌..నిజమా కాదా?

CM Siddaramaiah Fires on BJP - Sakshi

మంత్రి మహదేవప్ప, కాంట్రాక్టర్ల ఇళ్లలో సోదాలు

అవాస్తవమన్న మంత్రి 

కేంద్రంపై సీఎం సిద్ధు మండిపాటు

సాక్షి, బెంగళూరు/ మైసూరు:ఎన్నికల వేళ మళ్లీ ఆదాయపు పన్ను దాడుల వార్తలతో తీవ్ర కలకలం నెలకొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నమ్మకస్తుడు, ప్రజాపనుల మంత్రి మహదేవప్ప నివాసాలపై ఐటీ శాఖ దాడులు జరిపినట్లు వార్తలు గుప్పుమన్నాయి. బెంగళూరుతో పాటు మైసూరులోని విజయనగర, టి.నరసీపురలోనున్న ఇళ్లలో మంగళవారం ఉదయం భారీగా సోదాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఆయనతో సంబంధమున్న 25 మంది కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అటు మంత్రి, ఇటు ఐటీ శాఖ దాడుల వార్తలను కొట్టిపారేయగా, సీఎం సిద్ధరామయ్య కేంద్రంపై ఆరోపణలు సంధించారు.

ఐటీని ఉసిగొల్పుతున్న మోదీ: సిద్ధు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో కావాలనే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈ విధంగా ప్రత్యర్థులపై ఐటీ శాఖను ఉసిగొల్పడం కేంద్రానికి ఇటీవలకాలంలో నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. హుబ్లీలో విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రధా ని మోదీ, ఐటీ శాఖ దురుద్దేశంతోనే తమ పార్టీ నేతలపై దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

నా ఇంటిపై దాడులు జరగలేదు
తన ఇంటిపై ఐటీ దాడులేవీ జరగలేదని మంత్రి మహదేవప్ప ప్రకటించారు. కేవలం కొందరు కాంట్రాక్టర్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసిందని, అంతేకానీ తన ఇంటిపై ఎలాంటి సోదాలు నిర్వహించలేదని తెలిపారు. ఐటీ దాడులపై ఆ విభాగం కూడా ఖండించింది. తాము ఎవరిపై ఎలాంటి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top