బాబును తిరస్కరించిన సొంత జిల్లా 

Chandrababu Rejected by Chittoor district People - Sakshi

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అనూహ్య విజయం 

14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 కైవసం 

రెండున్నర దశాబ్ధాల తర్వాత చిత్తూరు పార్లమెంట్‌లో ఓడిన టీడీపీ 

సాక్షి, తిరుపతి/సాక్షి, అమరావతి:   టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మరోసారి భంగపాటుకు గురయ్యారు. ఆయన సారధ్యంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారి చిత్తూరు జిల్లా ప్రజలు ప్రత్యర్థి పార్టీ వైపే మొగ్గు చూపారు. 1999, 2004, 2009లలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోగా, 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 14 స్థానాలకు గాను 8 స్థానాల్లో గెలిచింది. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు సొంత జిల్లా ప్రజలు అవమానకరమైన తీర్పునిచ్చారు. 14 స్థానాలకు గాను 13 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధించింది. ఒక్క కుప్పం నుంచి చంద్రబాబు తప్ప మిగిలిన టీడీపీ అభ్యర్థులంతా చిత్తుగా ఓడారు. 1994లో ఎన్టీఆర్‌ ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 15 స్థానాల్లో 14 టీడీపీ గెలుచుకుంది. ఒక్క చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీకే బాబు విజయం సాధించారు. అప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ హయంలో సాధించిన విజయమే జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ ఎన్నికల్లోనే ఇంత భారీ స్థాయిలో విజయం సాధించి.. 1994 రికార్డును వైఎస్సార్‌సీపీ సమం చేసింది. 

రెండున్నర దశాబ్ధాల తర్వాత.. 
సుమారు రెండున్నర దశాబ్ధాల తర్వాత చిత్తూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో టీడీపీ ఓడిపోయింది. గతంలో కుప్పంలో వచ్చే మెజార్టీ ఆసరాగా చిత్తూరు పార్లమెంట్‌ స్థానాన్ని టీడీపీ సులభంగా కైవసం చేసుకునేది. 2004, 2009, 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచారు. ఇవే ఓట్లతో చిత్తూరు పార్లమెంట్‌ సీటును సైతం టీడీపీ గెలుచుకునేది. ఈ దఫా కుప్పంలో చంద్రబాబుకు మెజార్టీ భారీగా తగ్గడం, అదే సమయంలో పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ సాధించడంతో చిత్తూరు పార్లమెంట్‌ స్థానం వైఎస్సార్‌సీపీ వశమైంది. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున చిత్తూరు ఎంపీగా జ్ఞానేంద్రరెడ్డి గెలిచారు. ఆ తర్వాత నుంచి ప్రతిసారి టీడీపీనే చిత్తూరు ఎంపీ సీటును గెలిచేది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి రెడ్డెప్ప చిత్తూరు స్థానం నుంచి ఘన విజయం సాధించారు. 

బాబు గ్రాఫ్‌ తగ్గుతోందిలా.. 
1989 నుంచి కుప్పంలో పోటీచేస్తున్న చంద్రబాబు తొలిసారి బరిలో 6,918 ఓట్లతో గట్టెక్కారు. తర్వాత పార్టీని పటిష్టం చేసుకోవడంతో పాటు నేరుగా విపక్ష అభ్యర్థులను లొంగదీసుకోవడం ద్వారా రాజకీయంగా ఎదిగారనే విమర్శలు ఉన్నాయి. 1994లో 56,588 ఓట్లు, 1999లో 65,687 ఓట్ల ఆధి క్యం పొందారు. తర్వాత మెజారిటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2004లో 59,588, 2009లో 46,066, 2014లో 47,121 ఓట్ల మెజారిటీ రాగా ఇప్పుడు అది 30,722 ఓట్లకు పరిమితం అయ్యింది. 2014లో  మొత్తం 1,02,922 ఓట్లు రాగా ప్రస్తుతం 2,806 ఓట్లు తగ్గాయి. మరోవైపు చంద్రమౌళికి గతంలో 55,831 ఓట్లు రాగా ఇప్పుడు 13,420 ఓట్లు పెరిగాయి.  

బాబుకు చుక్కలు చూపించిన చంద్రమౌళి 
కుప్పంలో ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు చెమటలు పట్టించాయి. టీడీపీ అధినేత, నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు కుప్పం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి చుక్కలు చూపించారు. ఈ నియోజకవర్గంలో తమ గెలుపునకు ఢోకా లేదని భావించిన టీడీపీ శ్రేణులు ఎన్నికల కౌంటింగ్‌ మొదలు కాగానే తొలి రెండు రౌండ్లలో చంద్రమౌళికి ఆధిక్యం రావడంతో బిత్తరపోయాయి. కుప్పం నుంచి చంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా 1989, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఏడోసారి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశించిన టీడీపీ శ్రేణులు.. రెండు రౌండ్లలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

ఈ విషయం టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత కూడా ప్రతి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుతో పోటీ పడ్డారు. ఒకానొక దశలో ఇరువురి మధ్య పోరు రసవత్తరంగా మారింది. దీంతో ఆయనకు 20 వేల మెజారిటీ అయినా వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు చంద్రబాబు గెలిచినప్పటికీ గతంతో పోల్చుకుంటే మెజార్టీ భారీగా తగ్గించగలిగారు. గత ఎన్నికల్లో 47,121 ఓట్ల మెజారిటీ రాగా ఈసారి 70 వేలు వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కానీ 30 వేలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. గత నాలుగు ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబుకు వచ్చిన మెజారిటీల్లో ఇదే తక్కువ. దీంతో భవిష్యత్తులో కుప్పంలో కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురే రోజు వస్తుందని ఈ ఫలితాల సరళిని చూసిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top