వైఎస్సార్‌సీపీ ఆటలు సాగనివ్వను

CM Chandrababu comments on YSR Congress Party - Sakshi

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

అసెంబ్లీకి రావడం లేదు.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు

గుంటూరు సభకు గూండాలను పంపారు

అక్టోబర్‌ నాలుగోవారంలో  ‘జయహో బీసీ సదస్సు’

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని.. జీతాలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో బుధవారం జరిగిన టీడీపీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవినీతి పార్టీ అని ఆరోపించారు. గుంటూరు సభకు గూండాలను పంపించారని..‘వారి ఆటలు సాగనివ్వను. మంచికి మంచి, చెడుకు చెడు’ అంటూ వ్యాఖ్యానించారు.  

కేంద్రం సహకరించడం లేదు
కేంద్రం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఏమాత్రం సహకరించడం లేదని చంద్రబాబు అన్నారు. ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వడం లేదన్నారు. ఏపీని పట్టించుకోకుండా..  తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన బిల్లులను నాలుగు రోజుల్లోనే పాస్‌ చేశారని, ఏపీ విషయంలో మాత్రం రాజధానికి నిధులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతున్నారని, పోలవరానికి సైతం నిధులు సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్రంపై ధర్మ పోరాటం కొనసాగుతుందని, బీజేపీకి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మైనారిటీల సదస్సు తరహాలో అక్టోబర్‌ నాలుగోవారంలో  ‘జయహో బీసీ సదస్సు’ నిర్వహిద్దామని, దేశంలో సగం తెలుగుదేశంతో మనం నినాదంతో ఈ కార్యక్రమం చేపడదామని చెప్పారు.

అక్టోబర్‌ రెండో తేదీన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభిస్తామని చెప్పారు. మంగళగిరిలో నిర్మిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యాలయం 3డీ డిజైన్‌ను సమావేశంలో చంద్రబాబు ఆవిష్కరించారు. రెండు లక్షల చదరపు అడుగుల్లో  పార్టీ కార్యాలయం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై విడివిడిగా తయారు చేసిన నివేదికలను సమావేశంలో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని, గెలిచే వారికే మళ్లీ అవకాశం ఉంటుందని చెప్పారు. నందమూరి హరికృష్ణ మృతిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top