మోదీ సాధించిందేమీలేదు..!

Chandrababu Strong criticism on PM Modi - Sakshi

     ఆయనతో విభేధించడం వల్లే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

     బీజేపీ నేతల్ని కృష్ణానదిలో ముంచితే పాపపు ఆలోచనలు పోతాయి 

     రాజధానిపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు

సాక్షి, అమరావతి:  పన్నెండేళ్ల పాటు గుజరాత్‌కు సీఎంగా ఉన్న నరేంద్రమోదీ అక్కడి రాజధాని అహ్మదాబాద్‌కు ఏం చేయలేకపోయారని, తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్న తాను సైబరాబాద్‌ సిటీని సృష్టించానని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం శాసనసభలో రాజధాని నిర్మాణంపై జరిగిన చర్చలో సీఎం  మాట్లాడారు. ఢిల్లీని తలదన్నేలా ఏపీ రాజధాని నిర్మిస్తామని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, బ్రిటీష్‌ వాళ్లకి తేడా ఏం లేదన్నారు. మోదీతో విభేధించడం వల్లే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమిత్‌షాకు నాయకునికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవని, బీజేపీ నేతల్ని కృష్ణానదిలో ముంచితే వారికున్న పాపపు ఆలోచనలు పోతాయని తీవ్ర విమర్శలు చేశారు.

రాజధాని నిర్మాణం వల్ల కేంద్ర ప్రభుత్వానికే లాభమని, రూ.48 వేల కోట్లతో నిర్మించే నిర్మాణాలతో కేంద్రానికి రూ.6 వేల కోట్ల ఆదాయం, పన్నుల రూపంలో మరో రూ.7 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాజధాని నిర్మాణాలకు సంబంధించి 59 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రాజధాని కోసం ఇచ్చిన నిధులకు సంబంధించి యూసీలు మొత్తం సమర్పించామని, నీతి ఆయోగ్‌ పరిశీలించి ఇంకా రూ.666 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే ఇంతవరకు అతీగతీ లేదన్నారు.  ఈ చర్చలో మున్సిపల్‌ మంత్రి నారాయణ మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు రూ.185 కోట్లతో టెండర్లు పిలిచామని, మౌలిక సదుపాయాలకు మరో రూ.218 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు.

బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ టీడీపీ సభ్యులు తప్పుడు సమాచారమిచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ నిర్మాణానికి కేటాయించింది రూ.300 కోట్లు అయితే రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారన్నారు. ఇంతలో సీఎం జోక్యం చేసుకుని గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చారో.. ఏపీకి ఎన్ని ఇచ్చారో పరిశీలించేందుకు కమిటీ వేద్దామా? అని  ప్రశ్నించారు.  కాగా, ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రపంచానికే ఆదర్శం కాబోతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఏపీ నెంబర్‌ వన్‌గా నిలుస్తుందని సీఎం అన్నారు. కేంద్రం నిర్ణయాల వల్లే ఉద్యోగావకాశాలు మందగించాయని  ఆరోపించారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top