ఢిల్లీలో పలువురు నేతలతో చంద్రబాబు భేటీ

Chandrababu met with many leaders in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం ఢిల్లీలో పలువురు నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత తొలుత పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో ఎన్సీపీ నేత శరద పవార్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన పార్లమెంటు అనుబంధ భవనంలో జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొని 29 పేజీల బుక్‌లెట్‌ను ఆయా పార్టీల నేతలకు పంపిణీ చేశారు. ‘సేవ్‌ ది నేషన్‌.. సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఉన్న ఈ బుక్‌లెట్‌లో గడిచిన నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. తర్వాత  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాగా, న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు మాజీ ప్రధాని దేవెగౌడను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

ఫ్రంట్‌కు కాంగ్రెస్‌ నేతృత్వం వహిస్తుంది..: ఎంపీ గల్లా 
విపక్షాల ఫ్రంట్‌కు కాంగ్రెస్‌ నేతృత్వం వహిస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఇక్కడ చంద్రబాబు సమక్షంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. విపక్షాల సమావేశ వివరాలను ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వివరించారని, అన్ని పక్షాలు ఐక్యంగా ఉండాలని నిర్ణయించారన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన మంత్రి బదులివ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అధికార పక్షం సహకరిస్తే వాటన్నింటిపై నిలదీస్తామన్నారు. 2019 ఎన్నికల్లో ఉండేది బీజేపీ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని రెండే ఫ్రంట్లు అని, మూడో ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు. కాంగ్రెస్‌ ఫ్రంట్‌కు కన్వీనర్‌ ఎవరన్న అంశం చర్చకు రాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రబీలో 46 శాతమే పంట రుణాలు: సీఎం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీలో ఇప్పటివరకు 46 శాతం మాత్రమే పంట రుణాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నాలుగేళ్లలో రైతుల ఆదాయాలను రెట్టింపు చేశామన్నారు. ఉద్యానరంగ వృద్ధి లక్ష్యం 20.24 శాతానికిగాను 15.93 శాతం సాధించామని, పశు సంవర్ధకం లక్ష్యం 19.87 శాతానికిగాను 15.34 శాతం, ఆక్వా వృద్ధి లక్ష్యం 26.60 శాతానికి 22.36 శాతాన్ని సాధించినట్లు తెలిపారు. మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి లక్ష్యం 22 శాతానికి చేరుకోవాలన్నారు. ఈ ఖరీఫ్‌లో కరువు కారణంగా దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందాలు పరిశీలించాయని, కేంద్రం నుంచి ఇన్‌ పుట్‌ సబ్సిడీ రూ.1,869 కోట్లు వెంటనే మంజూరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో ఆక్వా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి లక్ష్యం 22.14 శాతంకాగా, తొలి అర్ధ సంవత్సరంలో 17.18 శాతాన్ని సాధించామన్నారు. జనవరికల్లా ‘స్వచ్ఛ సంక్రాంతి’గా అన్ని గ్రామాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top