ఎందుకు ఓడామో తెలియట్లేదు

Chandrababu comments in the wide range of TDP meeting - Sakshi

టీడీపీ విస్తృత స్థాయి భేటీలో విపక్ష నేత చంద్రబాబు 

ఓటమిపై కారణాల అన్వేషణకు త్రిసభ్య కమిటీలు

మీ తీరువల్లే పార్టీకి ఈ దుస్థితి అంటూ సమావేశంలో బాబుపై నేతల విసుర్లు

సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలు తెలియడం లేదని పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో టీడీపీ ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒక కారణం ఉండేదని, ఈసారి మాత్రం ప్రజలు ఎందుకు ఓడించారో కారణం అంతుబట్టడం లేదని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఓ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 37 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఐదు సార్లు గెలిచామని, నాలుగు సార్లు ఓడిపోయామని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ శాశ్వతమని చెప్పారు. సీట్లు తగ్గినా ఓట్ల శాతం గణనీయంగా ఉందన్నారు. ఓటమికి కారణాలపై విశ్లేషించుకున్నామని, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడామని తెలిపారు. ఐదేళ్ల పాలనలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఓటమికి దారితీసిన అంశాలను పరిశీలించాలన్నారు. ఓటమికి కారణాలను లోతుగా విశ్లేషించేందుకు పార్లమెంట్‌ స్థానాల వారీగా త్రిసభ్య కమిటీలు నియమిస్తామని, కమిటీలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.  

నేడు డీజీపీ వద్దకు టీడీపీ నేతలు 
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. 22 రోజుల్లో వైఎస్సార్‌సీపీ దాడుల్లో ఐదుగురు చనిపోయారని, 73 మందిపై దాడులు జరిగాయని, 25 చోట్ల ఆస్తి నష్టాలు జరిగాయని పేర్కొన్నారు. దాడుల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపారు. దాడులపై సోమవారం డీజీపీని కలసి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. మరోవైపు తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. 

మీవల్లే ఓడిపోయాం..! 
ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి అధినేత చంద్రబాబు వైఖరే కారణమని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను గాలికి వదిలేసి అధికారులు చెప్పిన విషయాలనే నమ్మడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సమావేశంలో పలువురు నాయకులు చంద్రబాబు తీరును తప్పుబట్టారు. వేల మందితో ఒకేసారి టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఏం సాధించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు చంద్రబాబును నిలదీసినంత పని చేశారు. ఎవరైనా నిజాలు చెబుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో మానవీయ కోణం లోపించిందని, కార్యకర్తలు ప్రజలకు దగ్గరవలేకపోగా, జన్మభూమి కమిటీలు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల వ్యతిరేకత కొనితెచ్చుకున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ చెప్పారు.

చంద్రబాబుకు కార్యకర్తలకు మధ్య దూరం పెరిగిపోయిందని, కిందిస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకపోవడానికి ఇదే కారణమన్నారు. కార్యకర్తలను నాయకులు నిర్లక్ష్యం చేశారని, పార్టీకి నష్టం చేసే అంశాలను గుర్తించలేకపోయారన్నారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ నివేదికలను నమ్మడం వల్ల నిండా మునిగామని వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యుల అరాచకాలపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ఎన్నికల సమయంలో స్పష్టంగా కనిపించిందని పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి తెలిపారు. పరస్పర విబేధాల వల్ల నష్టపోయినట్లు అనంతపురం జిల్లా నాయకులు చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందులు, కేసులు పెరిగిన దృష్ట్యా పార్టీ లీగల్‌ వింగ్‌ను పటిష్ట పరచాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సూచించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top