గెలుస్తామా? నమ్మమంటారా?

Chandrababu Naidu Public Meeting in Srikalahasti - Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం

పలమనేరు సభలో పదేపదే గెలుస్తామా.. లేదా అని ప్రశ్న

శ్రీకాళహస్తిలో సుధీర్‌ని కంట్రోల్‌లో పెడతానని హామీ

ఎస్సీవీని పరోక్షంగా విమర్శించిన బొజ్జల సుధీర్‌

బాబును కలవడానికి ఇష్టపడని బోస్, ఎస్సీవీ

తిరుపతి సభలో కనిపించిన అసమ్మతి ప్రభావం

సాక్షి, చిత్తూరు, తిరుపతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎన్నికల ప్రచార సభలో పదే పదే ‘గెలుస్తామా? నమ్మమంటారా?’ అంటూ టీడీపీ కార్యకర్తలను ప్రశ్నించారు. అదే విధంగా టీడీపీ అసంతృప్తులను బుజ్జగించి ఎన్నికల్లో పనిచేసేలా ఒప్పించేందుకు ఏర్పాటు చేసిన చంద్రబాబు పర్యటన లక్ష్యం కూడా నెరవేరకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం పలమనేరు, శ్రీకాళహస్తి, తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ఎప్పటిలాగే ఆదివారం కూడా 4 గంటలు ఆలస్యంగా పర్యటన సాగింది. జనాన్ని గంటల తరబడి ఎండలో నిల్చోబెట్టారు. ఇదిలా ఉంటే పలమనేరు ఎన్నికల ప్రచార సభలో పదే పదే గెలుస్తామా? లేదా? నమ్మమంటారా?’ అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించడంతో టీడీపీ శ్రేణుల్లోఆందోళన నెలకొంది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మళ్లీ ప్రస్తావించారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోగా మళ్లీ ఓటేస్తే వాటిని పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ‘ఎన్నికలకు సమయం లేదు, నాకు ఓపికలేదు, ఇప్పటికే నాకు గొంతుపోయింది, ఇక్కడ మైక్‌పోయింది, నేను అరవలేను తమ్ముళ్లు’ అంటూ తీవ్ర నిరుత్సాహంతో కార్యక్రమాన్ని కేవలం పది నిముషాలకే ముగించేశారు.

బొజ్జల సుధీర్‌ని కంట్రోల్‌లో పెడతా
శ్రీకాళహస్తి బహిరంగ సభలో చంద్రబాబు స్థానిక అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డిపై జనంలో ఉన్న అభిప్రాయాన్ని ముక్కంటీశుని సాక్షిగా ఒప్పుకున్నారు. బొజ్జల సుధీర్‌రెడ్డి నోటి దురుసు, జనం అంటే లెక్కలేని తనం, నాయకులను, కార్యకర్తలను బూతులు తిట్టడం, రారా.. పోరా’ అంటూ పిలవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ‘సుధీ ర్‌ని నేను కంట్రోల్‌ పెడుతాను’ అంటూ చంద్రబాబు ప్రస్తావించారు. బొజ్జల సుధీర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం ఇష్టం లేదని పరోక్షంగా ఒప్పుకున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వద్దంటేనే ఇచ్చానని స్పష్టం చేశారు. ఇదిలావుంటే సభకు వచ్చిన జనం ఎస్‌ఎస్‌ కెనాల్‌ని ఎప్పుడు పూర్తి చేస్తారు? నీళ్లు ఎప్పుడు ఇస్తారని అని ప్రశ్నించారు. బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిని పరోక్షంగా తిట్టారు. ఒకసారి ఓ వ్యక్తిని గెలిపిం చారని, అతని గూండాయిజాన్ని తట్టుకోలేక ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడించారని ఎస్సీవీ నాయుడుని పరోక్షంగా తిట్టడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.

బాబుని కలవడానికి ఇష్టపడని ఎస్సీవీ, బోస్‌
చంద్రబాబు పర్యటన ముఖ్య ఉద్దేశ్యం పలమనేరులో సుభాష్‌ చంద్రబోస్, శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, తిరుపతిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ శ్రేణులను కలిసి ఎన్నికల్లో పార్టీ కోసం పనిచెయ్యించడం. పలమనేరుకు చెందిన సుభాష్‌ చంద్రబోస్‌ని తీసుకొచ్చి చంద్రబాబును కలపడానికి మంత్రి అమరనాథరెడ్డి పోలీసుల ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సుభాష్‌ చంద్రబోస్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని ఊరికి దూరంగా ఉండిపోయారు. దీంతో బాబు ప్రచార సభను కేవలం పది నిముషాలకే ముగించి వెళ్లిపోయారు. శ్రీకాళహస్తి పర్యటనలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును పిలిపించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నం చేశారు. ఆయన కూడా పార్టీ అధినేతను కలిసేందుకు ఇష్టపడకపోవడంతో చంద్రబాబు తీవ్ర నిరుత్సాహంతో తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలోనూ టీడీపీ అసంతృప్తి నేతలు ప్రచార కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో హడావుడిగా ప్రచార కార్యక్రమాన్ని ముగించుకుని చంద్రబాబు అమరావతికి వెళ్లడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top