మళ్లీ కోడ్‌ ఉల్లంఘించిన బాబు

CM Chandrababu Naidu Violets Model Code of Conduct - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని సీఎం చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రచార గడువు మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. అయినా ఆయన తనకే మద్దతివ్వాలని.. టీడీపీకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ మంగళవారం సా.6.11 గంటలకు లేఖ విడుదల చేశారు. అదీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు హోదాలో కాకుండా సీఎం అధికారి లెటర్‌ హెడ్‌పై విడుదల చేశారు. ఎన్నికల ప్రచార గడువు ముగిశాక ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారం చేయడం, లేఖలు రాయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. ఇది కంచే చేను మేసిన చందంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే 
‘పార్టీలో, ప్రభుత్వంలో అక్కడక్కడా కొన్ని పొరపాట్లు జరిగాయి. కొందరి వల్ల, కొంతమంది కార్యకర్తల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అన్నదమ్ముల మధ్య మాట పట్టింపుల కారణంగా, తల్లిలాంటి పార్టీకి, తండ్రిలాంటి నాయకుడికి నష్టం కలుగజేస్తామా? నన్ను చూసి ఓటేయండి. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో నేనే అభ్యర్థిని. మీకు ఎవరి వల్ల ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి బాధ్యత వహిస్తాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్ని కోరారు. ఎన్నికల ప్రచారానికి ముగింపు సందర్భంగా మంగళవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దానికిముందు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన మీడియా సమావేశంలో తాను చేసిన అభివృద్ధి ఇతర అంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ తాను శాశ్వతం కాదని, వ్యక్తులు శాశ్వతం కాదని రాష్ట్రం శాశ్వతమని, అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు.

 శాశ్వతమైన అభివృద్ధి, శాశ్వతమైన భద్రతకు మద్ధతు ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో అసాధ్యం అన్నదాన్ని తాను సుసాధ్యం చేసి చూపించానన్నారు. పెన్షన్లు, రుణమాఫీ, పట్టిసీమ, కాపు రిజర్వేషన్లు, రాయలసీమకు నీళ్లు, డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ, అన్న కేంటీన్లు, చంద్రన్న బీమా వంటి అనేకం చేశానని తెలిపారు. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లని చెప్పారు. రాష్ట్రంపై చాలా కుట్రలు చేశారని, ప్రధాని మోడీ వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. తన సంకల్పమే ఏపీని, టీడీపీని గెలిపించబోతోందని, ప్రభుత్వ పనితీరుపై వంద శాతం సంతృప్తి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల స్పందన ఇదే చెప్పిందని బాబు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు లక్షల కోట్లతో పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని, వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కాదని తనను చూసి ఓటేయాలని, తననే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడాలని చంద్రబాబు కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top