రెండు నెలల్లో ‘ఫెడరల్‌’ ఎజెండా

CM KCR comments about Federal Front - Sakshi

ఎజెండా బయటికొస్తే అద్భుతాలే: ముఖ్యమంత్రి కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఒకటిన్నర రెండు నెలల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌కు సంబంధించిన ఎజెండాతో ముందుకు వస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులు చేయాల్సిన పనిగా కాకుండా ఎజెండాతో నడిచే ప్రగతిశీల సూత్రం ఆధారంగా ఫ్రంట్‌ పని చేస్తుందన్నారు. తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ 2019 ఎన్నికల నాటికి బలమైన శక్తిగా రూపు సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే విధమైన భావాలు, అవగాహన ఉన్న వాళ్లు ముందుకు వస్తారన్నారు. ‘‘ఇవి సమీప భవిష్యత్తుకు సంబంధించిన రాజకీయాలు కావు. కేవలం రెండు మూడు పార్టీల కలయిక అస్సలు కాదు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తెచ్చిన ప్రతిపాదన. ఇది జన సమూహాల కలయిక. దేశ ప్రజల కలయిక. ఒకసారి ఎజెండా రూపొందించి బయట పెట్టాక అద్భుతాలు జరుగుతాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటించే రోజు కేసీఆర్‌ ఒక్కడే ఉండడు. పెద్ద బలగం ఉంటుంది. ఇందులో భాగస్వామ్యమయ్యే పార్టీలు అప్పటికే చేతులు కలిపి ఉంటాయి. ఉదాహరణకు బీఎస్పీ, తృణమాల్‌ కాంగ్రెస్‌ల చేరికతో పెద్ద బలగం తయారవుతుంది. జైల్లో ఏర్పాటైన జనతా పార్టీ 70 రోజుల్లో అధికారంలోకి వచ్చింది’’అని గుర్తు చేశారు.

సీఎం బుధవారం రాత్రి ప్రగతి భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో తాను చెప్పిందే జరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో మార్పు రావడం లేదని వాటిని ప్రజలు తిరస్కరించారని విశ్లేషించారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో సంఖ్యా బలమున్నా రాజ్యసభలో లేక బిల్లులను ఆమోదించుకోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితులను మార్చడమే మా ఫ్రంట్‌ ఉద్దేశం. టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఫెడరల్‌ ఫ్రంట్‌తోనే ఉన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీకీ ఆమె మద్దతు ప్రకటించలేదు’’అన్నారు. 

దేశానికే సిగ్గుచేటు 
దేశంలో పురోగతి మందగించిందని కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయంగా ట్రక్కుల వేగం గంటకు 80 కి.మీ. ఉంటే మన దేశంలో 24 కి.మీ. మాత్రమే.  గూడ్స్‌ రైళ్ల వేగం 80 కి.మీ. ఉంటే మన దగ్గర 26 కి.మీ. మాత్రమే. ఇది దేశానికి సిగ్గుచేటు. మౌలిక సదుపాయాలు మెరుగైతేనే దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నా ఇంకా సాగు, తాగునీటి కొరత ఉంది. రూ.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై వెచ్చించేది రూ.లక్షన్నర కోట్లే. ఇలా అయితే రోడ్లు, రైల్వేలు, పోర్టులు ఎప్పుడు బాగుపడతాయి? కేసీఆర్‌ ఫ్రంట్‌ సల్లబడినట్లేనని ఒకాయన అంటడు. ఇంత పెద్ద దేశానికి విధాన రూపకల్పన అంత సులువైన పనా? 130 కోట్ల జనాభా ఉన్న దేశం ఇంత నిదానంగా పురోగమిస్తే ఎలా అభివృద్ధి సాధిస్తం?మార్పు వస్తే తప్ప దేశం బాగుపడదు. ఒకప్పుడు మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా 1976 తర్వాత చేపట్టిన విధానాలతో మనను దాటేసి ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. జాతీయ పార్టీల ఘోర వైఫల్యమే ఈ దుస్థితికి కారణం’’ అని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top