వైఎస్‌ జగన్‌ సంధించిన హోదా బాణానికి..‘దేశం’ బేజార్‌..!

CM Chandrababu in shock with YSRCP's decision to resign - Sakshi

      వైఎస్సార్‌సీపీ రాజీనామాల నిర్ణయంతో సీఎం చంద్రబాబులో ఉలికిపాటు

      సమన్వయ కమిటీలో తీవ్ర అంతర్మథనం

      రాజీనామాలకు సిద్ధమంటూ మీడియాకు లీకులు

      హోదా ప్రస్తావన లేకుండా విలేకరుల సమావేశాలు

      ఎదురుదాడితో బయటపడేందుకు టీడీపీ ఎత్తుగడ

      జగన్‌పై దుర్భాషలకే మంత్రులు పరిమితం

      కేంద్రంపై ఒత్తిడి దేనికో క్లారిటీ నిల్‌

      హోదాపై ఇప్పటికీ నోరు విప్పని చంద్రబాబు

అవును బేజారే.. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల హక్కు – ప్రత్యేక హోదాను ఎందుకు తాకట్టు పెట్టారో.. తేల్చాల్సిన సమయం వచ్చిందన్న బేజారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు కోట్లు కేసులో బోనెక్కకుండా తప్పించుకునేందుకు ఈ రాష్ట్ర ప్రజలు చెల్లించుకున్న మూల్యం ఎంతో తేలవలసిన పరిస్థితి ఏర్పడిందన్న కలవరం. పార్టీ నేతలతో తెలుగుదేశం అధినేత సమావేశం జరుగుతున్నంత సేపూ షరామామూలుగా టీవీ స్క్రీన్‌ల మీద ‘లీకు హెచ్చరిక’ ఫ్లాష్‌లు మెరుస్తూనే ఉన్నాయి. లేస్తే మనిషిని కాదన్న స్థాయిలో మళ్లీ లీకుల యుద్ధం నడిచింది. సీఎం అయితే లేచి బయటకురాలేదు. మంత్రుల బృందం మాత్రం మీడియా ముందు తమకు అలవాటైన రీతిలో ప్రతిపక్షనేతపై శాపనార్ధాలు పెట్టారు. ప్రత్యేక హోదా గురించి మాత్రం.... ఆ ఒక్కటి అడక్కండి.

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించడం, కేంద్రానికి అల్టిమేటమ్‌ ఇవ్వడంతో అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం మొదలయ్యింది. పార్టీ సమన్వయ కమిటీ అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘ సమాలోచనలు జరిపింది. ఈ పరిస్థితి నుంచి ఎలా బైట పడాలో ‘దారి’తోచక రోజంతా రకరకాల ఎత్తులు వేశారు. రాజీనామాలకు టీడీపీ కూడా సిద్ధమంటూ అనుకూల మీడియాలో లీకు కథనాలు ప్రసారం చేశారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని, హోదా కోసం తాము ఊపిరున్నంత వరకు పోరాడతామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుండగా ‘అనుభవజ్ఞుడి’నాయకత్వంలోని అధికార పార్టీ సుదీర్ఘంగా జరిపిన సమన్వయ కమిటీ భేటీలో తాము ఏం చేయాలో తేల్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

ఊపిరి ఉన్నంతవరకు హోదా కోసం పోరాడుతూనే ఉంటామని, అదే తమ ప్రధాన ఎజెండా అని జగన్‌ కుండబద్దలు కొట్టడంతో అధికారపార్టీకి ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. ‘ఇప్పుడు మనమేం చేయాలి? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? హోదా ఆకాంక్ష అధికమవుతున్న నేపథ్యంలో అందరినీ ఎలా సమాధానపరచాలి’అంటూ అధినేత తర్జన భర్జన పడుతున్నారని బుధవారం చంద్రబాబునాయుడును కలిసిన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తన ముఖ్య అనుచరుల వద్ద వ్యాఖ్యానించడం చూస్తే ఆ పార్టీ ఎంత గందరగోళంలో ఉందో అర్ధమవుతోంది. రోజంతా రకరకాల లీకులు వదిలిన తెలుగుదేశం నాయకులు, మంత్రులు చివరకు ప్రతిపక్షనేతపై దుర్భాషలాడటానికి పరిమితమయ్యారు. ప్రత్యేక హోదా గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడాన్ని బట్టి అధికారపార్టీ చిత్తశుద్ధి బట్టబయలయ్యిందని విశ్లేషకులంటున్నారు. 

అనుకూల మీడియాలో లీకులు.. 
‘పదవులు ముఖ్యం కాదు. పదవులు లెక్క కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే మాకు మిన్న.. అందుకోసం అవసరమైతే మంత్రుల చేత రాజీనామాలు చేయిస్తాం’అంటూ చానళ్లలో వరుసగా లీకు కథనాలు.. చంద్రబాబు అన్నట్లుగా ఈ కథనాలను అనుకూల మీడియాలో ప్రసారం చేశారు. కానీ చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. 14 రోజులుగా ఆయన మౌనం పాటిస్తూ వస్తున్నారు. సమన్వయ కమిటీ భేటీ జరుగుతున్నంత సేపు ఈ లీకులే హల్‌చల్‌ చేశాయి. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తరువాత చంద్రబాబు ఎప్పటికప్పుడు తన అనుకూల మీడియాకు లీకులిస్తూ వాటి ద్వారానే వ్యవహారాలు నడిపిస్తున్నారు. రాష్ట్రానికి సరిగా నిధులు ఇవ్వనందున కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే ఎంతవరకైనా పోరాడతామని, కఠిన నిర్ణయమైనా తీసుకుంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  

ఎదురుదాడి చేయడమే వ్యూహం.. 
వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడి చేయడం ద్వారా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుదామని మంత్రులు, టీడీపీ నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. బుధవారం వెలగపూడి సచివాలయంలో పలువురు మంత్రులు, టీడీపీ నాయకులతో ఆయన సమావేశమైన సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల రాజీనామాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. దీని ప్రభావం ప్రజల్లో ఎలా ఉంటుంది, పార్టీ పరంగా ఏంచేయాలనే దానిపై చంద్రబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తకుండా ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు చెప్పినట్లు సమాచారం.

బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే రాజీనామాల పేరుతో నాటకాలాడుతున్నారని చెప్పాలని సూచించినట్లు తెలిసింది. రాజీనామాల ప్రకటన వల్ల ప్రజల్లో వారికి సానుకూలత ఏర్పడే పరిస్థితి ఉంటుందని, ఎదురుదాడి ద్వారా దాన్ని పక్కదారి పట్టించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మళ్లీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఒకేసారి ఎదురుదాడి చేయడమే మన వ్యూహమని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సివస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని మించిన ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తామని చెప్పడం వల్లే అందుకు ఒప్పుకున్నామని చెప్పాలని సూచించారు. పవన్‌కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీపై తొందరపడి విమర్శలు చేయొద్దని సూచించినట్లు తెలిసింది.  

ప్రతిపక్షనేతపై బురదజల్లడానికే
సమన్వయ కమిటీ సమావేశం తర్వాత మంత్రులు మాట్లాడుతుండటంతో ప్రత్యేక హోదా గురించి అధికారపార్టీ ఏమన్నా చెబుతారని అంతా అనుకున్నారు. కానీ ప్రత్యేక హోదా గూర్చి ఒక్క ముక్కా మాట్లాడలేదు. పైగా ప్రత్యేక హోదా గురించి నిరంతరాయంగా పోరాడుతున్న ప్రతిపక్షనేతపై బురదజల్లడానికి, దుర్భాషలాడటానికి పరిమితమయ్యారు. ఆత్మరక్షణలో పడిపోవడంతో దిక్కు తోచక ఎదురుదాడి చేసి గట్టెక్కాలనుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులంటున్నారు. జగన్‌ ప్రయోగించిన రాజీనామా అస్త్రం ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లిందని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విభిన్న వర్గాలు ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, విద్యార్థుల్లో మంచి సానుకూలత కనిపిస్తోందని పార్టీ ముఖ్య శ్రేణులతో పాటు నిఘా వర్గాలు కూడా చెబుతుండటంతో బాబులో ఆందోళన తీవ్రమెందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. అందుకే జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శల తీవ్రతను పెంచాల్సిందిగా అధినేత ఆదేశించారని వారు పేర్కొంటున్నారు. 

హోదాపై వైఖరేమిటి? 
సమన్వయ కమిటీ భేటీ తర్వాత రాష్ట్ర మంత్రులు విలేకరుల సమావేశాలలో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై అధికారపార్టీ వైఖరేమిటనేది ఎక్కడా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కేంద్రం మీద ఒత్తిడి తెస్తామన్నారు. దేని కోసం ఒత్తిడి తెస్తారో చెప్పలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామా లేక నియోజకవర్గాల పునర్విభజన కోసమా లేక పోలవరం కాంట్రాక్టుల కోసమా అదీ కాకపోతే రాజధాని నిధుల కోసమా అనే స్పష్టత వారికేలేదు. సమన్వయ కమిటీ భేటీలో గానీ, అనుకూల మీడియాకు ఇచ్చిన లీకుల్లో గానీ, మంత్రులు జరిపిన విలేకరుల సమావేశాల్లో గానీ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు.

అంబానీతో భేటీపై సర్వత్రా ఆసక్తి.. 
ప్రత్యేక హోదా గురించి రాష్ట్రమంతా అట్టుడుకుతున్నా నోరు మెదపని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెలవు రోజు సచివాలయంలో వీరిరువురూ ఎక్కువ సేపు ఏకాంత చర్చలు జరపడంపై ఆసక్తి నెలకొంది. ఆ మరునాడే టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరగడం గమనార్హం. సమన్వయ కమిటీ భేటీ తర్వాత మాట్లాడిన మంత్రులు ప్రత్యేక హోదా గురించి గానీ, రాష్ట్రానికి సంబంధించిన ఏ ఇతర సమస్యల గురించి గానీ ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి అసలు మాట్లాడనేలేదు. మరి దేని గురించి ఈ సమన్వయ భేటీ జరిగి ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top