నాకు కులం,మతం లేదు

Chandrababu says that he not have religion and caste - Sakshi

నంద్యాల, కర్నూలు పార్టీ నాయకుల సమీక్షలో చంద్రబాబు

విద్యార్థిగానే సామాజిక న్యాయం కోసం పోరాడాను

ప్రతి ఓటు అత్యంత ముఖ్యం.. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

సాక్షి, అమరావతి: తనకు కులం, మతం అనేది లేదని.. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడానని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సానుకూల  భావజాలమే తప్ప వ్యతిరేక భావజాలం తనకు తెలియదని, చిన్నప్పుడే తమ గ్రామంలో శ్రమదానం సంస్కృతి పెంచానని తెలిపారు. చదువుకుంటూనే పంట కాలువలను శ్రమదానంతో బాగుచేయించానని ఆ కోవలోనే గ్రామదర్శని, గ్రామ వికాసం కార్యక్రమాన్ని తెచ్చానన్నారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు, నాయకులతో సోమవారం మంగళగిరి సమీపంలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభజించి పాలించడమే బీజేపీ వ్యూహమని, అత్యంత విఫల ప్రధానిగా నరేంద్ర మోదీ మిగిలా రని వ్యాఖ్యానించారు.

డబ్బు, కులం, మతంతో రాజకీయం నిలబడేది కాదని.. ఏదో ఒక ఎన్నికకు మాత్రమే అవి పరిమితమని, పదేపదే ప్రతి ఎన్నికలో వీటినే ప్రయోగిస్తే ప్రజలు నమ్మరని తెలిపారు. ఏపీలోనే కాదు పశ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీ నేతలు కుట్రలు చేశారని, ఈవీఎంల మొరాయింపు, రాత్రి 9 గంటల దాకా పోలింగ్, హింసా విధ్వంసాలతో ఓటర్లను భయపెట్టారని ఆరోపించారు. తాను నాలుగు రకాల సర్వేలు చేయించానని, అన్ని సర్వేలలో టీడీపీ గెలుస్తుందని వచ్చిందని తెలిపారు. సంస్థాగత బలమే టీడీపీకి ఈ ఎన్నికల్లో ఉపయోగపడిందని, 65 లక్షల మంది కార్యకర్తలు, నాలుగు లక్షల మంది సేవామిత్రలు, 45 వేల మంది బూత్‌ కన్వీనర్లు, ఐదు వేల మంది ఏరియా కన్వీనర్లు తామే అభ్యర్ధులుగా భావించి కష్టపడి పనిచేశారన్నారు. ఎన్నికల్లో ఆఖరి ఘట్టం కౌంటింగ్‌ ప్రక్రియని.. ఏజెంట్లు, నాయకులు ఈ కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి బూత్‌లో, ప్రతి ఓటు అతి ముఖ్యంగా భావించాలని, అన్ని నియోజకవర్గాలలో ఏజెంట్లకు కౌంటింగ్‌పై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. 

ఇకపై కఠినంగా వ్యవహరిస్తా
ఈసారి మన పనితీరు విభిన్నంగా ఉంటుందని.. ఇకపై కఠినంగా వ్యవహరిస్తానని, సుస్థిరమైన చర్యలు తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు ఎవరికీ బెదిరిపోవాల్సిన పనిలేదని, ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. ఘర్షణలు వద్దని, గొడవలకు వెళ్లవద్దని గతంలో చెప్పానని.. కార్యకర్తల్ని కంట్రోల్‌ చేద్దామని అనుకున్నానని, ఇకపై అలా చేయనని తెలిపారు. పార్టీలో ఎక్కడ ఎవరు వ్యతిరేకంగా పనిచేశారు, పార్టీలోనే ఉంటూ ఎవరు సరిగ్గా పనిచేయలేదనే వివరాలను నివేదికలో ఇవ్వాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు భేటీలు నిర్వహిస్తామని, సేవామిత్రలు, కన్వీనర్లు, నాయకులతో సమావేశమవుతానని తెలిపారు. ఈ సమావేశంలో తొలుత వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top