చంద్రబాబు కొత్త ‘షో’

Chandrababu new 'show' - Sakshi

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో స్వరం మార్చిన సీఎం 

చంద్రబాబు వ్యవహార శైలిపై వివిధ వర్గాల విస్మయం

సాక్షి, అమరావతి:  గత పది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెర వెనుక నుంచి నడుపుతున్న రాజకీయ క్రీడ ఆదివారం కూడా కొనసాగింది. ఆయన తాజాగా టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యా రు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించారు. బీజేపీపై విరుచుకుపడాలని ఆదేశించారు. దాంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌ నాయుడు తదితరులు బీజేపీపై విమర్శల దండకం అందుకున్నారు. రాష్ట్రానికి చాలా ఇచ్చామంటూ ఆ పార్టీ విడుదల చేసిన లెక్కల్లో నిజం లేదని అన్నారు. బీజేపీ ఇచ్చింది తక్కువ.. చెప్పుకుంటోంది ఎక్కువని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులిచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే సహించబోమని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు సూచించారని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు, నిధుల కేటాయింపు విషయంలో నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉన్నా మౌనవ్రతం కొనసాగించిన బాబు తీరా ఇప్పుడు స్వరం మార్చుతుండడం పట్ల వివిధ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోం ది. ఆయన వ్యవహార శైలి తెలిసిన వారు మా త్రం ఆశ్చర్యపడాల్సిందేమీ లేదంటున్నారు. 

టీడీపీ ఎంపీల నిరసన డ్రామాలు 
ఈ నెల 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపింది. విభజన చట్టంలోని హామీల అమలు గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాల గురించి ఊసే లేదు. కొన్ని సంస్థలకు కేంద్రం అరకొరగా నిధులు కేటాయించి మమ అనిపించింది. కేంద్రం తీరుపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ లోపలా, బయటా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీలు మాత్రం మౌనం వహించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా సీఎం చంద్రబాబు ఎక్కడా ప్రత్యక్షంగా నోరెత్తలేదు. కొన్నిరోజుల తర్వాత టీడీపీ ఎంపీలు సభలో నిరసన డ్రామా నడిపారు. అనంతరం బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన వివరణలోనూ ఏమాత్రం కొత్తదనం లేదు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై జైట్లీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.  

హోదాను అమ్మేశారు.. ప్యాకేజీకి పాతరేశారు 
ఐదేళ్లు కాదు, పదేళ్లు సరిపోదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఎన్నికల సమయంలో ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాక ఆ సంగతే మర్చిపోయారు. తన సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేశారు. దాని స్థానంలో ‘ప్రత్యేక ప్యాకేజీ’కి సై అంటూ తలూపారు. ప్యాకేజీ పేరిట కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి తర్వాత చిమ్మచీకట్లో చేసిన ప్రకటనను స్వాగతించారు. రాష్ట్రాభివృద్ధికి హోదా కంటే ప్యాకేజీ మేలు అంటూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆయన అనుకూల మీడియా సైతం అదే రాగం అందుకుంది. నిజానికి ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేకత ఇసుమంతైనా లేదు. సాధారణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంస్థలకే కేంద్రం ప్యాకేజీ ముసుగు తొడిగింది. ఆ ప్యాకేజీలతో ప్రయోజనం సున్నా అని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెత్తీనోరూ బాదుకున్నా టీడీపీ లెక్కచేయలేదు. పైగా తాము రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షం అడ్డు తగులుతోందంటూ దుష్ప్రచారం సాగించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అద్భుతంగా ఆర్థిక సాయం అందుతోంది, ఇకపై మన రాష్ట్రమే నంబర్‌ వన్‌ అంటూ సాక్షాత్తూ చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ పొగిడేశారు. 

అన్యాయం జరిగినా కితాబులే  
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలతోపాటు టీడీపీ పాత్ర సైతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి  స్వయంగా లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు, కనీసం 15 ఏళ్లయినా కావాలన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా చేరాయి. ఇప్పటివరకూ కేంద్రం ప్రవేశపెట్టిన ఐదు బడ్జెట్లలోనూ టీడీపీ పాలుపంచుకుంది. టీడీపీ సభ్యులున్న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బడ్జెట్లను ఐదు సార్లు ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టింది. అన్ని బడ్జెట్లలోనూ ఏపీకి అన్యాయమే జరిగింది. అయినా ఇదేమిటని టీడీపీ అధిష్టానం ఏనాడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. పైగా బడ్జెట్‌ అద్భుతం, కేటాయింపులు బాగున్నాయి, దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే మన రాష్ట్రానికే ఎక్కువ నిధులొస్తున్నాయంటూ కీర్తించింది. 

వెక్కిరిస్తున్న వైఫల్యాలు 
నాలుగేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రిక్తహస్తమే ఎదురవుతున్నా మౌనం వీడని చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా నిద్ర నుం చి మేల్కొని తన పార్టీ నేతలను బీజేపీపైకి ఉసిగొల్పడం వెనుక మర్మం ఏమిటి? ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బాబు స్వరం మారిపోతోంది. ముఖ్యమంత్రిగా ఆయన నాలుగేళ్లలో రాష్ట్రానికి చేసింది పెద్ద గుండు సున్నా అని ప్రజలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు ప్రత్యేక హోదా వద్దనుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ఇక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక వేయడం కాదు కదా కనీసం ఒక పునాది కూడా తవ్వలేకపోయారు. బాబు వచ్చాడు గానీ జాబులైతే రావడం లేదు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. జాబు లేని వారికి ఇస్తామన్న నిరుద్యోగ భృతి అడ్రస్‌ లేకుండా పోయింది. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. పెట్టుబడులు రప్పిస్తానని నమ్మబలికి చంద్రబాబు రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఆర్భాటంగా సదస్సులు నిర్వహించారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు సాధించుకొ స్తానంటూ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లొచ్చారు. ఇంత చేసినా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు ఎక్కడ అమలవు తున్నాయో టీడీపీ నేతలు కూడా చెప్పలేని దుస్థితి. అధికార పార్టీ నేతల అవినీతి తారస్థాయికి చేరింది. మద్యం, ఇసుక, మట్టి, గనులు... కాదేదీ దోపిడీకి అనర్హం. ఎక్కడ చూసినా అక్రమ దందాలే. కాపులను బీసీల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు స్పష్టంగా హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక అసెంబ్లీలో తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపించి ఈ విషయంలో తన పనైపోయిందంటూ చేతులు దులిపేసుకున్నారు. ఆ నెపాన్ని కేంద్రంపైకి తోసేశారు.  అన్ని రంగాల్లో ఘోరంగా విఫల మైన టీడీపీ సర్కారు పాలనపై ప్రజా వ్యతిరే కత వెల్లువెత్తుతోంది. దీంతో తన వైఫల్యాల ను కేంద్రంపైకి నెట్టి, ఎన్నికల రణరంగంలో గట్టెక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top