యూటర్న్‌ బాబు.. అదే డాబు

Chandrababu, who Claims to Have a 40-Year-old Political Experience, Has Never Stood by The Word - Sakshi

సాక్షి, అమరావతి : రెండు కళ్ల సిద్ధాంతం.. రెండు నాలుకల మనిషి.. రంగులు మార్చే రాజకీయ ఊసరవెల్లి.. ఒకటా.. రెండా.. చంద్రబాబుకు ఇలాంటి బిరుదులెన్నో.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ మాటపై నిలబడలేదు. సమయానుకూలంగా మాటలు మార్చి ప్రజల్లో యూటర్న్‌ బాబుగా ఖ్యాతిని ఆర్జించారు. 

అనేక అంశాల్లో తాను ముందు చెప్పిన వైఖరికి విరుద్ధంగా మాట్లాడటంతో ప్రజలే ఆయనకు యూటర్న్‌ బాబు అనే బిరుదును కట్టబెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి అత్యావశ్యకమైన ప్రత్యేక హోదాపై రెండు రకాలుగా మాట్లాడినప్పటి నుంచి ఆయనపై యూటర్న్‌ బాబు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు హోదా వద్దని, దానివల్ల ఏమీ ఉపయోగం లేదని చెప్పిన ఆయన.. బీజేపీకి కటీఫ్‌ చెప్పిన తరువాత హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, హోదా కావాలని యూటర్న్‌ తీసుకుని సంచలనం రేపారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కేంద్ర సాయం ఇలా ప్రతి విషయంపైనా యూటర్న్‌ తీసుకున్నారు. ప్రతిపక్షాలు ఆయన్ను యూటర్న్‌ అంకుల్‌ అని ర్యాగింగ్‌ చేశాయి. తాను కారులో వెళుతుండగా ఎక్కడ యూటర్న్‌ కనబడినా చంద్రబాబే గుర్తుకు వస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎన్డీఏలో కొనసాగుతూనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ బాబు యూటర్న్‌లు తీసుకున్నారని మోదీ ఎద్దేవా చేశారు. యూటర్న్‌ బాబుపై సోషల్‌ మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. యూటర్న్‌ అంకుల్‌ అని టైప్‌ చేస్తే గూగుల్‌లో సైతం చంద్రబాబు ఫొటోలు, యూటర్న్‌ సింబల్‌తో ఉన్న ఫొటోలే దర్శనమిస్తుండడం విశేషం.  

– బి.ఫణికుమార్,  సాక్షి, అమరావతి

పొత్తుల్లేకుండా పోటీ అంటే వణుకు.. 

చంద్రబాబునాయుడు ఏ ఎన్నికల్లోనూ పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీచేయలేదు. 1995లో బాబు ముఖ్యమంత్రి అయ్యాక 1996 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తుపెట్టుకున్నారు. 1998లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ వామపక్షాలతో, 1999లో లోక్‌సభ, శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీతో, 2004లో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో,

2009లో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలు, టీఆర్‌ఎస్‌(మహాకూటమి)తో, 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకున్నారు. ప్రస్తుత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో లోపాయికారిగా కాంగ్రెస్, జనసేనతో కలిసి పనిచేస్తున్నారు. జనసేనతో బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాక బీజేపీపై విమర్శల దాడి తగ్గించి.. ఆ పార్టీకి సానుకూల సంకేతాలు పంపారు.   

ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌ సీపీ పెట్టిన అవిశ్వాసంపై..  
మార్చి 10, 2018 : వైఎస్సార్‌ సీపీ అవిశ్వాసానికి మద్ధతివ్వం 
మార్చి 15, 2018 : వైఎస్సార్‌ సీపీ అవిశ్వాసానికి మద్ధతిస్తాం 
మార్చి 16, 2018 : వైఎస్సార్‌ సీపీ అవిశ్వాసానికి మద్ధతివ్వం, మేమే అవిశ్వాసం పెడతాం.

యూటర్న్‌లు ఇలా.. ప్రత్యేక హోదాపై.. 
ఏప్రిల్‌ 29, 2014 : మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇచ్చారు. 15 ఏళ్లు ఇవ్వాలని మోదీని కోరుతున్నా (తిరుపతి సభలో) 
ఆగస్టు 25, 2015 : ప్రత్యేక హోదా సంజీవిని కాదు. (ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఢిల్లీలో) 
మే 17, 2016 : హోదాతో ఏం వస్తుంది. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి 
సెప్టెంబర్‌ 15, 2016 : హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు 
ఫిబ్రవరి 3, 2017 : హోదా వేస్ట్‌. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు 
మే, 2018 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 
జూలై 25, 2018 : ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. కేంద్రం హోదా ఇవ్వకుండా అన్యాయం చేసింది 

నోట్ల రద్దుపై.. 
ముందు చెప్పిన మాట: నోట్లు రద్దు చేయాలని ప్రధాని మోదీకి సలహా ఇచ్చింది నేనే. నోట్ల రద్దు వల్ల అవినీతి తగ్గుతుంది. 
యూటర్న్‌ మాట: కనీస అవగాహన లేకుండా నోట్ల రద్దు చేశారు. ఏటీఎంలలో డబ్బు దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. నోట్ల రద్దు అతి పెద్ద వైఫల్యం .

జీఎస్టీపై.. 
మోదీతో కలిసి ఉన్నప్పుడు: జీఎస్టీ వల్ల మేలు జరుగుతుంది. ఒకే దేశం.. ఒకే ట్యాక్స్‌ విధానం మంచిది. దేశంలోనే ఇది మంచి సంస్కరణ. 
మోదీతో విడిపోయాక : జీఎస్‌టీ పెట్టి అన్నివర్గాలను దెబ్బతీశారు. వ్యాపారులు, సామాన్యులు కూడా ఇబ్బందుల్లో పడ్డారు. 

కేంద్ర సాయంపై.. 
మోదీతో కలిసి ఉన్నప్పుడు: ఏ రాష్ట్రం సాధించనన్ని నిధులు కేంద్రం నుంచి మేం సాధించాం. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.  
మోదీతో విడిపోయాక: కేంద్రం ఏపీకి నిధులివ్వడం లేదు. ఏపీ దేశంలో భాగం కాదా. మేం పన్నులు కట్టడం లేదా? 

జగన్‌ నవరత్నాల హామీలపై.. 
జగన్‌ హామీలు ఇచ్చినప్పుడు: ఆ హామీలు అమలు చేయాలంటే దేశ బడ్జెట్‌ కూడా సరిపోదు. ఏమీ తెలియకుండా అన్నీ ఇచ్చేస్తామంటున్నారు. అభివృద్ధి గురించి జగన్‌కేం తెలుసు. 
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు: పింఛన్‌ రూ.2 వేలకు పెంపు, వైఎస్సార్‌ ఆసరా చూసి పసుపు–కుంకుమ పథకం కాపీ. నవరత్న పథకాలను కాపీ కొట్టి ఒక్కొక్కటీ హడావుడిగా అమలు  

ఎమ్మెల్యేల కొనుగోళ్లు.. 
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపు సమయంలో: ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారు. వాళ్లు ఏ పార్టీలో గెలిచారు. ఏ పార్టీలో ఉన్నారు. 
ఏపీలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు: ఎమ్మెల్యేలు  అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నారు 

రాష్ట్ర విభజనపై..  
రాష్ట్ర విభజనకు ముందు: నేను ఇచ్చిన లేఖతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ, ఆంధ్రా నాకు రెండు కళ్లు. 
రాష్ట్ర విభజన తర్వాత: కట్టుబట్టలతో తరిమేశారు. అన్యాయమైన విభజన జరిగింది. రాష్ట్రం సర్వనాశనమైంది. 

మోదీ గురించి.. 
ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు: మోడీ ఇప్పటివరకూ పనిచేసిన ప్రధాన మంత్రుల్లో బెస్ట్‌ పీఎం. మోదీది, నాది మంచి జోడీ. 
ఎన్డీఏతో విడిపోయాక: చరిత్రలో మోదీలాంటి ప్రధానిని చూడలేదు. దారుణమైన మనిషి. పబ్లిసిటీ పీఎం. 

రాహుల్‌ గురించి..   
ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు: రాహుల్‌ మొద్దబ్బాయి. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితమైంది. 
ఎన్డీఏతో విడిపోయాక: రాహుల్‌ ప్రత్యేక హోదా ఇస్తానంటున్నారు. ఆయనతోనే దేశానికి భవిష్యత్‌ ఉంటుంది  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top