ప్రజలను పట్టించుకోకుంటే ఇంతే..

CM Chandrababu comments on BJP - Sakshi

     యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు 

     బీజేపీతో పొత్తు వల్ల నా లక్ష్యం నెరవేరలేదు

     హోదాపై నేను గతంలో చెప్పిన మాటలు మర్చిపోండి

సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీలు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఫలితాలు కూడా విరుద్ధంగానే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలను పార్టీలు గమనంలోకి తీసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌ ఉప ఎన్నికల ఫలితాలు ఆలోచింపజేసేలా ఉన్నాయని, దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పారు.

బుధవారం తన నివాసం వద్ద గ్రీవెన్స్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తనకు, ప్రధానమంత్రి మోదీకి మధ్య విభేదాలు లేవని చెప్పారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు అనవసరమన్నారు. అయితే బీజేపీతో పొత్తు వల్ల తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదన్నారు. పొత్తువల్ల తెలంగాణలో ఉపయోగం ఉంటుందని భావించానని, ఏపీలో కేంద్ర సహకారం ఉంటుందనుకున్నానని అయితే అవి  రెండూ నెరవేరలేదన్నారు. గురువారంతో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నాలుగు దశాబ్దాలైందని, 40 ఏళ్ళ క్రితం ఇదేరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశానని చంద్రబాబు తెలిపారు.  

ఆ మాటలు మరిచిపోండి: వైఎస్సార్‌ సీపీపై ఎదురుదాడి చేయకుంటే విఫలమవుతామని పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. బీజేపీతో వారు కలుస్తున్నట్లు ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో తాను అన్న మాటలను మరచిపోవాలని, వాటిని పట్టించుకోకుండా హోదాయే పార్టీ విధానమని చెప్పి నినదించాలని సూచించారు. దళితతేజం తరహాలో మే నెల నుంచి అక్టోబర్‌ వరకు బీసీ, ఎస్టీ, మైనారిటీ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top