దేశాన్ని ఉద్ధరిస్తామన్న వారు ఇప్పుడేమంటారు...?

Chandrababu Naidu Slams Modi And Amit Shah About Karnataka Government Formation - Sakshi

సాక్షి, అమరావతి : కర్ణాటకలో  పరిస్థితి దారుణంగా ఉందని, సీనియర్‌ను పక్కన పెట్టి మరో వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. శనివారం ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ కర్ణాటకలో అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తుందన్నారు. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. గతంలో తమిళనాడులో కుట్రలు చేశారు...ఇప్పుడు కర్ణాటకలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

‘ప్రత్యేక హోదా గురించి ఎన్నికల ముందు నరేంద్ర మోదీ - అమిత్ షా ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారు. అప్రజాస్వామ్య విధానాలు అనుసరిస్తూ... దేశానికేం సంకేతాలిస్తారు? దేశాన్ని ఉద్దరిస్తామంటూ మాటలు చెప్పిన నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. కర్నాటక, తమిళనాడు లో గవర్నర్ వ్యవస్థను నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ఆరునెలల్లో అమరావతికి ఓ రూపు...
ప్రస్తుతం రాష్ట్రంలో పేదల కోసం 5 వేల వీకర్ సెక్షన్ ఇళ్లను అలానే ఎన్జీవోల కోసం మరో 2 వేల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. వీటిని త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అంతేకాక సాంకేతిక సాయంతో అమరావతి పనులను మరింత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పచ్చదనం, చెరువులు, కాల్వలకు అమరావతిలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు. శాశ్వత అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు నిర్మాణ పనులను కూడా త్వరగానే మొదలుపెడతామని, ఇప్పటికే 24 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు. తమ ప్రభుత్వం ఇంత కష్టపడి అభివృద్ధి చేస్తోంటే...కొందరు లేని పోని విమర్శలు చేస్తున్నారు ఇది మంచి పద్దతి కాదన్నారు.

కేంద్రం ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు ఏపీ రాజధానికి ఇవ్వడం సరికాదని, అనుకున్న రీతిలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే పన్నులు ఎక్కువగా కేంద్రానికే వెళ్తాయనే విషయాన్ని గమనించాలని చంద్రబాబు కోరారు. రాజధానిపై విమర్శలు చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని, ఆరు నెలల్లో రాజధాని అమరావతికి ఓ రూపు వస్తుందని తెలిపారు. త్వరలోనే అమరావతి బాండ్లు ఇష్యూ చేస్తామని, తక్కువ వడ్డీ దొరికే చోట రుణాలు తీసుకుంటాన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కుట్రలు పన్నితే మక్కెలిరగొడతామని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top