ముస్లింలపై ‘ఓట్ల’ వల!

Chandrababu political play on Muslims - Sakshi

నాలుగున్నరేళ్లుగా మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు

తమ పార్టీ నుంచి ముస్లింలు ఎమ్మెల్యేగా నెగ్గలేదంటూ సాకులు 

తన కుమారుడిని ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి కట్టబెట్టిన బాబు 

దేశంలో ముస్లింల ప్రాతినిధ్యం లేని మంత్రివర్గం చంద్రబాబుదే 

బడ్జెట్‌ కేటాయింపులో 30 % కూడా ఖర్చు చేయని వైనం 

ఎన్నికలు సమీపిస్తుండడంతో ముస్లింలపై సీఎం కపట ప్రేమ

  మంత్రి పదవి ఇస్తానంటూ మభ్యపెట్టే యత్నం

నారా హమారా–టీడీపీ హమారా పేరుతో హంగామా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ముస్లింలను దూరం పెట్టి, కనీసం మంత్రివర్గంలోనూ స్థానం కల్పించకుండా అవమానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసం వారిని దగ్గరకు తీస్తుండడంపై విస్మయం వ్యక్తమవు తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక్కరైనా ముస్లిం లేని రాష్ట్ర మంత్రివర్గం చంద్రబాబుదే కావడం గమనార్హం. మంత్రి పదవి ఇవ్వడానికి తమ పార్టీ తరఫున ముస్లింలు ఎవరూ ఎమ్మెల్యేగా నెగ్గలేదని ముఖ్యమంత్రి ఇన్నాళ్లూ సాకులు చెప్పి తప్పించుకున్నారు. మరోవైపు తన కుమారుడు నారా లోకేశ్‌ను ఎమ్మెల్సీని చేసి, ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదే మార్గాన్ని అనుసరించి ఉండేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మైనారిటీ సంక్షేమానికి బడ్జె ట్‌లో కేటాయించిన నిధుల్లో కనీసం 30 శాతం సొమ్మును కూడా టీడీపీ ప్రభుత్వం ఖర్చుపె ట్టలేదు. దీన్నిబట్టి ముస్లింలపై చంద్రబా బుకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.  

హవ్వ.. బాబు మైనారిటీ పక్షపాతా?
నాలుగేళ్లపాటు ముస్లింలను అంటరానివారుగా పరిగణించి, ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో వారికి దగ్గరయ్యేందుకు పన్నిన వ్యూహమే ‘నారా హమారా, టీడీపీ హమారా’ సభలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం మత పెద్దలను, ఆ వర్గం నాయకులను చంద్రబాబు తరచూ తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడడం, ముస్లింలకు తాను ఎంతో చేసినట్లు వారితో చెప్పించుకోవడం ద్వారా తాను మైనారిటీ పక్షపాతినని నమ్మబలికేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్ల తన పాలనపై ఉన్న వ్యతిరేకతను నాటకీయంగా బీజేపీపైకి నెడుతూ ఆ పార్టీకి స్వతహాగా వ్యతిరేకంగా ఉండే ముస్లిం, ఇతర వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన గుంటూరులో నారా హమారా, టీడీపీ హమారా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాయిలాలు ప్రకటించి, ముస్లింలపై ఓట్ల వల విసిరేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ముస్లిం లేని కేబినెట్‌ ఇదే.. 
వాస్తవానికి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ముస్లింలను చంద్రబాబు అవమానించారనే వాదన మొదటి నుంచీ ఉంది. దేశంలో ముస్లింల ప్రాతినిధ్యం లేని ఏకైక మంత్రివర్గం ఇప్పుడున్న టీడీపీదే. గత ఎన్నికల్లో ముస్లింలు తనకు ఓట్లు వేయలేదనే అక్కసుతో చంద్రబాబు మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినా కేవలం తనకు ఓట్లు వేయలేదనే ఒకే ఒక కారణంతో ఆ వర్గానికి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. చాలా సమస్యలపై ఆ వర్గం నాయకులు కలిసినా చంద్రబాబు పట్టించుకోలేదు. నాలుగేళ్లలో ముస్లింల సంక్షేమం కోసం కనీసం ఒక కొత్త పథకాన్ని కూడా ప్రకటించలేదు. బడ్జెట్‌లో రూ.వందల కోట్ల కేటాయింపులు చూపుతున్నా అందులో 30 శాతం కూడా విడుదల చేయలేదు. దుల్హన్‌ వంటి పాత పథకాలను మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా కాకుండా ‘మెప్మా’కు అప్పగించి అవీ వారికి సక్రమంగా అందకుండా చేశారు. మైనారిటీ కార్పొరేషన్‌ ప్రాధాన్యాన్ని తగ్గించారు. ముస్లిం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. 

ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు ఆరాటం 
ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు తమపై హఠాత్తుగా అమిత ప్రేమ కనబరుస్తుండడం చూసి ఆ వర్గం నేతలు ఆశ్చర్యపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని, అందుకే ముస్లింలకు మంత్రి పదవి, ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్‌లకు రూ.3 వేల గౌరవ వేతనం అంటూ వరాలు కురిపిస్తున్నారని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ముస్లింలపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడంతో వారి మెప్పు కోసం అప్పటికప్పుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ను శాసన మండలి చైర్మన్‌ను చేశారు. అక్కడ వివిధ పార్టీల్లో ఉన్న పలువురు ముస్లిం నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు. ఇన్నాళ్లూ తాము అడిగినా పట్టించుకోలేదని, ఇప్పుడు అడగకుండానే అన్నీ చేస్తామని నమ్మబలుకున్న చంద్రబాబు తమకు నారా హమారా ఎలా అవుతారని, టీడీపీ హమారా ఎలా అవుతుందని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీల) ప్రాతినిధ్యం లేని మంత్రివర్గం కూడా చంద్రబాబుదే కావడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top