సీఎం గ్రామదర్శినిలో నిర్బంధకాండ!

Chandrababu Fires on Central Govt At Grama Dharshini Program - Sakshi

     గురుపూజోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టు 

     సీపీఐ, సీపీఎం, రైతు సంఘం నాయకుల గృహనిర్బంధం 

     ఎత్తిపోతల పథకం పరిహారంపై నిలదీస్తారనే భయంతో పోలీసుల అత్యుత్సాహం

     ముందస్తు సమాచారం లేకుండా ఉక్కుపాదం 

     పెట్రోల్, డాలర్‌ వంద రూపాయలకు చేరతాయి: సీఎం చంద్రబాబు 

     అప్పుడు ఇందిర, రాజీవ్, సోనియాలతో పోరాడాం

     ఇప్పుడు మోదీతో పోరాటానికీ వెనుకాడబోం 

     వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే

సాక్షి ప్రతినిధి, ఏలూరు/చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న గ్రామదర్శిని కార్యక్రమంలో పోలీసులు అడుగడుగునా నిర్బంధకాండ అమలుచేశారు. విపక్ష పార్టీలైన వైఎస్సార్‌ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, రైతు సంఘం నాయకులపై ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువల తవ్వకాలకు సంబంధించి నష్టపరిహారం పెంచే విషయంపై రెండేళ్లుగా వివాదం నదుస్తోంది. నష్టపరిహారం పెంచలేదని పనులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో నిలదీస్తారనే భయంతో పోలీసులు అత్యుత్సాహంతో వీరందరినీ ముందస్తుగా అరెస్టులు, గృహనిర్బంధాలు చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జరగనున్న గురుపూజోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన చింతలపూడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త వీఆర్‌ ఎలిజా, పార్టీ మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, పార్టీ నేత వెంకటేశ్వరరావును ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే, ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతు సంఘం నేతలను గృహ నిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి రావడానికి ముందే పోలీసులు వీరందరినీ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల తీరుపట్ల వైఎస్సార్‌సీపీ ఇతర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమంగా అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. అలాగే, గృహనిర్బంధం అయిన వారిలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతు సంఘం నాయకులు ఉన్నారు.  ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో వీరిని విడుదల చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తారనే భయంతో ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం మంచిదికాదని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శించారు. 

రూ.40 కోట్ల పనులకు శ్రీకారం   
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం ఉ. 11 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌ ద్వారా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం చేరుకున్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా రూ.40 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తమ్మిలేరు రిజర్వాయర్‌పై రూ.16 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఫాతిమాపురం చెక్‌పోస్ట్‌ వద్ద నాగిరెడ్డిగూడెం రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిర్మించిన గ్రామ సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించే బోయగూడెం, సీతానగరం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మార్గమధ్యంలో ఎన్‌టీఆర్, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోయగూడెం గ్రామంలో కాలినడకన తిరిగి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా గ్రామదర్శిని సభాçస్ధలికి చేరుకుని ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. 

కేంద్రంలో చేతకాని పాలన 
నోట్ల రద్దు నిర్ణయంవల్ల కష్టాలు తప్ప ఏ ఒక్కరికీ లాభంలేదని, కేంద్రంలో చేతకాని పాలన సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో అభివృద్ధి ఆగిపోయిందని, రూపాయి విలువ కూడా పడిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇప్పుడు రూ.71.11 ఉందని, అది త్వరలో వంద రూపాయలకు చేరినా ఆశ్చర్యంలేదన్నారు. ప్రస్తుతం పెట్రోలు ధర లీటరు రూ.81.75, డీజల్‌ రూ.75.45 ఉందని, ఇవి కూడా త్వరలో సెంచరీ కొట్టే అవకాశం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. రాజధానికి రూ.50 వేల కోట్లు కావాల్సి ఉండగా రూ.1,500 కోట్లు ఇచ్చారని, కానీ.. ఇప్పటికే రూ.28 వేల కోట్ల పనులు ప్రారంభించామని చంద్రబాబు అన్నారు.

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని, కేంద్రంపై పోరాడుదామన్నారు. మనకు రావాల్సిన నిధులు, హక్కులు కాపాడి కేంద్రం సహకరించి ఉంటే, అభివృద్ధిలో మనం ముందుకు వెళ్లేవారమని చంద్రబాబు అన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉంటే కేంద్రం రూ.3,900 కోట్లు ఇచ్చి తప్పించుకుందని, వెనుకబడిన జిల్లాల అభివద్ధికి రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖకు రైల్వే జోన్‌ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేస్తోందని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి అన్ని వసతులు సమకూరుస్తామని చెప్పినా ముందుకు రాలేదని విమర్శించారు. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే మన రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి ఓటు వేసినట్లే. ఇది మీరు గ్రామగ్రామంలో ప్రచారం చేయాలి. అప్పట్లో ఇందిర, రాజీవ్, సోనియాగాంధీలతో పోరాడాం.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పోరాడటానికి కూడా వెనకాడబోం’ అని చంద్రబాబునాయుడు అన్నారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపామని, వాటి కోసం కేంద్రంపై పోరాడతామని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top