జగన్‌పై మాటల దాడిని ముమ్మరం చేయండి

Chandrababu reference to ministers about to Campaign On YS Jagan - Sakshi

లేకపోతే ఇబ్బందులు పడతాం 

కేసీఆర్, మోదీతో జగన్‌ కుమ్మక్కయ్యారంటూ ప్రచారం చేయండి

కేసీఆర్, కేటీఆర్‌ ఆంధ్రాకు వ్యతిరేకమంటూ ప్రజల్లో ద్వేషం పెంచండి

మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడిని ఇంకా ముమ్మరం చేయాలని.. లేకపోతే ఇబ్బందులు పడతామంటూ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతిరోజూ మాటల దాడి చేస్తూనే ఉండాలన్నారు. తన పైనా, పార్టీ పైనా వైఎస్సార్‌సీపీ నేతలు చేసే విమర్శలకు కౌంటర్‌ ఇస్తూనే ఎదురుదాడి చేయాలని.. జగన్‌ నేరస్తుడని, అవినీతిపరుడని, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడంటూ విస్తృతంగా ప్రచారం చేస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. సోమవారం తాత్కాలిక సచివాలయంలో మంత్రులతో పలు రాజకీయ అంశాలపై ఆయన రెండు గంటలకుపైగా చర్చించారు. ఆ తర్వాత లంచ్‌ మీటింగ్‌లో కూడా ఎలా మాట్లాడాలి.. ఏం చేయాలనే దానిపైనే మంత్రులకు పలు సూచనలు చేశారు. జగన్‌ కేసీఆర్‌తో, మోదీతో కుమ్మక్కయ్యారంటూ ప్రచారం చేయాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్‌ ఆంధ్రాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ప్రజల మధ్య ద్వేషం పెరిగేలా చేయాలన్నారు. పార్టీలో తానొక్కడినే కష్టపడుతున్నానని, మంత్రులు సీరియస్‌గా తీసుకోవడంలేదంటూ మండిపడ్డారు. తనపై వివిధ పార్టీల నాయకులు చేసే విమర్శలకు కూడా తానే కౌంటర్‌ ఇచ్చుకోవాల్సి వస్తోందని, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కేటీఆర్‌ తనను విమర్శిస్తే ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు కౌంటర్‌ ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మంత్రులు స్పందించకపోవడం సరికాదని,  ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.  

కాంగ్రెస్‌తో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నా.. 
జాతీయ స్థాయిలో మోదీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, బీజేపీలోనూ ఆయనకు సానుకూలత లభించడంలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముందని, అప్పుడు రాష్ట్రపతి ఆ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారన్నారు. ఇది జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్, వివిధ పార్టీలతో కలిసి ఎన్నికలకు ముందే కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అయితే ఇందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ముందుకు రావడం లేదని చెప్పారు. మరోవైపు బీజేపీకి దూరమైన శివసేన వంటి పార్టీలు కూడా మళ్లీ వారితో కలిశాయని.. ఇవన్నీ బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆటంకంగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

నాపై కుల ముద్ర లేదు..! 
40 ఏళ్ల తన రాజకీయంలో ఎక్కడా కులముద్ర లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారంఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థులను ఎంపిక చేస్తానని చెప్పారు. నీతి, నిజాయితీ గలవాళ్లే టీడీపీలో చేరుతున్నారని.. అవినీతిపరులు వైఎస్సార్‌సీపీలోకి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. బాక్సైట్‌ తవ్వకాల వెనుక నిజాలను కిశోర్‌ చంద్రదేవ్‌ చెప్పారని.. ఆ తవ్వకాలను ఆయనే అడ్డుకున్నారన్నారు.ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులతో చంద్రబాబు సోమవారం ఉండవల్లిలో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.  

ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం.. 
గెలుపు అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో త్వరలో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. మంత్రివర్గం సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేవని తెలియడంతో దీనికి దూరంగా ఉండడం మంచిదని చంద్రబాబు నిర్ణయించారు. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, టీడీపీ అభ్యర్థికి వారు ఓటు వేసే పరిస్థితి లేదని తెలియడంతో పోటీ నిర్ణయాన్ని ఉపసంహించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీకి పలువురి పేర్లు పరిశీలించిన చంద్రబాబు సర్వేల్లో వారికి అనుకూలత కనిపించకపోవడం, పీడీఎఫ్‌ అభ్యర్థులు బలంగా ఉండడంతో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా పెరుగుతుందనే భయంతోనే బాబు వెనక్కి తగ్గినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top