ఆయనొస్తే.. అంతేమరి!

Chandrababu is very good in false promises and bad in Implementation - Sakshi

ఓట్లకు ముందు తాయిలాలు.. ఆ తర్వాత కోతలు

తప్పుడు వాగ్దానాలతో వంచించడంలో ఆరితేరిన సీఎం చంద్రబాబు 

2014 ఎన్నికల సమయంలో 600కుపైగా హామీలు ఇచ్చిన బాబు 

ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా దగా 

తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టో మాయం 

ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర 

వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలతో చంద్రబాబు బెంబేలు 

ఎన్నికలు వస్తుండడంతో ప్రజలను మరోసారి మోసగించేందుకు ఎత్తులు 

వృద్ధాప్య పింఛన్లను రూ.2,000కు పెంచుతున్నట్లు ప్రకటన 

గతంలో కిలోబియ్యం ధరను రూ.2 నుంచి రూ.5.25కి పెంపు

మద్యపాన నిషేధం ఎత్తివేత.. ఎన్టీఆర్‌ పథకాలకు వెన్నుపోటు  

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు గుప్పించడం, ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. అదే ఆయన అసలైన నైజమని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారు. నాలుగున్నరేళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న ఆయన టీడీపీ మేనిఫెస్టోలోని హామీలను అటకెక్కించారు. ఆ మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశారు. ఓట్ల కోసం తప్పుడు హామీలతో ప్రజలను వంచించడంలో చంద్రబాబు ఆరితేరిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త హామీలతో సరికొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీస్తున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ఆయన ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవర త్నాలను మక్కీకి మక్కీ కాపీ చేయడంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే భాగంగానే వృద్ధాప్య పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచుతున్నట్లు ఇటీవల హడావుడిగా ప్రకటించారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి ప్రస్తుతం కుటుంబానికి రూ.2.50 లక్షల వరకు ఉండగా, దాన్ని ఏప్రిల్‌ నుంచి రెట్టింపు చేస్తామని చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి మరికొన్ని తాయిలాలు ప్రకటించి, ఓటర్లను బుట్టలో వేసుకోవాలని చంద్రబాబు నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి రాగానే పింఛన్లను రెట్టింపు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది క్రితం వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే పింఛన్లను గతంలోనే పెంచేవారని, తీరా ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో ఈ హామీ ఇచ్చారంటే ఆయన మోసపూరిత వైఖరిని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 

బాబు పాలనలో హామీలన్నీ మాఫీ 
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలతో 50 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని, డ్వాక్రా, చేనేత రుణాలంన్నిటినీ రద్దు చేస్తామని, రైతులు బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసి, ఆ బంగారాన్ని తిరిగి వారి ఇంటికి చేరుస్తామని, రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటినీ (1.42 లక్షలు) భర్తీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, అలా ఉద్యోగం రాని వారికి నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ఏటా డీఎస్సీ వేసి, టీచర్లను నియమిస్తామని, మద్యం బెల్టు దుకాణాలను పూర్తిగా తొలగిస్తామని, రైతులకు 9 గంటలు నిరాటంకంగా ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని, పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని, ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తామని.. ఇలా అనేక హామీలు ఇచ్చారు.

ఇక కులాల వారీగా ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచి, గద్దెనెక్కాక కనీసం ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు. తొలిసంతకం అంటూ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, బెల్టుషాపుల రద్దు హామీలకు అధికారంలోకి వచ్చిన తొలిరోజే వెన్నుపోటు పొడిచారు. వ్యసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి దాన్ని నీరుగార్చారు. పలు షరతులు విధించి, రైతులను దగా చేశారు. రుణమాఫీ అంటూ ప్రభుత్వం ఇచ్చిన అరకొర సొమ్ము ఆ రుణాలపై బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోలేదు. ప్రభుత్వం మోసం చేయడంతో రైతుల రుణ బకాయిలు వడ్డీలు, చక్రవడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యాయి. అన్నదాతలు అప్పుల ఊబిలో మునిగారు. చివరకు వారికి జీరో వడ్డీ, పావలా వడ్డీ రుణాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరో గత్యంతరం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. 

కులాలకు హామీలిచ్చి చివరకు మొండిచేయి 
డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామాలను కూడా చంద్రబాబు తుంగలో తొక్కారు. మద్యం బెల్టుషాపుల రద్దు మాట అటుంచి వాటిని మరింత పెంచేసి ప్రతి గల్లీలో ఏర్పాటు చేయించి, రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో  అధికారం లేదని, కేంద్రం చేయాల్సి ఉంటుందని తెలిసినా ఎస్సీ, ఎస్టీల్లో, బీసీల్లో చేరుస్తామని పలు కులాలకు హామీ ఇచ్చి వారందరినీ మోసం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ఇప్పుడు కొత్తగా కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. హామీలను అమలు చేయకపోగా, అవినీతి అక్రమాలు అరాచకాలతో ప్రజలను వేధించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో వారిపై ప్రేమ ఒలకబోస్తున్నారని పరిశీలకులు తప్పుపడుతున్నారు. 

వైఎస్సార్‌సీపీ నవరత్నాలతో ప్రజల్లో భరోసా 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన నవరత్నాల హామీలు ప్రజల్లో పూర్తి భరోసాను, భవిష్యత్తుపై ఆశలను పెంచాయి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపాయి. పింఛన్ల పెంపు ఒక్కటే కాకుండా వైఎస్సార్‌ రైతు భరోసా పేరిట ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద రూ.50 వేలు, వడ్డీ లేని పంటరుణాలు, ఉచితంగా బోర్లు, 9 గంటల ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.1.50కు తగ్గింపు, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు సహాయ నిధి ఏర్పాటు, ప్రతి నియోజకవర్గానికి శీతల గిడ్డంగి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పాడి రైతులకు ప్రతి లీటర్‌కు రూ.4 చొప్పున సబ్సిడీ, వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్డు టాక్సు రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే భరించడం, వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, అన్నిరకాల వ్యాధులకు వర్తింపు, ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయడం, ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి తీసుకొనే వారికి ఆర్థిక సాయం, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక రోగులకు ప్రత్యేకంగా నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్‌ను నియమించి రూ.5 వేల వేతనం అందజేయడం, వారి ద్వారా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చడం, ఏ సమస్య అయినా 72 గంటల్లో పరిష్కరించడం, ప్రతి ఏటా జనవరి ఒకటిన ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేసి భర్తీ చేయించడం, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించడం వంటి హామీలను నవరత్నాల్లో చేర్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్థి చదువుకు అయ్యే ఫీజు మొత్తాన్ని చెల్లించడంతోపాటు వసతి, భోజన సదుపాయాల కోసం ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తామని తెలిపారు. పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడం, ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, అమ్మ ఒడి కింద పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల సాయం, వైఎస్సార్‌ ఆసరా కింద ఎన్నికల రోజు వరకు అక్కాచెల్లెమ్మలకు ఉన్న పొదుపు రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే అందించడం, సున్నా వడ్డీ రుణాలు ఇప్పించడం, వైఎస్సార్‌ చేయూత కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అక్కాచెల్లెమ్మలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు ఉచితంగా పంపిణీ చేయడం, జలయజ్ఞం కింద పోలవరం సహ అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం, మద్యపాన నిషేధం కింద మూడు దశల్లో మద్యాన్ని నిషేధించడం వంటి అంశాల్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన నవరత్నాల హామీల్లో ప్రకటించింది. 

చంద్రబాబు గంగవెర్రులు 
వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి దూసుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తరుణంలో గంగవెర్రులెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే అచ్చంగా నవరత్నాల హామీలనే కాపీ కొడుతూ ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు. పింఛన్లను రూ.2,000కు పెంచడమే కాకుండా ఒక నెల బకాయి రూ.1,000 కూడా వచ్చేనెలలో ఇస్తామని చంద్రబాబు ప్రకటిస్తున్నారంటే నవరత్నాలు ఆయనలో ఎంత గుబులు పుట్టిస్తున్నాయో స్పష్టమవుతోందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పథకాలుగా వాటిని ప్రకటించి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. కానీ, బాబు మాటలు నమ్మడానికి వీల్లేదని తేల్చిచెబుతున్నారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు గతంలో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలకూ వెన్నుపోటు పొడిచారని గుర్తు చేస్తున్నారు.

1994 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే రూ.2కే కిలోబియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి పథకాలను అమల్లోకి తెచ్చారు. అప్పటివరకు రైతులకు భారంగా ఉన్న వ్యవసాయ విద్యుత్తులో కూడా హార్స్‌పవర్‌కు రూ.50 వసూలు వంటి నిర్ణయాలు అమలు చేశారు. అయితే చంద్రబాబు 1995లో ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే రూ.2కే కిలోబియ్యం పథకానికి పాతరేశారు. కిలోబియ్యం ధరను అమాంతం రూ.5.25కి పెంచేశారు. ఆ తరువాత దాన్ని మరింత పెంచి పేదల నోటికాడ కూడును లాక్కున్నారు. అలాగే అంతకు ముందు ఎన్టీఆర్‌ పెట్టిన జనతా వస్త్రాల  పథకాన్ని చంద్రబాబు రద్దుచేశారు. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధానికి నిలువునా తూట్లు పొడిచి దానికీ మంగళం పాడేశారు. ఇక చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీ ఒక ప్రహసనమే. జన్మభూమి కమిటీల ద్వారా తమ పార్టీ వారికి, తమ అనుయాయులకు మాత్రమే పెన్షన్లను మంజూరు చేయించారు. అదికూడా గ్రామానికి కొంతమేర కోటాను నిర్ణయించి ఆ మేరకే పెన్షన్లు ఇచ్చారు.

ఎవరైనా కొత్తగా పెన్షన్‌ కావాలని దరఖాస్తు పెట్టుకొంటే జాబితాలోని వారిలో ఎవరో ఒకరు చనిపోతేనే గానీ కొత్తవారికి పెన్షన్‌ మంజూరు అయ్యేది కాదు. ఇది చంద్రబాబు గత పాలన అని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల హామీల ప్రభావం, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబు ఇప్పుడు విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారని, ఓట్లు దండుకోవాలన్న యావ తప్ప నిజంగా వాటిని అమలు చేసే ఉద్దేశం ఆయనకు లేదని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నికల ముందు ఆదరణ, సీఎంఈవై పథకాలను ప్రవేశపెట్టి అనంతరం వాటికి చెల్లుచీటీ పలికారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ ఆదరణ, సీఎంఈవై అంటూ ప్రజలను మోసగించే ప్రయత్నాలు ప్రారంభించారు. 

వైఎస్‌ పథకాలనూ నీరుగార్చే కుట్ర 
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలనూ గత అయిదేళ్ల కాలంలో  చంద్రబాబు తుంగలో తొక్కాలని ప్రయత్నించడాన్ని రాజకీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు నాయుడి గత పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలను కళ్లారా చూసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాను అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇళ్లు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి వాటిని పూర్తిస్థాయిలో అమలు చేశారు. హామీ ఇవ్వకపోయినా కొన్ని పథకాలను అమలు చేశారు. ఈ పథకాలను ఎత్తివేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్న భయంతో వెనుకంజ వేసి, ఆయా పథకాలను క్రమేణా నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొంటున్నారు.

వైఎస్‌ మంజూరు చేసిన పెన్షన్ల సంఖ్యలో కోత, ఇళ్ల నిర్మాణాలు నిలిపివేత, షరతులతో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వంటి చర్యలకు చంద్రబాబు దిగారు. ఇప్పుడు పెన్షన్ల పెంపుపై, ఆరోగ్యశ్రీ మొత్తం రెట్టింపు ప్రకటనలు చేసిన చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి మరిన్ని తాయిలాలతో మోసపూరిత ప్రకటనలు చేయనున్నారని చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపు, రైతులకు సాగు పెట్టుబడి, రుణాల పూర్తి మాఫీ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తారని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు గత చరిత్ర, గతంలో ఆయన పాలనలో చవిచూసిన చేదు అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలెవరూ ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేస్తున్నా ప్రజల నుంచి స్పందన కవువైందని గుర్తుచేస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top