కోడ్‌ ఉల్లంఘించి బాబు లేఖలు

Chandrababu Violated the Election code Once Again - Sakshi

పసుపు, కుంకుమ, పింఛనుదార్లకు బాబు బొమ్మతో ప్రచారం 

రాష్ట్రంలో 1.25 కోట్ల మందికి పోస్టు ద్వారా చేర్చే యత్నం 

ఎన్నికల కోడ్‌కు విరుద్ధమంటూ చివర్లో గుర్తించిన అధికారులు

రూ.3 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం  

‘తూర్పు’లో డ్వాక్రా మహిళలతో ప్రమాణాలు 

గుంటూరులో తమ్ముళ్లకు పరాభవం

సాక్షి, శ్రీకాకుళం/వీరఘట్టం/గొల్లప్రోలు (పిఠాపురం)/పట్నంబజారు (గుంటూరు) : రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో బెంబేలెత్తిపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాని నుంచి ఎలాగైనా గట్టెక్కేందుకు ఎన్నెన్నో కుట్రలు చేస్తున్నారు. స్వయంగా ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించేందుకూ బరితెగిస్తున్నారు. తాజాగా.. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేస్తూ తన బొమ్మతో డ్వాక్రా మహిళలు, పింఛనుదార్లకు ఉత్తరాలు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కోటీ 25 లక్షల మంది ఓట్లను టార్గెట్‌ చేస్తూ లేఖలను పంపి ఎన్నికల కోడ్‌ను అపహాస్యం చేశారు.

వివరాలిలా ఉన్నాయి..
రాష్ట్ర ప్రజలను నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా కాలం గడిపిన చంద్రబాబు ఇటీవలే పసుపు–కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేల నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. అలాగే, నిన్న మొన్నటి వరకు రూ.వెయ్యి మాత్రమే పింఛను ఇచ్చిన సీఎం.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతానని ప్రకటించడంతో దానిని చంద్రబాబు కాపీ కొట్టారు. దీనిని ఓట్లుగా మలచుకోవడానికి పసుపు–కుంకుమ లబ్ధిదారులకు ఆయన నేరుగా లేఖలు రాస్తున్నారు. తనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఎలాగైనా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ఆయన ఈ లేఖల అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాలా శాఖ ద్వారా ఈ లేఖలను బట్వాడా చేస్తున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు, వృద్ధాప్య.. వితంతు పింఛనుదార్లు దాదాపు కోటీ 25 లక్షల మంది ఉన్నారు.

వీరందరికీ చంద్రబాబు బొమ్మ ముద్రించిన లేఖలను పోస్టల్‌ శాఖకు పంపించేశారు. అయితే, ఈ ఉత్తరాలపై స్టాంపుల్లేవని తపాలాశాఖ అధికారులు గుర్తించి పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఈ సంగతి తెలుసుకున్న చంద్రబాబు అండ్‌ కో హుటాహుటిన రూ.2.50 స్టాంపులను అతికించిన మరో కోటీ 25 లక్షల ఉత్తరాలను పంపించారు. దీంతో పోస్టల్‌ సిబ్బంది వాటి పంపిణీ చేసేశారు. అంతా అయిపోయాక.. చివరల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని పోస్టల్‌ అధికారులు గుర్తించి పంపిణీ కాని వాటిని నిలిపివేశారు. కానీ, ఇప్పటికే బట్వాడా అయిన వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోస్టల్‌ అధికారులు తెలిపారు. కాగా, ఈ లేఖల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3.10కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టింది.

‘తూర్పు’లో పచ్చనేతల బరితెగింపు
శ్రీకాకుళం జిల్లాలో లేఖలతో బరితెగించిన టీడీపీ.. తూర్పుగోదావరి జిల్లాలో మరో రకంగా ఎత్తులు వేస్తోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ పంచాయతీ కార్యాలయం సాక్షిగా టీడీపీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. పింఛను తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో చేతిలో చెయ్యి పెట్టించుకుని ఒట్లు వేయించుకుంటున్నారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేశామని, వచ్చే నెలలో రూ.3 వేలు ఇస్తామని టీడీపీకి చెందిన కొందరు నమ్మించే ప్రయత్నం చేశారు. చేసేవారు కావాలా.. చేస్తామని చెప్పేవారు కావాలా అంటూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేస్తామని పింఛనుదారులతో ఒట్లు వేయించుకున్నారు. కానీ, అధికారులు దీనిని తమకు పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.

గుంటూరులో ఎదురుతిరిగిన పింఛనుదారులు
గుంటూరు ఎనిమిదో వార్డులో ఉన్న మున్సిపల్‌ పాఠశాలలో బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడు ఖుద్దూస్‌ ఆధ్వర్యంలో 20 మంది పింఛన్‌ పంపిణీ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పింఛన్లు ఇస్తున్నది చంద్రబాబేనంటూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పింఛనుదారులు ఎదురుతిరిగారు. ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన తరువాతే పింఛను పెరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునంటూ సమాధానం చెప్పారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్‌ షేక్‌ గౌస్, డివిజన్‌ అధ్యక్షుడు షేక్‌ మోయిన్, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టీడీపీ నేతల తీరుపై వ్యతిరేకత రావటంతో వారు అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. 

బ్యాంకు వద్ద ఎమ్మెల్యే వర్మ హల్‌చల్‌
స్థానిక కొత్తపల్లి ఆంధ్రాబ్యాంకు వద్ద టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మంగళవారం హల్‌చల్‌ చేశారు. ‘పసుపు–కుంకుమ’ నగదు కోసం వేచి ఉన్న మహిళలను వెంట»బెట్టుకుని బ్యాంకు మేనేజరు వద్దకు వెళ్లి డబ్బులివ్వాలని పట్టుబట్టారు. మార్చి నెలాఖరువల్ల నగదు కొరత ఏర్పడిందని, నగదు వస్తే ఇస్తామని బ్యాంకు మేనేజరు తెలిపారు. ఆయన చెప్పేది వినకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చిందులు తొక్కారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top