భావితరాల భవిష్యత్‌ కోసమే కాంగ్రెస్‌తో జతకట్టా

Chandrababu Says Reasons About TDP and Congress Alliance - Sakshi

బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే ఢిల్లీలో పోరాటం

కాంగ్రెస్‌సహా మిగిలిన పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నా

అన్ని సీట్లలో టీడీపీని గెలిపిస్తే కేంద్రంలో మన పెత్తనమే

ప్రకాశం జిల్లా మార్టూరు సభలో సీఎం చంద్రబాబు  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో టీడీపీని గెలిపిస్తే కేంద్రంలో మన పెత్తనమే సాగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 35 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో పోరాడిన తాను రాష్ట్రహక్కులకోసం, భావితరాల భవిష్యత్‌కోసమే ఆ పార్టీతో జతకట్టి బీజేపీపై పోరాటానికి సిద్ధమైనట్టు చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన తొలిరోజు యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. టన్నెల్‌ పనులను పరిశీలించారు. ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. కిందటిసారి పర్యటనలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి సంక్రాంతికి నీరిస్తానని హామీఇచ్చిన సీఎం ఈసారి వచ్చే ఫిబ్రవరికి నీరిస్తానని చెప్పారు. అనంతరం మార్టూరు మండలం డేగరమూడిలో గ్రామదర్శిని సభలోను, తదుపరి మార్టూరులో జరిగిన గ్రామదర్శిని బహిరంగసభలో పాల్గొన్నారు. తర్వాత ఒంగోలుకు చేరుకుని సంతనూతలపాడు, యర్రగొండపాలెం నియోజకవర్గాల టీడీపీ నేతలతో మాట్లాడారు.

గవర్నర్ల వ్యవస్థను బీజేపీ నాశనం చేసింది..
మార్టూరు బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ సీబీఐ, ఆర్‌బీఐ, ఐటీ, ఈడీతోపాటు గవర్నర్ల వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని, అందుకోసమే బీజేపీని ఎదిరించేందుకు సిద్ధపడ్డానన్నారు. ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే ఢిల్లీలో పోరాటం చేస్తున్నానన్నారు. కాంగ్రెస్‌తోపాటు మిగిలిన పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రజలకోసమే తాను అన్ని కష్టాలు పడుతున్నట్లు చెప్పారు.

రాబోయే రోజుల్లో తనకు ఢిల్లీ వెళ్లే కోరికలేవీ లేవని చెప్పారు. మీకు సీఎంగానే ఉంటా..  నా కోరిక అదేనన్నారు. హైదరాబాద్‌ను అప్పగిస్తే పరిపాలించడం చేతగాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తననే తిడుతున్నాడని సీఎం విమర్శించారు. హైదరాబాద్‌ తన కష్టార్జితమన్నారు. ఎయిర్‌పోర్టు, సైబరాబాద్‌ నగరం, హైకోర్టూ తన కష్టార్జితమేనన్నారు. మంచికో చెడుకో విభజన జరిగింది.. న్యాయం చేయమంటున్నానన్నారు. పవన్‌కల్యాణ్‌ తనను తిట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని పవన్‌ నిజనిర్ధారణ కమిటీ వేశారని, తర్వాత ఆ కమిటీ ఏమైందో తెలియదన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టమంటే తాము పెట్టామని, తర్వాత ఆయన ఏమయ్యారో తెలియదన్నారు.

కాంగ్రెస్‌తో పొత్తును చారిత్రక ఉద్యమంగా ప్రచారం చేయండి
సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌తో పొత్తును చారిత్రక ఉద్యమంగా ప్రచారం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తెలంగాణలో తమతో పొత్తుకు కేసీఆర్‌ నిరాకరించారని, అందుకే అక్కడ పార్టీని నిలబెట్టుకునేందుకు మహాకూటమిలో చేరామని చెప్పారు. దేశానికి ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా టీడీపీ క్రియాశీలంగా పనిచేసిందని, వ్యవస్థలను పతనం చేయాలని ఎవరు చూసినా ఎదురొడ్డి నిలబెట్టామని, ఇప్పుడూ అదే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వారంలో తాను రెండుసార్లు ఢిల్లీ పర్యటనలు జరపడాన్ని దేశమంతా చూసిందని, ఒకరిద్దరు తప్ప అందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని తెలిపారు. మిగిలిన ఒకటి, రెండు పార్టీలనూ ఒకే వేదికపైకి తెస్తామన్నారు. దీన్నొక చారిత్రక ప్రజాస్వామ్య ఉద్యమంగా ప్రచారం చేయాలని, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. బీజేపీని ఎదుర్కోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top